సిద్ధిపేట జిల్లా పాటలు
పాటకు మానవుని జీవితానికి విడదీయని సంబంధం ఉంది. తెలుగు సాహిత్యంలో పాటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పండిత పామర జనరంజకంగా హృదయాన్ని చేరడంలో పాట మించిన సాహిత్య ప్రక్రియ లేదు. స్వేచ్ఛగా పాడేది పాట. పాటకు గేయం, గీతం సమానార్థకాలు. పాడేది గీతం లేదా గేయం (మాత్ర ఛందస్సు కలిగినది గేయం), (అమరకోశం పుట.1) ఊపిరి ఉఛ్వాసల, నిశ్ఛ్వాసల శబ్ధమే పాట.
పాటల ప్రాచీనత: తెలుగు సాహిత్యమున లిఖిత సాహిత్యానికి ముందే మౌఖిక పాటలు కలవని తెలియుచున్నవి. ఆదికవి నన్నయ్యకు ముందే తెలుగులో నాగీ గీతములు, వాలేశుపదములు, గొబ్బి పదాలు, నివాళి పదములు, తుమ్మెద పదాలు, వెన్నెల పదాలు, ప్రభాతపదాలు ...మొదలైనవి కలవని పేర్కొన్నారు.
జానపద పాటలు: జానపదులంటే పల్లెప్రజలు అని అర్థం. పల్లె ప్రజలు పాడుకునే పాటలే జానపద పాటలు. దీనినే నన్నెచోడుడు దేశియములు అని పేర్కొన్నాడు. ‘‘దేశిమార్గములు దేశీయములుగా1’’ చేయవలెనన్నాడు నన్నెచోడుడు. రోకటి పాటలు తరువోజ ఛందస్సులో ఉంటాయని విన్నకోట పెద్దన సూచన. నన్నెచోడుడు పేర్కొనిన అంకమాలికలు, గౌడు గీతములు, ఆరతులు జానపదగేయాలే.
జానపద విజ్ఞానాన్ని ఇంగ్లీష్‌లో folklore అనే మాటకు సరిసమానంగా వాడుతున్నాం. దీన్ని సూచించినది డబ్ల్యు .జె. థాంస్.‘‘అజ్ఞాత కర్తృత్వం, సామూహిక ప్రచారం, మౌఖిక సంప్రదాయము, ప్రాచుర్యం, సారళ్యం అనేక మనస్సుల నాకర్షించి సంపాదించిన జాతీయత’’ అని చేంబర్స్ విజ్ఞాన సర్వస్వం వివరిస్తున్నది.
‘‘పాట పక్షివంటిది, మాట మనిషివంటిది, పక్షి ఎగురగలదు, మనిషి ఎగురలేడు’’ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారన్నట్లు పాట వేలమందిని ఒకేతాటి మీదికి తెస్తుంది. పాట పక్షి ఎగిరినంత స్వేచ్ఛగా ఎగురుతుంది. అనేక ఉపన్యాసాల సారాంశం ఒక్కపాటతో సమర్థవంతంగా వివరిస్తుంది.
పాట పుట్టుక: తెలంగాణ నేలలో కష్టమొచ్చినా, నష్టమొచ్చినా పాటే. కరువొచ్చినా, కలత చెందినా పాట. దు:ఖం, విషాదం, సంతోషం, ఆక్రోషం మొదలైన భావనలు మనసుపొత్తిలు చీల్చుకొని ఉబికి వస్తుంటాయి.
పాట మనుష్యుని జీవితంలో భాగమైంది. పాటలేని జీవితాన్ని ఊహించుకోలేం. పనిలో గనిలో పాట. అలసట మరువడానికి పాటను ఆశ్రయించడం. ఉద్యమం, ఉపాధి, ఉజ్జీవం కోసం పాట అని కూడా చెప్పవచ్చు.
పిల్లలకు అన్నపానాదులు తినిపించటం. జోలపాడటం. లాలపోయడం. ఒకటేమిటి పాటలేని జీవితంలేదు. జీవనంలేదు. మనుగడలేదు. మానవపరిణామం లేదు. పాట పుట్టుకను పాటరూపంలో నిర్వచనం చెప్పిన తెలంగాణ కవి సుద్దాల అశోక్‌తేజ.
