మిత్రులందరికీ నమస్కారము
తేది : (24-12-2023)నవతెలంగాణ సోపతి ఆదివారంలో ప్రచురించబడిన
"నిలువెత్తు దుఃఖం" అనే కథను చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచగలరని కోరుచున్నాను.
ఊళ్ళు ఖాళీ. బడులు ఖాళీ. బతుకులు ఖాళీ. ఇంకా దింపుడుకల్లం ఆశలతో ఆ ఊరి మనుషులున్నా అవకాశాలు శూన్యమే.
ఊరిపుడు ఏడ్సి, ఏడ్సి, ముండమోసి, ఎండల సొమ్మసిల్లిన విధవలా ఉంది. పులి చంపిన లేడిని పీక్క తింటూన్న నక్కలూ, తోడేల్ల గుంపులా ఉంది. ఒర్రంగా గావుపడుతున్న యాటపిల్లలాలా తండ్లాడుతూ ఉంది. ప్రపంచ మానవాళి గడగడలాడిస్తున్న కరోనాను మించింది ముంపు.
ఊళ్ళో మనుషులు ఖాళీ అవుతున్న కాలంలో కరోనాను లాక్డౌను ఎత్తేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరువాలని చెప్పిన కోర్ట్ తీర్పుకు లోబడి పాఠశాలలూ తెరిచిండ్రు.
****************
మాస్క్, సానిటైజర్... అన్నిజాగ్రత్తలతో ఉద్యోగాలకు హాజరవుతున్నారు. ముంపు గ్రామాలు ఖాళీ చేస్తున్నారనే వార్తలు విన్న ఉపాధ్యాయులకు విధి నిర్వహణ ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది.
ఎచ్చెమ్స్ ఫోన్, వాట్సాప్ సూచనలాధారంగా టీచర్స్ తొగుట ఎమ్మార్సీవద్ద ఒక్కొక్కరు రెండు మాస్కూలు పెట్టుకొని హాజరైండ్రు. కరోన బాధితులు. కష్టాలు, వ్యాఖ్యానాలు. ఊహాగానాలు. మండలస్థాయి నేతలు భవిష్యత్తు చర్చిస్తున్నారు. విశ్లేషిస్తున్నారు.
డీఈఓ ద్వారా రేషనలైజేషన్ అయితదా? కాదా? అయితే ఎట్లా జరుగుతుంది. కాకపోతే ఎట్లా అనే తర్కాలు జరుగుతున్నాయి. ముంపు గ్రామంలోని ఉపాధ్యాయులు ఎమ్మార్సీలో ఎక్కడకి పంపిస్తారోనని పిట్టకు పెట్టినట్లు ఎదురుచూస్తున్నారు. ఎమ్మార్సిలో పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు టీసీలు ఇవ్వడంలాంటి పనులు చేస్తున్నారు. ఆఫీస్ పనులు నిర్వహిస్తున్నారు. టీసీలు తీసుకపోతూ కన్నీళ్ళ వలపోతలు, కళ్ళలోంచి ఉప్పొంగుతున్న విషాద దృశ్యాలను తల్లిదండ్రులు వివరిస్తున్నారు. వేముల గ్రామంలో రెండు మరణాలు విని, వాట్సాప్‌లో చూసిన బాధలతో మనసులు లక్కలా కరుగుతున్నాయి ఉపాధ్యాయుల హృదయాలు.
శుక్రవారం సాయంత్రం ఉపాధ్యాయుల సమీక్ష సమావేశం నీరసంగా ప్రారంభమైంది.
నిశ్శబ్ధం ఆవరించిన గదిలో మౌనంగా ఫ్యాన్ రోదిస్తూ గిరికీలు కొడుతుంది. సక్ సక్ అంటూ గోడ గడియారం నిశ్శబ్ధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ‘నన్ను గురుతుచేసుకోండి’ అంటూ నెత్తినోరు కొట్టుకొని బతిమాలినట్లు ఫ్యాన్ గాలికి క్యాలెండర్ ప్రతులు ఎగిరెగిరి పడుతూ గోడకు తలబాదుకుంటున్నాయి. టేబుల్ మీది కాగితాలపై ఏవో పేపర్ వెయిట్ పెట్టినా గాలికి రెపరెపలాడుతున్నాయి. సంతాపదినాలు ప్రకటించించినట్లు టేబల్ చుట్టూ ముంపు తుఫాన్ మిగిల్చిన విషాదంతో పంతుళ్ళు. ఎమ్మార్సీలో టేబుల్ కేంద్రంగా ప్రధానోపాధ్యాయులు మాదవరెడ్డి సార్.
