చదువు
చదవండి ఆలోచించండి – చెప్పండి
తే॥గీ॥ ఆటలాడు వేళలయందు నాడవలయును
జదువుకొనఁదగు వేళలఁ జదువ వలయు
నట్లుకాకున్న నారోగ్య మంతరించు
దాన, మేధస్సు బలహీన మౌను సుమ్ము.
1.ఆటలు ఎందుకు ఆడుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి?
జవాబు.ఆటలు ఆడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మేధస్సు చురుకుగా ఉంటుంది. అందుకనే ఉదయం సాయంత్రం కొంతసేపు ఆటలాడుకోవాలి.
2.ఏ సమయంలో చదువుకోవాలి? ఎందుకు?
జవాబు.చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. బుద్ధి చురుకుగా ఉంటుంది. అందుకే తెల్లవారుజామున తప్పక చదువుకోవాలి. మిగతా సమయాలలో అవసరమైనపుడల్లా చదువుకోవాలి.
3.ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమౌతుంది?
జవాబు.ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే సోమరితనం పెరిగిపోతుంది. శరీరానికి వ్యాయామం లేక ఒళ్ళు బరువెక్కి అనారోగ్యం పాలౌతారు. ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి.
4.చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమౌతుంది?
జవాబు.
చదువు సరిగ్గా చదువుకోకుంటే తెలివితేటలు పెరగవు.
నేపథ్యం : విక్రమార్కుని ఆస్థానంలో పురోహితుడుగా ఉన్న త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. అతడు చదువులేక జడపదార్థంగా ఉండటం వలన అతడిలో మార్పు తేవడానికి తండ్రి కుమారుని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపులో భాగంగా చదువు అవసరాన్ని వివరించాడు.
ఈ పాఠం “కథాకావ్యం” (ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహారకావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ట్రధానం. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొఱవి గోపరాజు రచించిన సింహాసన ద్వా(తింశిక చతుర్థాశ్వాసంలోనిదీ కథ. భోజరాజుకు తొమ్మిదవ సాలభంజిక ఈ కథను చెప్పింది.
కవి పరిచయం:
కవిపేరు : కొఱవి గోపరాజు
పాఠ్యభాగం పేరు : చదువు
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం
రచన : సింహాసన ద్వాత్రింశిక
తల్లిదండ్రులు : తండ్రిపేరు కొఱవి కసవరాజు, తల్లిపేరు కామాంబిక
విశేషాంశాలు : నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతోపాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత.
ఆలోచించండి – చెప్పండి
1.
అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి?
జవాబు.
అవివేకి చుట్టాలకు గాని తల్లిదండ్రులకు గాని ఏ విధంగానూ సహాయం చేయడు. సంతోషం కలిగించడు. చదువు సంధ్యలు నేర్వడు. పైకి ఆకారం బాగానే ఉన్నా సంస్కారం లేనివాడు. అడవిలోని మోదుగుపూల వంటివాడు.
ప్రశ్న 2.కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా! ఇట్లా అనడం తగినదేనా? ఎందుకు?
జవాబు.
కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు. ఇది సరియైనదే. ఎందుకంటే చదువు సంధ్యలు, సంస్కారం ఏమీ లేకుండా, ఎవ్వరికీ ఉపయోగపడకుండా కులానికి చెడ్డపేరు తెచ్చిపెట్టేట్లు జడాశయుడు ఉన్నాడు. వట్టి మూర్ఖునిలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే కవి అతడిని జడాశయుడు అన్నాడు. కమలాకరం అంటే జలాశయం లేదా నీటిమడుగు. నీటిమడుగు ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది. కమలాకరుడు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నాడు. అందుకే ‘జడాశయుడు’ అని కవి అన్నాడు.
3.“చదువురాని పిల్లలు వంశానికి తెగులు” అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు.చదువుకున్నవాడు వివేకి అవుతాడు. తల్లిదండ్రులకు బంధువులకు సంతోషం కలిగిస్తాడు. సత్ప్రవర్తన కలిగి సంస్కారవంతుడై ఉంటాడు. అదే చదువుకోకపోతే పై లక్షణాలేవీ ఉండవు. పదిమందిలో నవ్వులపాలౌతాడు. దానివల్ల ఆ కుటుంబానికి వంశానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కవి.
4.తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు?
జవాబు.