టపటప టపటప, శమటబొట్లు తాళాలై పడుతుంటే, పాట పనితోపాటే పుట్టింది, పనీ పాటతోనే జతకట్టింది.2 అని శ్రామిక సౌందర్య వాస్తవికతను నిర్వచించాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన చీకోడు నర్సింలు నిర్వచనం పాట రూపంలో వ్యక్తీకరించాడు.
‘‘పచ్చని పొలాల నడుమ పల్లెతల్లులు పాడుతుంటే,
గాజులన్ని నాదమాయెరా `
నా పల్లె పాట నావలాగ సాగిపోయేరా
కీచురాళ్ల చప్పుళ్ల కివ్వూన మోగంగా
కోకిలమ్మ కూతకూసెరా, దానికి తోడు రామచిలుక రాగమాయెరా’’3 అని శ్రమైక జీవన సౌందర్యాన్ని జానపద జనజీవన వాస్తవికతను మిళితం చేస్తూ వివరించాడు. అశోక్ తేజ, చీకోడు నర్సింలు పాటలు తొంభై దశకంలో చివరలో వచ్చాయి.
సిద్ధిపేట పాటలు: సిద్ధిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగం. ఐదు జిల్లాల సరిహద్దు. జిల్లాల విభజనలో ఇరవై రెండు మండలతో మూడు డివిజన్లతో జిల్లాగా ఏర్పడిరది. ఇక్కన్నుంచే తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాయి. దేశంలోని మొదటి ఎన్‌కౌంటర్‌లాంటి సంఘటనలు జరిగాయి.
ఆర్థిక, రాజకీయ, చారిత్రక చైతన్యంలో ముందుండడం వలన అది పాట సాహిత్యంలో చెరగుని ముద్రవేసింది. తెలుగు, తెలంగాణ నేలను చైతన్యవంతం చేసింది. అందుకని సిద్ధిపేట వివిధ భాగాలుగా పాట సాహిత్యాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.
జానపదాలు: జానపదం జాతి జీవనాళిక అన్నట్లు సిద్ధిపేట జనపదం జానపదం. చుట్టూ పల్లె పరిమళాలు పాటల్లో గుభాలిస్తుంది. జానపద బాణీల్లో జానపద పాటలు రాసి, రేడియో, టీవి కళాకారులుగా ఉన్నవారు సిద్ధిపేట జిల్లాలో కలరు.
‘‘సిద్ధిపేట చీరకట్టి ` సిరిసిల్లా రవికె తొడిగి,
నీ కోసం నేనే వస్తినిరో నా ముద్దూల మామయ్య’’4 అని ఎన్సాన్‌పల్లి ప్రభాకర్ విశేషమైన స్థానీయతను జోడిరచిన పాట ఎంతోమంది ఆదరాభిమానాలు పొందింది. రేడియో పాటగా తెలుగునేలను ఆహ్లాదపరిచింది
వివిధ ప్రక్రియల్లో సుస్థిరుడైన సాహితీవేత్త ఐతా చంద్రయ్య గారు జానపద పాటలు రాసారు. కాకతీయుల కాలం నుంచి ‘పుల్గనూరు’ గ్రామం నేటికీ పుల్లూరు బండ జాతర ప్రసిద్ధి గాంచింది. ఆ జాతర మీద రాసిన పాటను
జాతరంటె జాతర ` పుల్లూరుబండ జాతర
పుల్లూరు బండ జాతర ` పోదాము పదే జాతర6 అంటూ పుల్లూరు బండ జాతర ప్రాశస్త్యాన్ని వివరించాడు. ఐతా చంద్రయ్య గారి జానపద గీతాలు రేడియో, దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. ఈ క్షేత్ర గేయసాహిత్యం రాసిన వారిలో చీకోటి నర్సింలు, చొప్పదండి సుధాకర్ మొదలైనవారు కలరు.
ఉద్యమ గేయాలు: 1975 జూలై 25న సూరపనేని జనార్ధన్‌తో సహ నలుగుర్ని హతమార్చిన దేశంలోని ఎన్‌కౌంటర్ మొట్టమొదటి ఎన్‌కౌంటర్ గిరాయిపల్లి అడవుల్లో జరిగింది. తెలుగు కవులు కళాకారులు స్పందించారు. సిద్ధిపేటలోని యువకవులపై ఈ ప్రభావం పడిరది.