అన్ని విషయాలు చర్చించారు..
‘‘రేపు రెండో శనివారం సెలవు. అయినా రేప్పొద్దున్నే మనం పనిచేసిన పాఠశాలకు పోదాం. రిజర్వాయార్లో నీళ్ళు నింపుతారట. పోదాం. ఇప్పుడు పోకపోతే ఇంకెప్పుడూ పోలేమ్. పోయినా చూడమ్. చూద్దామనుకున్నా ఉండది. మన గురుతులు శిథిలం. జ్ఞాపకాలు శకలాలుగా గంగపాలు. తరానికి తత్వం చెప్పిన మన తండ్లాట, జ్ఞానవంతులను చేసిన మన ఆరాటం. అజ్ఞానంపై చేసిన అక్షరసమరం అన్నీ అడుగున చేరుతాయి. బడీ, గుడీ ఊరు మునగుతుంది. ఐదేళ్లు ఉద్యోగం చేసినమ్. ఒకసారి కలెతిరిగి ఆ జ్ఞాపకాలనీ కల్లకద్దుకుందాం.
మనదగ్గర చదివిన పిల్లల కుటుంబాలలో మరణాలకు సానుభూతి తెలుపుదాం. మీరేమంటారు?’’ అని వైరాగ్యంతో మాధవరెడ్డి సార్ ఉరఫ్ ఎంఈఓ గారు అడిగారు.
‘‘పోదాం సార్’’ అని గుంపు సమాధానం.
అయినా ఒక్కొక్కరిని విడదీసి పెద్దసార్ అడుగుతుంటే..
‘‘పోదాం సార్! ముంపు గ్రామాల పాఠశాలల పిల్లలు తల్లిదండ్రులతో వొచ్చి చెప్పుతన్న బాధలు వింటుంటే మనసు కలికలి అయితుంది సార్.’’ అని వాసురెడ్డి సార్.
‘‘ప్రతి జీవితం పఠనీయ గ్రంధం. వెలుదామ్ సార్’’ జగపతి సార్.
‘‘ఆ బాధలు వింటుంటే కళ్ళకు రక్తమొస్తుంది సార్. తప్పకుండా పోదాం!’’ వెంకటయ్య సార్.
ఎనిమిది మంది స్టాఫ్ ఎనిమిది రకాల జవాబులు.
శనివారం ఉదయం, అంపశయ్య మీది తల్లిని పరామర్శించడానికి ఖండాతారాలు దాటివచ్చిన కొడుకుల్లా సెలవు రోజున ఉపాధ్యాయులు బయలు దేరారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశం నుంచి బయలుదేరినా ఆలోచనలు బైక్ వేగంను మించిపోతున్నాయి.
‘పోవాలి. ఆఖరు చూపుకు. ఆటంకాలన్నీ దాటిపోవాలి. మనసుని పాతాళ గరిగెచేసి దేవిచూస్తే ఏమైనా దొరుకకపోతయా? కన్నీళ్ళ ఆవిరి కనబడకపోతదా? చితి బూడిదని ఆత్మతో గాలించాలి. ఎముకల నుసి ఎతలేమైన చెబుతుందేమో? పగిలిన తలపండులో ప్రశ్నలేమైన మిగులవచ్చు?’ అని తెలుగు మనసు ఆలోచిస్తూ సాగుతుంది.
‘వాటర్ ఈస్ నీడెడ్. సో మస్ట్ ఆరేంజ్. అదర్ వైస్ టోటల్లి డ్రాట్.’ ఆంగ్లం థింకింగ్.
‘నిర్వాసితులకు పరిహారమ్ బారువడ్డీలు, చక్రవడ్డీలు కడుతూ ఎట్లైతే బాగుంటుందో లెక్కగడుతూ’ లెక్కల సారు లెక్క దాటకుండా బండి నలబై వేగంతో నడుపుతున్నాడు.
‘జీవి మనుగుడ సాధించడం కోసం ఎంతదూరమైనా వెల్లుతుంది. జీవించడమే ముఖ్యం కదా?’ జీవశాస్త్ర ఉపాధ్యాయులు.
