పఠనావగాహన వ్యూహాలు
పఠనావగాహన వ్యూహాలు
పఠనం, అవగాహన అనే రెండు అంశాలను పరిశీలించి, అందులో వెనుకబడిన విద్యార్థులకు వాటిని నేర్పేందుకు కొన్ని విధానాలను అనుసరించాల్సి వస్తుంది. వాటినే వ్యూహాలుగా పేర్కొంటున్నాం. ఒక వ్యూహం పని చేయనప్పుడు దాని స్థానంలో మరొక వ్యూహాన్ని అమలుజరుపుతాం. అందుకే వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి అనుకూలంగా ఉండాలి.
జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 2023, జాతీయ విద్యా విధానం 2020 సూత్రాలను తరగతి గది స్థాయికి దిగువకు తెచ్చే వంతెన వంటిది. ఈ చట్రం పఠనావగాహనను నాలుగు సోపానాలుగా విభజించింది. మొదటి సోపానం అక్షర స్థాయి పఠనం, రెండవది భావ గ్రహణం, మూడవది విశ్లేషణాత్మక పఠనం, నాల్గవది విమర్శనాత్మక మరియు సృజనాత్మక పఠనం. ఈ నాలుగు సోపానాలను దాటినప్పుడే సమగ్ర పఠనావగాహన సిద్ధిస్తుందని చట్రం స్పష్టం చేసింది.
జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 2023 ప్రకారం, పఠనావగాహన బోధనలో అనుభవాత్మక అభ్యసనానికి (Experiential Learning) అత్యంత ప్రాధాన్యత ఉంది. విద్యార్థి చదివిన విషయాన్ని తన చుట్టూ ఉన్న జీవిత వాస్తవాలతో అనుసంధానించగలిగినప్పుడే పఠనం అర్థవంతమవుతుంది. అందువల్ల పత్రికా కథనాలు, స్థానిక సాహిత్యం, జానపద కథలు, సమకాలీన సాహిత్యాన్ని పాఠ్యాంశాలలో భాగం చేయాలని ఈ చట్రం నిర్దేశించింది.
ఆలోచించండి, చర్చించండి:
- ధారాళంగా చదవడమంటే?
- పిల్లల్లో ధారాళంగా చదవడాన్ని ఎలా పెంపొందించవచ్చు?
- పిల్లల్లో పఠనావగాహన జరిగినట్లు ఎలా గుర్తించవచ్చు?
- పఠనావగాహనను పెంచడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించవచ్చు?
పిల్లల్లో అభ్యసనాభివృద్ధి జరిగిందా లేదా అని మొదటగా గ్రహించేది వారి పఠన తీరు, అవగాహనను బట్టే. ప్రస్తుతం ఎక్కువ మంది పిల్లలు ఈ పఠనం, అవగాహనలో వెనుకబడుతున్న దృష్ట్యా, వారికి ప్రధానంగా పఠన నైపుణ్యం పెంపొందించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది.
చదవడమే రాని పిల్లలకు ఇక అవగాహన ఎక్కడిది? ఈ రెండూ రాని పిల్లలు సామర్థ్యాలు సాధించడం ఎలా?
పఠనం - వ్యూహాలు: ధారాళంగా చదివే నైపుణ్యం పెంపొందించేందుకు తరగతిలో ప్రత్యేకంగా ప్రతి పీరియడ్‌లో వ్యక్తిగత పఠనం సోపానాన్ని నిర్వహించాల్సి వస్తుంది. అలాగే గ్రంథాలయ వినియోగంతో పాటు 6, 7 పీరియడ్‌లను చదవడం-రాయడం నేర్పే పీరియడ్‌లుగా వాడుకొంటున్నాం.
ఇంతచేసినా చదవడం రావడం లేదంటే ఉపాధ్యాయులు మరింత ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. నిజానికి చదవడం నేర్పడానికి ఈ 6, 7 పీరియడ్‌లు సరిపోవడం లేదు. మరి ఇంకా ఏం చేయవచ్చు?