తెలుగు సాహిత్యంలో వచ్చిన పెనుమార్పులు సిద్ధిపేటను తాకాయి. వివిధ వాదాలు యువకుల్ని ప్రేరేపించాయి. మార్క్సిస్టు ధోరణితో రాసిన నందిని సిధారెడ్డి గారు ఏ ప్రక్రియ చేపట్టినా అత్యున్నత పరిణతి చెందిన నైపుణ్యం ప్రదర్శిస్తారు. మంజీర రచయితల సంఘంను స్థాపించి అనేకమంది యువకవులను ప్రోత్సహిస్తూ మెదక్ జిల్లా సాహిత్యాన్ని శిఖరాగ్రమున నిలపడంలో వారి కృషి అనన్య సామాన్యం.
వివిధ ఉద్యమాల్లో పాటలు: 1986లో మంజీర రచయితల సంఘం. సామాజిక బాధ్యతని గుర్తెరిగింది. సమానత్వ స్వప్నాన్ని కలగన్నది. స్థాపించగానే ప్రజా సమస్యలని భుజానికెత్తుకుంది. ప్రగతిశీల భావనతో పరిష్కారమార్గాలు చూపేవిధంగా రకరకాల కార్యక్రమాల ద్వారా చైతన్యం నింపింది.
గుట్క వ్యతిరేకోద్యమం, మద్యపాన నిషేధోద్యమం, పౌరహక్కుల పరిరక్షణ, ఎన్నో సమస్యల మీద పోరుసైరనయ్యింది. ఈ మరసం ద్వారా తెలంగాణ కోకిలగా పేరుగాంచిన బెల్లిలలిత సిద్ధిపేట పరిసర ప్రాంతాలను చైతన్యం నింపింది.
విప్లవోద్యమ గీతాలు: అమరవీరుల త్యాగాల్ని ఇక్కడి కవులు ఆలపించకుండా ఉండలేకపోయారు. తీవ్ర నిర్భంధం ఉన్నప్పటికీ నందిని సిధారెడ్డి గారు కోమల్ పేరు మీద అమరులకు జోహారులు అర్పించిన పాట ఎప్పటికీ నవనవలాడుతూనే ఉంటది.
‘‘జోహార్లూ జోహార్లూ అమరులకు జోహార్లు,
అమరులకు జోహారు అమర వీరులకు జోహార్లూ
మావుల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్లల్ల
తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు.’’7 అనీ, ఇదే పాటలో బువ్వా కొల్లగొట్టీ బూమాతాని చెరబట్టిన నైజం గుండెల్లో నిదురించిన వీరులను, ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరుల త్యాగాలను వివరిస్తాడు. ఇందులో ప్రాణమివ్వడమంటే పొద్దు పొడవడమాని చాటిచెప్పిన సాహసవీరులు నిర్మించిన పునాదుల్ని స్మరిస్తాడు.
దళితోద్యమ ప్రభావం: మహారాష్ట్రలోని దళిత పాంథర్స్ ప్రభావంతో తెలంగాణ నేల అంబేడ్కర్ భావజాలాన్ని పాటలతో చైతన్యం నింపింది. తెలుగునేలలోనే కాదు యావత్తు తెలుగులో అంబేడ్కర్ మీటింగ్‌లకు పాడే ఆరాధన గీతాలు అయ్యాయి.
మాష్టార్జీ ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఉంటున్నా మూలాలు గజ్వెల్ ప్రాంతం. వారి కలం నుంచి జాలువారిన పాట అంబేడ్కర్ స్తోత్ర గీతమైంది.
అందుకో దండాలు బాబా అంబేద్కరా
అంబరాన సుక్కలు కురువంగో,
నీతల్లి భీమబాయి, నీ తండ్రి రాంజీ
ఏప్రిల్ పద్నాలుగు దళితజాతి పీడితులకు పండగ రోజంటో ॥అందుకో॥ ఈ పాట దళిత జాతిని ఏకం చేసిందంటే అతిశయోక్తి కాదు.