‘అయిదేండ్లు కొలువు చేసిన తావును మరువాలంటే జన్మరంది. సమాజం ఎట్లా? ఊరిడిసినోల్లెట్ల? వాళ్ళది బొడ్డుతాడు మనాది. మనసుల మమతలు. అల్లుకున్న అనుబంధాలు. పంచుకున్న ఎతలు. మాయిముంతల గురుతులు గుండెలని కోస్తున్నా అభివృద్ధికోసమేనా? ఎంతో లాభముంటది’ సాంఘిక బోధకులు సోమేష్ అంతర్మథనం.
భారతదేశానికి అడ్డంగా వింధ్యా సాత్పూర పర్వతశ్రేణిలా ఉన్నట్లు రోడ్డుకు అడ్డంగా పొలిమేరల కలుపుకొన్న చెరువుకట్ట ఆకాశంలోని మేఘాలతో సయ్యాటలాడానికి పెరుగుతుందా? అన్నట్లుంది కట్ట. పర్యావరణం కోల్పోయినా రాష్ట్రం బాగుపడితే చాలు’ అని జీవశాస్త్రం అంచనా.
ఏటవాలుగా ఉన్న కట్టమీదికి నా టూవీలర్ కట్ట ఎక్కలేక తండ్లాడుతుంది. తప్పుతుందా? అతికష్టమ్మీద కట్ట ఎక్కితే పర్వతం ఎక్కినట్లున్నది. కట్టమీంచి ఊరును గమనిస్తే ప్రోక్లేనర్లు బూమిని జల్లెడలా తూట్లు పొడుస్తున్నాయి. మట్టి కోసం తొవ్విన గుంటల్లో నీళ్ళ అలలు ఎగసిపడుతున్నాయి. పక్కనే మట్టిని మోస్తున్న లారీలు నెలలు నిండిన గర్భినిలా తండ్లాడుతూ కదులుతున్నాయి.
ఒకవైపు ఒడ్డెరోళ్ళు కట్టకు రాళ్ళు పేరుస్తుంటే సమాధికి సింగారించినట్లే ఉంది. పచ్చటోపీలు సైగలు, మెరుపు అంగీల కార్మికుల నడుమ చీమల కుచ్చలాగా పనిచేస్తున్నారు. ఇసుక, కంకర రాశుల దుమ్ముదూళి గాలిలోకి లేసి ఎలిక్యాప్టర్‌కి సిగ్నల్ ఇస్తున్న పొగను పోలి ఉంది.
అక్కడంతా శూన్యం. పొక్కిలవుతున్న భూమి నుంచి పైకెగస్తున్న దుమ్ము, ధూళి. చెట్టూ చేమా, పిట్ట, పీచు ఏదీ లేదు. ఉన్నది యంత్రాల ధ్వనులు. మోటర్ల రొద. ఐనా పోతున్నం. ర్యాంపు దిగి మట్టి రోడ్డెంట ఊళ్ళోకి పోతుంటే ఊరు శ్మశానమైందా? శ్మశానమే ఊరైందా? తేల్చుకోలేకున్న. నేను గతుకుల రోడ్డెంట బండి వేగం ఇరువైమీద పోయి బడివద్ద ఆగింది.
విద్యార్థులతో కలకళలాడిన పాఠశాల అసహాయంగా చేతులుచాచి గుండెలు బాదుకొని రోదిస్తున్నట్లు కనిపించింది.
పాఠశాల ఇప్పుడు కార్మికుల ఆవాసమైంది. నాకు దు:ఖం ఆగలేదు. బడి శతృసేనకు చిక్కిన యుద్ధఖైదీలా కనపడుతుంది. ఎవరూ రావోద్దనీ బడిచుట్టూ రెండు గజాల వెడెల్పు, లోతుతో పెద్ద కందకం తొవ్విండ్రు. ఒక్కొక్కరుగా బండి దిగుతూనే గుండెతడి కళ్ళల్లో ఉబుకుతుంది. బైకులు పార్క్ చేసి, గత స్మృతులను నెమరేసుకున్నాము.
