జంబూ శనార్తులు
తేదీ: 17-03-2023 రోజున రవీంద్ర భారతి మినీ హాల్ లో ఆవిష్కరణ జరగునున్న నా "మూడు గుడిసెల పల్లె" కథల పుస్తకం పై ముందుమాట "ఉత్తమ కథా సంపుటి" రాసిన పెద్దలు, సాహితీ దిగ్గజం కొలకలూరి ఇనాక్ గారి అభిప్రాయం చదవండి.
పూర్తి వ్యాసం చదవండి మిత్రులారా.
మీ అభిప్రాయం రాయండి.
తేది : 12-03-2023న సృజనలో వ్యాసాన్ని ప్రచురించిన సృజన పత్రిక వారికీ , విల్సన్ అన్న గారికి కృతజ్ఞలు.
"ఉత్తమ కథా సంపుటి - మూడు గుడిసెల పల్లె"
డా. సిద్దెంకి యాదగిరి వ్రాసిన ‘మూడు గుడిసెల పల్లె’ ఉత్తమ కథానికల సంపుటి. ఇది అచ్చమయిన తెలంగాణ కథానికలు. అందులోనూ పేదల జీవితాలు, మరీ ముఖ్యంగా కథకుల బ్రతుకులు చిత్రిచంచిన కథానికలు, ఇవి.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో కొంతభాగం నీటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. కడుతున్న ప్రాజెక్టుల వల్ల ముంపుకు గురి అవుతున్న ప్రాంతాల దయనీయ గాథలు రెండున్నాయి. ఇందులో ఒకటి మొట్ట మొదటి కథానిక. రెండోది చిట్ట చివరి కథానిక. ఈ రెండిరటి మధ్య ఉన్న 16 కథానికలు తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రచయిత నేలవిడిచి సాముచేసే మనిషికాడు. నేలను, నేలతల్లిని, నమ్ముకొన్న, కొన్ని సందర్భాలలో అమ్ముకొన్న అతి సామాన్యుల ఛిద్ర జీవితాలను వేదనామయంగా కథానికల్లో పొందుపరిచాడు.
నీట మునిగినా సరే, ఈ నేలలోనే నన్ను పూడ్చి పెట్టండి అని అడిగే ఒక అతి సామాన్య వృద్ధురాలి కథానిక గుండెలు పిండుతుంది. తనను కాల్చే కట్టెల్ని పోగుచేసుకొని, చనిపోయి కాలిపోయే మనిషిని చూడాలంటే డా. యాదగిరి కథానికలు చదవండి.
మాదిగ మగమనిషేకాదు, ఆడమనిషి కూడా, చెప్పులకు పాలీసుచేసి బ్రతకుతుందా? కూతురు పెళ్లి చేయటానికి ఉన్న పొలం అమ్ముతుంది. తెచ్చిపెట్టిన పెద్దనోట్లు రద్దయితే, ఆ అసహాయురాలు ఏం చేస్తుంది? ఆలోచించండి. ఇంతకంటే సమకాలీనమయిన కథానికలు ఉంటాయా? కరోనా భయాన్ని జయించే మానవాత్మ ఏంచేస్తుంది? బతుకమ్మ ఆడతామంటే అంత వ్యథ ఉంటుందా? ఇటువంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మీరు ‘మూడు గుడిసెల పల్లె’లో మునిగి తేలాల్సిందే. దళితుల మధ్య ఉండే తారతమ్యాలు పోవాలంటే వాళ్లు లంద స్నానం చేసిన తోళ్ల లాగా మారాలి. ఊరికి కానివాడు అని తృణీకరించాకే ......
ఈ సంకలనంలోని కథానికలు తెలంగాణ పల్లెల సజీవ జీవన దృశ్య చిత్రీకరణలు. సామాన్యులు ఈ కథానికల్లో నాయకులు, నాయికలు. మనుషుల మధ్య ఉండవలసిన సంబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయతలు పోయి పొరపొచ్చాలు అద్భుతంగా రూపం దిద్దుకొన్నాయి. డా. సిద్దెంకి కథానికలు అతనివి మాత్రమే. ఏ ప్రభావాలు ఈ రచనల మీద లేదు. ఎంత ప్రసిద్ధమైన కథానికలు కానీ ప్రసిద్ధులైనవాళ్ల కథానికలు కానీ ఛాయా మాత్రంగా కూడా ఈ కథానికల్లో కనిపించవు.