చదివే కొద్దీ విజ్ఞానం పెరుగుతుంది. తను చదివింది ఇతరులతో పంచుకుంటే మరింత బాగా మనసుకెక్కుతుంది. ఎంత ఎక్కువమందికి ఆ చదువు పంచితే అంత ఎక్కువగా అది పెరుగుతుంది. అంతేగాక ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్తభావాలు కలిగి మరింత బాగా అర్థమౌతుంది. కనుక తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది అనే మాట నిజం.
5.“చదువు దొంగలకు కనిపించదు” చర్చించండి.
జవాబు.చదువు బుద్ధికి సంబంధించినది. నేర్చుకున్న విషయాలు నేరుగా మెదడుకు చేరతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నంతసేపూ ఆ విషయాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞాపకం వస్తాయి. మనం బుద్ధిపూర్వకంగా చెబితే తప్ప ఎవరికీ తెలియవు కనిపించవు. కనిపించని వస్తువును ఎవరు కాజేయగలరు? కాబట్టి చదువు దొంగలకు కనిపించదు.
6.అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏయే చదువులు చదవాలి?
జవాబు.
అందరూ మెచ్చుకోవాలంటే మనం మంచి చదువులు చదవాలి. విజ్ఞానం పెంచే చదువులు చదవాలి. నలుగురితో ఎట్లా మెలగాలో నేర్పే .
ఇవి చేయండి
1. విని, అర్ధం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా! అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడంలేదు. దీనివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు? వాళ్ళుకూడా చదువుకోవాలంటే మనమేం చేయాలి?
జవాబు.
అందరికీ చదువు అవసరం. ఒకప్పుడు ఆడపిల్లలను బడికి పంపేవారుకాదు. మగవారిలో కూడా చదువుకొనేవారు తక్కువ. ఇప్పుడు చదువు అవసరం తెలిసి ప్రతివారూ పై చదువులు చదువుతున్నారు. కాని ఇంకా పనిపాట్లు చేసుకొనేవారూ పిల్లలను పనికి పంపి ఇల్లు గడుపుకొనేవారూ కనిపిస్తూనే ఉన్నారు. దీనివల్ల వారు విలువైన బాల్యం కోల్పోతున్నారు. చదువుకోకపోతే వారు ధనవంతుల చేతిలోనూ మోసగాళ్ళ చేతిలోనూ అన్యాయమై పోతారు. కాబట్టి అందరూ చదువుకోవాలి. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. మనందరం బాలకార్మికులు లేకుండా చేయడానికి కృషి చెయ్యాలి. మన ఇళ్ళలో పిల్లలను పనిలో పెట్టుకోకూడదు. ఇలా అందరూ కృషిచేసి అందరూ చదువుకొనేట్లు చూడాలి.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.
1. కింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
(అ) చదువు నేర్చుకోని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు.
జవాబు.
చదువుల్ గట్టిగ నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మీ!
(ఆ) విద్య ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు వృద్ధి చెందుతుంది.
జవాబు.
తానెవ్వరికిచ్చినఁగోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య
(ఇ) ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా?
జవాబు.
ధరలో మరి విద్యబోల ధనములు గలవే?
(ఈ) ఏ చదువూ నేర్వనివాడు పశువుతో సమానం.
జవాబు.
సంగీతంబు కవిత్వ తత్త్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్ శృంగ ద్వంద్వము లేని యెద్దతడనం జెలున్.
(ఉ) కష్టపడి సంగీతం సాహిత్యం వంటి కళలు నేర్చుకొని
జవాబు.
తివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి.
(ఊ) ఆ పశువుల అదృష్టం కొద్దీ అతడు గడ్డి తినడు.
జవాబు.
తృణం బాతడు య్యాంగీకంబున మేయడా పసుల భాగ్యం బిచ్చటన్ కల్గుటన్.
2. కింద పద్యాన్ని చదువండి. భావం రాయండి.
చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గల్గున్
చదువగ వలయును జనులకు,
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ! – (పోతన భాగవతం)
జవాబు.
“చదువుకోనివాడు అజ్ఞాని యౌతాడు. చదువుకుంటే మంచి చెడు తెలుసుకొనే తెలివితేటలు కలుగుతాయి. కాబట్టి జనులు తప్పక చదువుకోవాలి. నాయనా! నిన్ను చదివిస్తాను. గురువుల వద్ద చదువుకో”. అని ఈ పద్య భావం.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ). చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు?