మరోకవి భీమసేన గేయకవి దళితజాతి చైతన్యం కోసం రాసిన పాట అజరామరం. వారు పూలే నుంచి కాన్షీరాం వరకు స్తుతిస్తూ రాసిన పాట అమోఘం. దండమో మా దీన బంధులకూ మహనీయుల్లారా!, అందుకోండి పేదోల్ల దండాలు మహనీయుల్లారా!8 పాట ద్వారా ఏ దళిత సమావేశం ముందు పాడే ప్రభాతభేరిలా వ్యాపించింది. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చదువుతూ దరువు ఎల్లన్న మంచి మంచి మల్లేలేరి మల్లేపూల దండాలేత్తుమో అను పల్లవితో అద్భుతమైన పాటనందించాడు. కళాంజలి రాజేష్ అంబేద్కర్ జీవనాన్ని కవనం చేసి రసవత్తరంగా ఆలపించారు. అంబేడ్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్లే రేలారే శ్రీనివాస్ మొదలైనవారు ఉన్నారు.
పత్యేక తెలంగాణ ఉద్యమపాటలు: తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను, పండుగలను, ఆచారాలను వ్యాప్తిలోకి తేవడానికి పాటలు ఎంతగానో ఉపకరించాయి. తెలంగాణ సమాజం హత్తుకున్న పాటలు సిద్ధిపేటనుంచి వచ్చాయి. పాటలో స్థానీయతను గుప్పించి తెలంగాణ మెప్పించిన ఘనత సిధారెడ్డి పాటది.
‘‘నాగేటి చాల్లల నా తెలంగాణా నా తెలంగాణా,
నవ్వేటి బతుకులు నా తెలంగాణా నా తెలంగాణా,
పారేటి నీల్ల్ల `
పానాదులల్ల పూచేటి పువ్వుల్ల` పూనాసలల్ల,
కొంగు చాపిన నేల నా తెలంగాణా నా తెలంగాణా ,
పాలు తాపిన తల్లి నా తెలంగాణా నా తెలంగాణా’’అనే పాట నాగేటచాల్లల్ల అని పాట ఎత్తుకోవటం వల్ల ఈ ప్రాంతం వ్యవసాయాధారితం అని తెలియజేస్తున్నది. కాల్వల పారకం కానీ, నదీజలాల వినియోగం లేదని తెలపుటకు పునాస పదం తెలియజేస్తుంది. పునాస అనగా వర్షాధారం. ఈ పాట బతుకమ్మను , పీరీల పండుగను వివిధ పండుగలను కీర్తిస్తుంది. ఈ పాట తెలంగాణ సంస్కృతిని వివరిస్తుంది.
ఈ పాట అనతికాలంలోనే తెలంగాణ ఐకన్ గా మారింది. అనేక వేదికలమీద సంస్కృతిని ఆలపించడంలో తప్పనిసరి గేయమైంది. సిద్ధిపేట మాతృకగా జనించిన పాట ఖండాంతరాలు దాటింది. వీరతెలంగాణ సినిమాలో ఈ పాటకు నంది బహుమతి వరించింది.
తెలంగాణ ఉద్యమానికి పాటను అందించిన మరో సీనియర్ కవి దాసరాజు రామారావు. వీరిది సిద్ధిపేట మండలం పెద్దగుండవెల్లి. వీరు పాటలతో పాటు కవిత్వంరాసి తెలంగాణ భావజాల వ్యాప్తిలో తనవంతు పాత్రను పోషించాడు. గాయపడ్డ తెలంగాణ బాధ పోరుదారి నడుస్తున్న తీరును వివరిస్తూ రాసిన పాట
‘‘గళమెత్తీ పాడుతున్న గాయపడ్డ తెలంగాణ,
గావరైన తెలంగాణ ఆగమైన తెలంగాణ
హక్కులకై పోరాడుతున్నదో మన తెలంగాణ,
పోరుదారి నడుస్తున్నదో మన తెలంగాణ’’9
తెలంగాణ ఉద్యమంలో తనవంతుగా పాటద్వారా ఉద్యమానికి ఉప్పందించాడు. పోరు దారి నడుస్తున్న తెలంగాణను చిత్రించారు. వీరు అంగడిలో ఆగమైన అవ్వ, వీరులగన్నా విప్లవతల్లిరా అనే పాటలను కూడా రాసి ప్రజలని చైతన్యం చేసారు.