బడి జ్ఞాపకాలు పెకిలిస్తున్న డిటోనేటర్లయి మనసును పేల్చేస్తున్నాయి. సెక్యూరిటిని అడిగి బడి కాంపౌండ్ లోనికి వెళితే బడి బడిలా లేదు. బంధిఖానలా ఉంది. తండ్రిచచ్చి ముండమోసిన తల్లిలా ఉంది. బడి పేరు మబ్బుచాటు చంద్రునిలా కనపడుతుంది. అదిప్పుడు కార్మికుల భోజనశాల అయ్యింది. పొయి నిత్యం అక్షయపాత్రలా మండుతూనే వుంటుందట. ఈ బడిలో కొందరికి విరామశాల. మరికొందరికి కార్కానా. అందరికీ అదే ఆఫీస్. మేం చెప్పిన బడి ఇప్పుడు రెక్కలు తెగి విలవిల్లాడుతున్న జటాయువులా, వందగాయాలు భరిస్తున్న సిలువమీది క్రీస్తును పోలి ఉంది.
అశ్రు నయనాలలాంటి నివాళుల మధ్య కాస్త అటు ఇటుగా అందరం కలుసుకున్నాము. లోనికి వెళ్లాము. తడిమి తనివితీరా చూసుకున్నాము. ఆఖరుసారి ఫోటో దిగాము. అంతకంటే ఏంచేయలేము గనుక.
‘‘ఊరులోకి వెళ్దాం పదండి’’ అని పెద్దసార్ తొవ్వ తీసిండు. పరిహారం అందిన వారు ఆర్ అండ్ ఆర్ కాలనీకి వెళ్లారు. వివిధ కారణాలతో పరిహారం అందనివారు. ప్యాకేజీ కోసం ఊళ్ళో ఎదురు చూస్తున్నారు. దూరప్రాంతాలలో వలస వెళ్ళిన వీళ్ళంతా ప్యాకేజీ కోసం తిరిగొచ్చినవారే. ప్యాకేజీలు చాలా రకాలున్నాయి.
ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క బాధను గుండె చీల్చుకొని చెప్పుతంది. ఆర్ అండ్ ఆర్ కాలనీ నుంచి ఊళ్ళోకి మళ్ళీ రావోద్దనీ, ఇల్లు మంచిగుంటే మళ్ళీ రావోచ్చు. మరింత పరిహారం అడుగొచ్చు. ఏదేమైనా కావొచ్చునని వెళ్ళిన వారి ఇండ్లను ఎనగర్రను జేసీబితో రంధ్రం పొడుస్తున్నారు. తేళ్ళు, పాములు ఎల్లిపోయిన ఇండ్లలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి.
ఊళ్ళోకి సార్లోచ్చిండ్రని బతుకపోయి పేరు లేక పరిహారం అందని వారు ఏమైనా పరిహారం అందవచ్చని అక్కడ అక్కడ వలస పోయినోల్లు ఊళ్ళో ఉన్నోళ్ళు అందరు ఎదురొచ్చిండ్రు.
‘‘సార్. సర్వే కొచ్చిండ్రా! మాకు పైసలొచ్చినయా? ఎప్పుడొస్తయి సారూ’’ అని ఒకామె ప్రశ్నలే ప్రశ్నలు వేస్తుంది.
‘‘అందరితో తీసుకుంటే అయిపోవు సారూ. నా ఇల్లు జాగ ఎక్కువుందనీ, తగ్గరేటు పెట్టలేదనీ వొద్దన్న. గంతే. నా బతుకు ఉట్టికందలే. సర్గానికందలే.’’ అని ఒక ఆడమనిషి ఏడుపు.
‘‘నేను బతుకపోయిన సార్. ఇదే బడిలో చదివిన. ఇగో నా బొనోఫైడ్’’ చూపుతూ ముడతలు పడిన చర్మంతో ఒక అరువైయేళ్ళ యువకుడు.
‘‘మా ఇల్లు మళ్ళా కొలుసుకపోతరా?’’ అని మరొకరు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్పుకుంటుండ్రు.
‘‘మేం బడి సార్లం. మేం ఆఖరిసారి ఊరును చూసిపోయేతందుకు వచ్చినమ్.’’అని పెద్దసార్ సమాధానమిచ్చిండు.
‘‘మమ్ముల బతుక సూడుర్రి. పెద్దసార్లకు జర చెప్పుండ్రి. మీరు మండలంల ఉంటారుగద సార్. ఇంతకుముందు అన్ని మీరే రాసి పంపిండ్రు కదా సార్ మీదికి’’ అని రెండుచేతులు జోడిరచిన దీనంగా వేడుకుంటున్నారు.