(లేదా)
చదువురాని వారికి పశువులకు తేడాలేదని కవి ఎందుకన్నాడు?
జవాబు.
చదువు నేర్వని వారిని కవి పశువుతో పోల్చాడు. ఎందుకంటే పశువులకు మాటలు రావు. భాషరాదు. అవి చదవలేవు. రాయలేవు. ఎక్కడ కట్టేస్తే అక్కడే పడి ఉంటాయి. మనిషి చదువుకోకపోతే చదవలేడు. రాయలేడు. సరిగా మాట్లాడలేడు. పశువుకెంత గౌరవం ఉంటుందో అతనికీ అంతే. పశువులు గడ్డి తింటాయి. అతడు అన్నం తింటాడు. పశువుకున్న తోక, కొమ్ములు అతడికి లేవు. అంతకు మించి చదువురాని వాడికీ, పశువుకూ ఏమీ తేడాలేదు.
(ఆ). త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎట్లాంటివి?
(లేదా)
చదువును గురించి త్రివిక్రముడు ఎలా ఆలోచించాడు?
జవాబు.
చదువు పట్ల త్రివిక్రమునికి గల భావాలు : చదువు ఎవరికీ కనిపించని ఎవరూ దోచుకోలేని గొప్ప సంపద. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనకు సహాయపడుతుంది. అందరినీ మనకు ఆప్తులుగా చేస్తుంది. చదువుకు సమానమైన సంపద మరేదీలేదు. మంచి కావ్యాలు చదవాలి. లలితకళలు నేర్చుకోవాలి. మంచివారితో మంచి మాటలతో కాలం గడపాలి. లోకజ్ఞానం సంపాదించాలి. అలా చదువులు నేర్వని వాళ్ళు పశువులతో సమానం
(ఇ). కమలాకరుని స్వభావం ఎటువంటిది?
(లేదా)
కమలాకరుడు ఎలాంటివాడు?
జవాబు.
కమలాకరుడు జడాశయుడు. అంటే ఏ ఆలోచనలు, ఆశయాలు లేకుండా కాలం గడిపేవాడు. చదువు సంధ్యలు లేనివాడు. ఎవరితోనూ కలవడు మాట్లాడడు. స్నేహితులు లేరు. తల్లిదండ్రులకు బంధువులకు ఏనాడూ సంతోషం కలిగించలేదు. అందమైన మోదుగపువ్వు అడవిలోపడి ఉంటే దాన్ని చూసి ఆనందించేవారెవ్వరూ ఉండరు. అలాంటి మూర్ఖుడే కమలాకరుడు.
(ఈ). చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.
(లేదా)
“చదువు లేకపోవడమే కష్టాలన్నిటికీ మూలం” ఎలా? వివరించండి.
జవాబు.
చదువు రాకపోతే అన్నీ కష్టాలే. మహాపండితుడు పురోహితుడు అయిన త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. కాని అక్షరం నేర్వలేదు. అందుకే అతన్నెవరూ ఆదరించలేదు. అతనికి స్నేహితులు లేరు. తల్లిదండ్రులు, బంధువులు ఎవ్వరూ అతనివల్ల సంతోషించలేదు. చివరికి కమలాకరుడు ఒంటరిగా ఏ తోడూ లేకుండా మిగిలిపోయాడు. తండ్రిచేత మాటలు పడ్డాడు. చదువు గొప్పదనం తెలిసికొని చదువుకొని మనిషిలా మారాడు. కాబట్టి చదువుకోకపోతే అన్నీ కష్టాలే.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
1. చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
పరిచయం : కొఱవి గోపరాజు ‘చదువు’ పాఠంలో చదువు అవసరాన్ని చాలా చక్కగా చెప్పాడు. త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. అతడు చదువులేక జడపదార్థంగా ఉండటం వలన అతడిలో మార్పు తేవడానికి తండ్రి కుమారుని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపులో భాగంగా చదువు అవసరాన్ని వివరించాడు.
IV. సృజనాత్మకత/ప్రశంస
(అ) బాగా చదివేటట్లు మిమ్ములను ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
(లేదా)
(ఆ) చదువు ఆవశ్యకత తెలిసేటట్లు కొన్ని నినాదాలు రాయండి.
లేఖ
సిద్దిపేట
తేది : XXXX
ప్రియమైన అన్నయ్యా !
ఇక్కడ అంతా క్షేమం. నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. మా పరీక్ష ఫలితాలు వచ్చాయి. నాకు తరగతిలో రెండవ స్థానం లభించింది.