తెలంగాణ దండుకట్టిన విధానాన్ని, పోరుబాట ప్రస్థానాన్ని అక్షరీకరించి ఆలపించిన కవి బండారు నర్సింలు గజ్వెల్ గారు
తెలంగాణ రైతుల బాధలను కుప్పలుగా పెరుగుతున్న అప్పులను చూసి బాధపడుతడు. తీరని ఆకలి తేరని బాకీలు, కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలని గాంచి విలపిస్తూ ఎన్నాళ్లు సూద్దాము?అని ప్రశ్నిస్తూ తిరుగుబాటు పాటెత్తిన బండారు నర్సింలు తెలంగాణ కడుపుమంటను వినిపిస్తాడు.
‘‘అన్నా రారారో రైతన్నా లేలేరో,
దగాబడ్డ మన తెలంగాణా ,
దండూ గట్టిందీ దండోరా లేపిందీ’’10 అని తెలంగాణ స్పృహ కల్గిస్తాడు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోకపోతే జరిగే పరిణామాలను కూడా వివరించాడు. తెలంగాణ సాధించుకుంటేనే మన తలరాతలు మారుతాయనీ వివరిస్తాడు.
పేరునే ఆజాద్ (స్వాతంత్య్రం)గా పెట్టుకొని వలసపాలన చెరనుంచి విడుదలవ్వాలనీ కోరుతూ, ప్రజా తెలంగాణ తెద్దామనీ చైతన్య కోయిలయి పాడుతున్న పాటలో పదిజిల్లాల బతుకు బాధల్ని ఎల్లవోస్తున్నాడు. తెగువతో పోరుకడుతున్న దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు.
‘‘కోయిలాలో కోయిలమ్మో కోయిలాలో కోయిలమ్మో,
ప్రజాస్వామ్య తెలంగాణ తెద్దామురారే కోయిలాలో కోయిలమ్మో
బీదబిక్కి రైతులంత ఒక్కటయ్యి గట్టిగయ్యి, ప్రజా పోరాటంతో ముందుకొస్తున్నారు
బడుగు జీవులంతా గలసి ఒక్కటయ్యినారే ` కోయి, ప్రజాస్వామ్య తెలంగాణ సాధించరావే ` కోయి ॥కోయి॥’’11 దినదిన ప్రవర్థమానవుతున్న తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడే కళ్లకుకట్టి చూపిన పాట. ప్రజాస్వామ్యం తెద్దాం. బీదబిక్కి రైతులు, బడుగు జీవులు, సామాన్య జీవనం ఒక్కటయ్యి వస్తున్నారు.
తెలంగాణకు జరుగుచున్న మోసాలను ఎండకడుతున్న కవి మాదరబోయిన నర్సింలు. తెలంగాణ నిధులు, నీళ్లు,మలుపుక పోతండ్రు. మననోల్లని కొట్టి సింగరేణి బొగ్గుగనులు, ఖనిజాలు దోపుకపోతున్నవి. మన భాషను, యాసను కల్తీ చేస్తున్నారు.
బాధపడుతూ తెలంగాణ గాయాల్ని గేయాలు చేసి పాడుతున్నాడు.
‘‘తెలంగాణా తెలంగాణా ఎల్లన్నారో మల్లన్నారో,
తెలంగానకు జరిగే మోసం జూడు ఎల్లన్నారో ॥ తెలంగాణ॥’’ అని తెలంగా అక్కల్ని, తమ్ముల్ని మేల్కొలుపుతాడు. తిరుగుబాటు విత్తినాడు. తెలంగాణ సాధించుటలో ఢోకా తిన్నవాల్లనీ ఒక్కటయ్యి పోరుజేద్దామని పిలుస్తాడు.