- పూర్వజ్ఞానాన్ని చైతన్యపరచడం
- శీర్షిక, చిత్రాలను పరిశీలించి ఊహించడం
- ప్రశ్నించుకుంటూ పఠించడం
- ముఖ్యాంశాలను గుర్తించి సంక్షిప్తీకరించడం
- పునఃపఠనం ద్వారా అవగాహన పెంపొందించడం
అదనపు వ్యూహం: పిల్లలను తరగతిలో యాదృచ్ఛికంగా వ్యక్తిగత పఠనం చేయిస్తున్నప్పుడు, ఎప్పుడూ చదవగలిగే పిల్లలనే ఎంపిక చేసుకోకుండా, చదవడంలో వెనుకబడిన విద్యార్థితో చదివించాలి. అతను ప్రారంభంలోనే ఆగిపోవచ్చు. అప్పుడు మొదటి అక్షరం ఏంటో గుర్తించమనవచ్చు. అక్షరం గుర్తించాక దాని గుణింతాన్ని గుర్తించి చెప్పమనాలి. అలా చెప్పాక రెండో అక్షరాన్ని చెప్పించాలి. అలా పదంలోని మొత్తం అక్షరాలను పలికించాక అభినందిస్తూ, అక్షరాలను కూర్చుకుంటూ ఒక పదాన్ని చదివిన వ్యక్తి తరువాతి పదాలు కూడా ఇంటి దగ్గర అలాగే చదవాలని ప్రోత్సహించి మరో విద్యార్థిని లేపాలి. అతనికి కూడా ఇదే పద్ధతిని అవలంబింపజేసి, చదవడం వచ్చినా ప్రయత్నించడం లేదు కనుక వెనుకబడుతున్నాడనే వాస్తవాన్ని గుర్తింపజేయాలి.
వ్యక్తిగత పఠనమంటే ఒక వ్యక్తి లేచి పేరాలకు పేరాలు చదవడమే కాదు. చదవడం రాని వ్యక్తి చేత అక్షరాలు కూర్చుకుంటూ ఒక పదాన్ని చదివించడం కూడా వ్యక్తిగత పఠనం కిందే లెక్క.
మరిన్ని వ్యూహాలు:
- జంట పఠనం (Pair Reading)
- గుంపు పఠనం (Group Reading)
- పాత్రధారణ పఠనం (Role Reading)
- సందర్భానుసార పదార్థ గ్రహణం (Context Clues)
- భావవ్యక్తీకరణతో పఠనం (Expressive Reading)
పఠనావగాహన: ఇది జరగాలంటే పిల్లల్లో ముందుగా ధారాళంగా చదవడం రావాలి. అంటే నిమిషంలో 50 పదాల వరకు తప్పులు లేకుండా చదవగలగాలి. ఆ తర్వాతే అవగాహన. బాగా చదివినంత మాత్రాన బాగా అవగాహన అయినట్లు కాదు. అందుకే చదవడం వేరు, అవగాహన వేరు.
పిల్లలు బాగా చదవడం ఒక మెట్టు, చదివింది అర్థం చేసుకోవడం రెండో మెట్టు. చదివింది అర్థం అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనకు తెలిసిన ప్రధాన వ్యూహం ఒకటే. పేరాను చదివించాక అది ఏ మేరకు అర్థం అయిందో తెలుసుకోవాలంటే, ఆ పేరాను ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడగాలి. దానికి తాను ఎవరి సహాయం లేకుండా సమాధానం సరిగా చెప్పగలిగితే, అతనికి అర్థం అయినట్టు.
ఇదే అవగాహనను మనం లిఖిత రూపంలో కూడా అంచనా వేస్తున్నాం. గద్యభాగానికి చెందిన పేరా గానీ, అపరిచిత, పద్య, గేయ భాగాలు గానీ ఇచ్చి కింద ప్రశ్నలకు సొంతంగా సమాధానం రాయించవచ్చు. అయితే ఆ పేరాలో సమాధానం సూటిగా కాకుండా అంతర్లీనంగా ఉన్నప్పుడు, ఆ సమాధానాన్ని గుర్తించి సరిగ్గా పదరూపంలో గానీ, వాక్యరూపంలో గానీ రాయగలిగితే, అతనికి అవగాహన అయినట్లుగా గుర్తించవచ్చు. గతం నుండి మనం ఈ పఠనావగాహనను ఇలాగే నిర్ధారిస్తున్నాం.
అదనపు వ్యూహాలు: గ్రంథాలయాల్లోని పుస్తకాల గురించి, వాటిలోని కథలు, గేయకథలు వంటివి కొంత ఆసక్తికరంగా చెప్పి, మిగతాది ఫలానా పుస్తకంలో చదువుకొమ్మని ప్రోత్సహించవచ్చు. సగం అర్థమైన కథను చదువుతూ ఊహాత్మకంగా అవగాహన చేసుకోవచ్చు.
పత్రికా కథనాల్లో ఉన్న విషయాన్ని కూడా కీలక విషయాలు చెప్పి, మిగతా సమాచారం అంతా చదువుకొని చెప్పాలని ప్రోత్సహించవచ్చు. ఇలాంటివి తరగతి గదిలోనే కాకుండా, స్కూల్ అసెంబ్లీల్లో కూడా చెప్పించి అభినందించడం ద్వారా కూడా అవగాహన పెంపొందించవచ్చు.
ఈ పఠనావగాహన ఎలా జరిగిందో నిర్ధారించగలిగే అదనపు వ్యూహాలను ఆలోచించి మీ మీ తరగతి గదుల్లో అమలుజరపండి.