అన్నయ్యా ! ఇదంతా నీ ప్రేరణ వల్లనే జరిగింది. క్లాసులో ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చుకుంటూ అందరూ ఎగతాళి చేస్తే ఏడుస్తూ కూర్చునేవాణ్ణి. నువ్వు చెప్పిన మంచిమాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. చదువుపట్ల ఆసక్తిని పెంచాయి. ఏమైనా సరే మంచిమార్కులు సాధించి తీరాలని పట్టుదల నాలో పెరిగింది. గట్టిగా కృషిచేశాను. తగిన ఫలితం లభించింది. ఇదంతా నీ వల్లనే సాధ్యపడింది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సగౌరవంగా నేను చెప్పే ధన్యవాదాలు స్వీకరించు. ఉంటాను.
ఇట్లు
నీ ప్రియమైన తమ్ముడు,
కార్తికేయ.
చిరునామా :
ఎ.వహ ప్రసాద్, తొగుట
(ఆ) చదువు ఆవశ్యకతపై నినాదాలు :
జవాబు.
చదువుకుంటే కలదు లాభం.
ఎంత చదివితే అంత జ్ఞానం.
అభ్యాసము కూసు విద్య.
చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను.
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.
చదువు వల్ల సంస్కారం కలుగును.
రాజుకు తన దేశంలోనే గౌరవం. పండితుని ప్రపంచమంతా గౌరవిస్తుంది.
చదువు అంటిపెట్టుకొని ఉండే స్నేహితుడు.
చదువు లేకపోవటమే అసలైన గుడ్డితనం.
V. పదజాల వినియోగం
1. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి.
(అ) పశువులు శృంగాలతో పొడుస్తాయి. – కొమ్ములు
(ఆ) గణపతి వక్త్రమున తొండము ఉంటుంది. – ముఖాన
(ఇ) తృణము తిని ఆవు పాలిస్తుంది. – గడ్డి
(ఈ) ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు. – కుమారుడు, కొడుకు
2. కింది పదాలను వివరిస్తూ రాయండి.
(అ) మృదుభాషలు
జవాబు.
మృదు అంటే మెత్తని. భాషలు అంటే మాటలు. మృదుభాషలు అంటే మెత్తనైన మాటలు. అంటే అందరికీ నచ్చేమాటలు.
(ఆ) ప్రబంధ సంపద
జవాబు.
ప్రబంధములు అంటే కావ్యాలు. ప్రబంధముల యొక్క సంపద. అంటే కావ్యాలు అధికంగా ఉండటం.
(ఇ) సౌజన్యభావం
సౌజన్యం అంటే మంచితనం. సౌజన్యభావం మంచి ఆలోచనలు కలిగి ఉండటం.
(ఈ) సత్సాంగత్యం
జవాబు.
సాంగత్యం అంటే సమీపం. మంచివారితో కలిసి ఉండటమే సత్సాంగత్యం.
3. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
పర్యాయ పదాలు
(అ) ధర = ఇల, భూమి
(ఆ) ఆత్మజుడు = కుమారుడు, పుత్రుడు
(ఇ) వనం = అడవి, అరణ్యం
(ఈ) శోకం = దుఃఖం, వ్యథ
VI. భాషను గురించి తెలుసుకుందాం
కింది పేరాను చదవండి. అందులోని భాషాభాగాలను గుర్తించి పట్టికను పూరించండి.
మా ఊరి చెరువుగట్టున సంగమేశ్వర దేవాలయం ఉన్నది. పచ్చని ప్రకృతిలో పక్షుల కిలకిలారావాలతో అలరారే ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటుంది. అక్కడి వనంలో జింకలు, కుందేళ్ళు తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రని సూర్యకిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ అద్భుతదృశ్యాన్ని చూడటానికి రెండుకండ్లు చాలవు. అబ్బో! ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో, ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ కథనాలు చదువుతూంటే మనస్సు ఆహా! అంటూ ఆనందడోలికల్లో తేలిపోతుంది కదా!
నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం
జింకలు మా సుందరంగా ఉన్నది అబ్బో
కుందేళ్ళు ఆ ఎర్రని అలరారే ఆహా
కండ్లు అద్భుత ఉంటుంది కిలకిల
సంగమేశ్వర పచ్చని చాలవు అక్కడి
సూర్యుడు శోభాయమానంగా వర్ణిస్తూ....