తెలంగాణ పాటకు పట్టంకట్టిన సహజకవి అందేశ్రీ. పూర్తిపేరు అందె ఎల్లయ్య. వీరిది మద్దూరు మండలం రేబర్తి గ్రామం. వీరు ఏ పాట రాసినా హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. వీరు రాసిన గీతం తెలంగాణ విశేష ఆదరణ పొందింది. గల్లీనుంచి ఢల్లీిదాకా ప్రతి సభకు, సమావేశానికి తప్పనిసరి గేయంగా ఆలపించారు.
‘‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం,
ముక్కోటి తెలంగాణ ఒక్కటైన చేతనం
తరతరాల నీ చరిత తల్లీ నీరాజనం,
పదిజిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణా! జై తెలంగాణా!!’’12 అని గళమెత్తిన ఈ పాట ప్రతి నోటా, ప్రతి పూట ఈ పాట తెలంగాణగీతంగా పరిఢవిల్లింది. ఈ పాట తెలంగాణీయులు ఉద్యమ ప్రారంభంలో తప్పనిసరి ఆలపించే ప్రార్థనగీతం. ఇది తెలంగాణా ప్రభాతగీతం.
మరో సిద్ధిపేట కవిగాయకులు భీమసేన. అంతరించి పోతున్న తెలంగాణ అస్తిత్వాన్ని బహుజన కోణంలో పాటలు అల్లి భౌగోళిక తెలంగాణ కాదు బహుజన ప్రజాస్వామ్య తెలంగాణ కావాలంటాడు.
‘‘నా తెలంగాణ పల్లెను సూడమ్మ,
నా తెలంగాణ తల్లిని సూడయ్య’’13 అని తెలంగాణ భూస్వామ్య పెత్తందార్లు కాకుండా బహుజనుడేలేటి తెలంగాణ రావాలని ఆకాంక్షిస్తాడు.
సిద్ధిపేట పాటలో పోరాట పటిమ, బాధలో కన్నీటి సెల్మె. నవరసాల్ని కలిపినట్లుగా చీకోడు నర్సింలు తన పాటలకు ప్రాణం పోస్తాడు. వీరి పాటలు ప్రతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే ప్రతిచోట వినపడుతుంటాయి. తెలంగాణ కోసం పాడిన పాట
‘‘కదం తొక్కుతూ పదం పాడుతూ పల్లెలన్ని ప్రభంజనమయ్యి, ముక్కోటి తెలంగాణ వారసుల మొక్కటై గర్జించి సాగుదమా’’అని తెలంగాణ పోరులో ప్రత్యేకశైలిలో ప్రజల్ని ఉద్యమం వైపు మమేకం చేస్తాడు.
తెలంగాణ ఉద్యమాన్ని వలసాంధ్ర పాలన మీద తిరుగుబాటు ఎచ్చరిక జారీచేసిన అమరవాది రాజశేఖర శర్మ మా తెలంగాణ మాకు ఇమ్మని మర్యాదగ అడుగుతుంటే చేతగాని వాళ్లమని, చేవలేని వాళ్లమనీ అనుకుంటే ఎన్నడైన ముప్పు తప్పదనీ ఎచ్చరిస్తాడు.
‘‘చిగురించని వసంతమా
` శిశిరందాటని కాలమా, ఆకలి కేకల గానమా ` అరవై యేండ్ల ప్రాణమా’’ అనే పాట ద్వారా తెలంగాణ ఆకాంక్షను చిత్రిక పట్టిండు. ఈ పాట ‘బతుకు చిత్రం’ సీడిలో రికార్డు చేయడం జరిగింది.
తెలంగాణ ఉద్యవ,నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఉద్యమ సమయంలో రాసిన పాట
గడబిడ చేస్తుండ్రు గాబర చేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు మొండికి వోతుండ్రు అనే పాటవల్ల వలసాంధ్రుల మోసకారితనాన్ని ఎండగట్టారు.
కళాబృందం ఇంటిపేరుగా స్థిరపడ్డ కవిగాయకులు రసమయి బాలకిషన్‌గారు. ‘రసమయి పాట కేసీయార్ మాట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోపానం’ అన్న నినాదంతో పాటకు పట్టం కట్టి చెరపట్టిన వలస పాలన మీద సాంస్కృతిక తిరుగుబాటు ప్రకటించాడు. తెలంగాణ ఉద్యమంలో వీరు నిర్వహించిన ధూం ధాం పాత్ర అమోఘం. ధూం ధాం వేదిక తెలంగాణ ప్రజల్ని ఉర్రూతలూగించింది.
