నవ తెలంగాణ దర్వాజా 8-2-2021
https://m.facebook.com/story.php?story_fbid=2026318010841114&id=100003888054246
బరి
మత్తిల్లే తలలు కాదు
మేల్కొలుపు ఆలోచనలు కావాలే
లపూట్ల కొలతలా?
లైఫే వైఫై
దండె గొడ్తవా?
ఇది గుండె కాదు
మొండి పర్వతం
వ్యాకర్ణాలు వెతుకకు
ప్రమాణాలు తూచకు
బతుకును ఏ తక్కెడ జోకుతది?
పావందుల పానాదులు తొక్కకు
తొవ్వకు అంతు ఉందా?
నిజం
ఖనిజం
ఇజం మేమే
మాయిముంత పునాదులు మాయి
బూతద్దంతో బుకాయించకు
బతుకే అద్దం చూర
బతుకు చూడూ!
ఎతల రొద వినూ!
టైం లేదనీ మైం చెయ్యకు
సోయికి రా అన్నీ కనపడుతయి
అమాసకు దారి చూపిన చుక్కల వెలుగు
లైట్ పురుగుల గురి
ఎత్తిన పోరు బరిసె
వంచిన మెడలని నిమురు
కాలిన మా దేహాల కమురు వాసన కంపు వీస్తది
మాది ఆకలి రణం
అవమానాల వ్రణం
సత్తైం నిత్తె రాజుకునే నిప్పు
ఉనికి కోసం ఊపిరి
పగపట్టిన సావు పీడ
తలపడిన బతుకే కాగడా
జీవన్మరణ మనుగడ
అర్థం కాలే?
తవ్వూ బాధలగని
తోడూ జీవజల
రాయీ బతుకే మహా గ్రంథం
కటింగ్ లు వొద్దు
ఆకలి కీకలే కవిత్వం
భావోద్వేగాలే భాష
విలువలే శైలీ
శిథిలాలను పెకిలించిందే రాత
పలుకుబడులే సౌందర్య సోయగం
సమ్జైత లేదా ?
కాలంతో కలబడే కన్నీళ్ళు
బతుకు కాగితాలపై ఓడని స్ఫూర్తి
జయించే ఆత్మ విశ్వాసమే
మా అక్షరం
మా పుస్తకం గండ దీపం
మా సాహిత్యం
అంతరాల చరిత్ర పై భస్మనేత్రం
కొలతలు, ప్రమాణాలు లేవు
ష్యూర్
రూల్స్ బ్రేక్ చేయడమే మా పని
ప్రామిస్
ప్రేంస్ విరవడమే విధి
నడిమికి తెగ్గొట్టిన
పొద్దు పొడుపు తోరణంను అతికించడమే మా బాధ్యత
ఆవాహనా?
అనుమానమా?
వేరెవర్
మీది మిస్టరీ
మాది హిస్టరీ.
డా. సిద్దెంకి యాదగిరి
9441244773.