ఈ సంకలనంలోని కథానికలు వివిధ సందర్భాÛలలో నిర్వహింపబడ్డ వేరు వేరు పోటీల్లో బహుమతులు పొందాయి. గుర్తింపు పొందాయి. రచయితకు ఖ్యాతినీ, ప్రఖ్యాతిని తెచ్చిపెట్టాయి. నిజానికి ఈ కథానికల్లో ఉన్న జీవితం, దాన్ని కథకుడుగా అర్థం చేసుకొన్న తీరు, పాత్రలు, వాటి స్వరూప స్వభావాలు అచ్చమైన తెలంగాణ గ్రామీణ జీవితం ప్రతిబింబించాయి. మనుష్యులు, ఆరాటాలు, పోరాటాలు, దు:ఖాలు వాటి వలపోతలు గుండెలకు కన్నీరు తాగించాయి. రచయిత డా. సిద్దెంకి యాదగిరిది పసిపిల్లల మనస్తత్వం. ఆకల్లాగినా, అల్లాడిపోయే రచయిత స్వభావం ఇంత ఉన్నత కథానికలు వ్రాయడానికి నేపథ్యంగా నిలిచింది. మనుషులపట్ల ఉన్న తీరని మమకారం రచయతను ముందుగా మానవోన్నతుడిగా చేసింది ఆ పైన మహారచయితను చేసింది. గొప్ప కథానికలకు ప్రాణప్రతిష్ఠ చేసింది.
తెలంగాణ గ్రామీణ జీవితం, గ్రామాల ప్రజలు డా. యాదగిరి కథానికల్లో ప్రాణం. `` తెలంగాణ భాష, యాస, సర్వ శక్తి సంపన్నంగా వీటిలో ప్రతిధ్వనించింది. ప్రతిస్పందించింది. గురజాడ అప్పారావు కన్యాశుల్కం ప్రసిద్ధికి ప్రధానమైన కారణం వస్తువు మాతృతతో పాటు ఉత్తరాంధ్ర మాండలికం అనీ సాహిత్య లోకం అంగీకరించింది. అలాగే డా. సిద్దెంకి యాదగిరి ‘మూడు గుడిసెల పల్లె’ తెలంగాణ భాషను శోభించింది. తెలంగాణ తెలుగు భాషకు నూత్న సౌందర్యం సమకూర్చి పెట్టింది. కథకుడు సిద్దెంకి యాదగిరి కవి. అతడి వాక్య నిర్మాణం సౌందర్య శోభితం. కథానికల్లో ప్రతి వాక్యం కవితాత్మకం గావించడంలో అతనికతనే సాటి.
తెలంగాణ భౌతిక స్వరూపమే కాదు, దాని అంతర బహిర్గత సత్త్వం, నిక్షిప్తం చేసుకొన్నాయి. స్వభావాల్ని పుణికి పుచ్చుకొన్న ‘మూడు గుడిసెల పల్లె’ కథానికలు. తెలంగాణ తెలుగును అక్షరమక్షరం సర్వాంగ సుందరంగా ఈ కథానికలు గుండెల్లో దాచుకొన్నాయి.
సామాన్యుల జీవితాను, సమకాలీన జీవిత ` ఉభయ పార్వ్శాలను సంపూర్ణంగా తమలో నింపుకొన్న ‘మూడు గుడిసెల పల్లె’ కథానికలు, గొప్ప సమాజ చైతన్య దీపాలు. ప్రాంతం, ప్రజలు, భాష, భావన, వేదన, ఆంతర్యం, అభివ్యక్తి, అంతా తెలంగాణ నిండిన కథానికలు. తెలుగు సాహిత్యానికి విలువల వలువలు కట్టబెట్టాయి. కథానికా వాఙ్మయంలో చిరంజీవత్వం పొందుతాయి.
ఇంత మంచి కథానికలు వ్రాసిన డా. సిద్దెంకి యాదగిరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వీటిని చదువుకోవడం వల్ల, మనల్ని మనం అర్థం చేసుకోనే అవకాశం కలుగుతుంది.
‘మూడు గుడిసెల పల్లె’ కథానికలు అనువాదంగా లభిస్తే, తెలంగాణ ప్రపంచానికి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచ స్థాయి కథానికలు మనమీ సంపుటిలో మూడు గుడిసెల పల్లెలో చూడగలం పున:పర్యాలోకనం వల్ల.
డా. సిద్దెంకి యాదగిరి సమాజానికి, సాహిత్యానికి ప్రపంచ పరిశీలన లభించాలనీ ఆశీర్వదిస్తున్నాను.
శుభాకాంక్షలతో....
కొలకలూరి ఇనాక్.