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అకాలమరణం తెలంగాణ వాసుల్ని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశపతి శ్రీనివాస్‌గారు జయశంకర్ సార్ మీద రాసిన పాటలో వారి ఆశల్ని రాగాలపన గావిస్తూ...
‘‘తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సార్,
అలుగు దుంకిపారు పదునైన మాటజోరు
పాలువోసుకున్న పజ్జొన్న కంకులల్ల,
పైకిపైకి ఎగిరే ఆ పాలపిట్టలల్ల / మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు’’ అని పెద్ద దిక్కుని తలుచుకుంటు మనల్ని వారి ఆశయసాధనలో ముంచి మనకు ప్రేరణను అందిస్తాడు. వట్టికోట ఆళ్వారుస్వామి మీద కూడా పాట రాసారు.
అమర వీరుల స్మరణ: తెలంగాణ విద్యార్థి అమర వీరుల మీద ఎన్నో పాటలు వచ్చాయి. సిద్ధిపేట జిల్లా నుంచి పొన్నాల బాలయ్య గారు శ్రీకాంత చారి, వేణుగోపాల్ లాంటి అమర వీరుల మీద రాసిన పాట మనల్ని ఎతల శోకం ఎల్లిపోయిన మిమ్మల్ని ఎట్లా మరిచిపోదాం అని ప్రశ్నిస్తాడు.
‘‘విద్యార్థి వీరులకు వందనం ` అమరులైన ధీరులకు దండమో, వంగి వంగి పాదాలకు వందనాలు జేసెదము’’ అని అమరత్వానికి వందనాలు జేద్దామని ప్రజల్ని మేల్కొల్పుతూ గునుకపువ్వు రెమ్మలార గుండెల దాసుకొని తెలంగాణ వచ్చేదాకా తెగించి పోరాడుతం అని స్మరిస్తాడు.
‘‘తెలంగాణ సాధనకై తెలంగాణ సోదరా,
తెగించి పోరాడుదాము తెలంగాణ సోదరా’’ అని పేర్కొన్న గేయకవి అకరాయ. తెలంగాణ భావజాలమే గాకుండా వివిధ సామాజిక కోణాలను పాటల్లో సృజిస్తున్న కవి పర్కపల్లి యాదగిరి. కొండి మల్లారెడ్డి వివిధ పాటలు రాసాడు.
కొమ్ము బద్ధిరాజుగారు ‘నా గొంతుక’ అనే పాటల పుస్తకాన్ని ముద్రించారు.
"స్త్రీ జాతి చిన్నపోతున్నాదో - సృష్టికి అవమానం అవుతా ఉన్నాదో"అనే బద్దిరాజు పాట చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.
వివికన్నా గారు అనేక పాటలు రాసారు. వాటిలో సిద్ధిపేట ప్రాశాస్త్యాన్ని తెలుపుతూ రాసిన పాట త్యాగాల సిద్ధిపేట ఉద్యమాల కంచుకోట అని వర్ణిస్తాడు.
‘‘అవనిపైన ఒక స్వర్గం అందాలు ఒలికేటి నగరం,
నా సిద్ధిపేట జిల్లా ` ఇది ఉద్యమాల ఖిల్లా’’ అంటూ రమణీయంగా వివరిస్తాడు. వి.వి. కన్న సిద్ధిపేట పట్టణముపై ఆసక్తి రేకెత్తించే పాటలు రాసాడు.
వానకు దోసిళ్లు పట్టాలే మన వాగు వంకలు నిండి పారాలే,
ఊరూర సెరువులు నిండాలే అవి ఊట సెలిమలయి ఊరాలే’’ (తైదల అంజయ్య పాటకు తెలంగాణ రాష్ట్రంలో పభుత్వం ప్రతిష్టాకరంగా అందజేసే మిషన్ కాకతీయ పురస్కారం 2016 సం॥నికి లభించింది.
కళాంజలి రాజేష్ గారు అంబేద్కర్ గారి జీవితచరిత్రను ఆడియో క్యాసెట్ రూపంలో తెచ్చారు. స్వచ్చ సిద్దిపేటపైన అనేక పాటలు రాసాడు. ముక్కెర సంపత్‌గారు వైవిధ్యమైన పాటలు రాసి తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినాడు.
అనేకమంది కొత్త కవులు గాయకులు సిద్దిపేట జిల్లా నుంచి తమ కలాన్ని గళాన్ని రaలిపిస్తున్నారు. యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో సేకరించిన జానపద గేయాలు సొంత రచనలు ప్రచురిస్తున్నారు.
సంగీత సాహిత్యాలకు నెలవై విశేషమైన కృషి చేస్తున్న వాగ్గేయకారుడు అమరవాది రాజశేఖర శర్మ. వీరు గజ్వేల్ పట్టణంలో జన్మించారు. తొలిపాట శ్రీరాముని నామం మధురామృతం పాటతో 1992లో ప్రారంభమైన వీరి ప్రస్థానం నిరాటంకంగా కొనసాగుతోంది. ‘వీణియ నాదవినోదములా... జయహో తెలుగు పాట’ అనే వీధి పాట అత్యంత జనాదరణ పొందినది. శ్రీ రాముడు, సాయి, అయ్యప్ప మొదలగు దేవతలపై ఆధ్యాత్మిక పాటలు రాసి మూడు క్యాసెట్లను 1996లో వెలువరించారు. వీరి పాటలను ‘ప్రబోధ గీతమాలిక’ సంపుటము గా 2007లో ప్రచురించారు. రామ రామం యూట్యూబ్ ఛానల్ ద్వారా నూతనమైన పాటలతో, వినూత్నమైన ఆలాపనతో సామాజిక మాధ్యమాల్లో, విస్తృతంగా పాటకు జీవం పోస్తున్నారు.
అనేక పాటలు పరిశోధకులు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సిద్ధిపేట ఆడియో సంస్థ సూర్య చంద్ర ఆడియోస్ సంస్థ (ఆంజనేయులు) పప్పుల రాజిరెడ్డి, మద్దెల నర్సింలు, ఎనగందుల భాస్కర్, కురికాల శంకర్, ఇల్లందుల శ్రీనివాస్, పద్మనాభంపల్లి శ్రీనివాస్, శ్రీదాస్యం లక్ష్మయ్య, ముక్కెర సంపత్, చిన్నగుండవెల్లి రాజేశ్, పరమేశ, గడిపె బాలన్న, గడిపె మల్లేశ్, గడిపె రవీందంమపాటలకు విశేషకృషి చేస్తున్నాడు. సిద్ధిపేట నుంచి బాలగేయాలు రాసేవారు పదుల సంఖ్యలో కలరు.కాలాన్ని బంధించే చరిత్రని, చరిత్రలో ఇమిడే కాలాన్ని పచ్చగా పాటల గానం చేస్తున్న కవిగాయకులందరికీ సమాజం సలాం చేస్తూనే ఉంటది.
డాక్టర్ సిద్దెంకి యాదగిరి
9441244773
పాద సూచికలు:
1. తెలుగు సాహిత్య సమీక్ష, నాగయ్య, పి. 1 సంపుటి.
2. సుద్దాల అశోక్ తేజ పాటలు.
3. పల్లె పాటలు ఆడియో చీకోడు నర్సింలు
4. ఎన్సాన్‌పల్లి ప్రభాకర్ పాటలు ఆడియో
5 పల్లె పాటలు ఆడియో చీకోడు నర్సింలు
6. జాపసద పాటలు, చంద్రయ్య, ఐతా. 1997
7. నాగేటి చాల్లల్ల ... సిధారెడ్డి, నందిని. 2011.
8. తాలే లెల్లే భీమసేన 2000
9. తెలంగాణం. మరసం.
10, 11 అదే.
12. ఒక్కొక్క పాటేసి. తిరుమల్ రావు,జయధీర్. 2000
13.తాలే లెల్లే, భీమసేన 2003.
పరిశోధక విద్యా జాతీయ సదస్సు : తెలంగాణసాహిత్య సమాలోచన తేది: 28`02`2019న ఉస్మానియా విశ్వ విద్యాలయం నందు పత్ర సమర్పణ.