‘‘సరేనమ్మా! మొన్ననే కలెక్టర్ పేపర్కిచ్చిండు. అధికారులు వొస్తరు. రీసర్వే చెస్తరు. అందరికీ న్యాయం చేస్తరు. బాధపడకండి.’’ అని పెద్ద సార్ ఓదార్చినా వారికవి ఆవిరవుతున్న ఆశలుగా కనబడుతున్నాయి.
ఊరంతా దొంగలుపడి దోసుకపోయినట్లుంది. మజీద్ నుంచి నమాజ్, గుడిమీది కీర్తనలు, బ్రహ్మంగారి కాలజ్ఞానతత్వాలు, గీతాపారాయనం. చర్చ్ గంటలు లేక మూగవైపోయాయి. ఊరిప్పుడూ పిల్లి మెడలు పట్టిన కోడిలా ఉంది.
వాసురెడ్డిసార్ ‘‘సార్! చనిపోయిన మాల్లారెడ్డి ఇంటివైపు తొవ్వతీసిండు. జ్ఞాపకాలనీ చెరుగుకుంటూ అడుగులో అడుగేస్తున్నారు. వాకిళ్ళల్ల గరక, మొలిచింది. పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చెట్లన్నీ కొట్టేయగా, పాడిపంటలతో విలసిల్లిన భూమి ఇప్పుడు చింపిరి జుట్టుతో ఈరబోసుకున్నట్టు కనపడుతుంది.
శేరిపల్లి మల్రెడ్డి ఇల్లు చూస్తే జేసీబీతో పెళ్లగించబడ్డది. ఇల్లొక్కటే పెళ్లగించబడిరదా? జీవితం కూడానా? అని అనిపించకమానదు. మల్రెడ్డి అన్న ఎల్లారెడ్డి సార్లకు బాధలని కన్నీళ్ళ బొక్కెనతో తోడిపోత్తండు.
**********
‘‘మల్రెడ్డి ఈ ఏటికి నలభై ఏండ్ల వయసు. మల్రెడ్డి ఒక్కడు కాదు. ఒక్క కుటుంబం. అతనిది ఒక్క బాధకాదు. పేరుకు రెడి ్డకులమైనా పేదోడే సారూ. తనకున్న కొద్దిపొలాన్ని దున్ని, కూలీ పనులు చేసుకుంటూ బతికేటోడే. బాధ్యతగా అన్నీ బాధల్లో తానే కనబడేవాడు. తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఎట్లా నిలబడి కొట్లాడిరడో అట్లానే ముంపు కొట్లాటలో ముందుండిపాల్గొన్నాడు. తాయిలాలకు ఆశపడ్డ పోరాటం సల్లపడ్డది. నమ్మినానపోత్తే పుచ్చి బుర్రలైనయని బాధపడుకుంట మల్రెడ్డి నీరుకారిపోయిండు.
ముంపు పరిహారం కొద్దిగానే వొచ్చింది. బాకీలకు సగం. బతుక్కు సగం. కానీ భవిష్యత్తే ఆగమైంది. ఒక ప్లాట్ తీసుకొన్నడు. ఒక టీవియస్ కొనుక్కున్నడు. మూన్నేళ్లు తిరిగేవరకు బతుకు ఖర్చుల పాలయింది. ఒకప్పుడు ఊళ్ళో పని దొరికేది. లూటీ పోయిన ఊల్లే ఏం దోరుకుతది సారూ మన్నా మశాడమా? కొత్త మురిపాన ఇత్తడి పోగులా కూలి కైకిలి కోసం ఊరుదాటి పదిహేను కిలోమీటర్లు పోవుడు అందరికీ గమ్మతిగా అలవాటైంది. పనిలేదని ఒట్టిగుండడు. ఎడ్డుర్కం లేదు. ఏదో పని కల్పించుకుంటడు. పనిచేస్తడు సారూ రెడ్డి కులమనే ఫీలింగ్ లేదు. గర్వం లేకుంట ఏదో ఒక పనిసేస్తుంటడు.
ఎల్రెడ్డి చెప్పుతుంటే మధ్య మధ్యలో మాధవరెడ్డి సార్ ‘ఊ’ కొడుతున్నాడు. మిగతా సార్లు కన్నార్పకుండా వింటున్నారు.
ఎండాకాలం మొదలైంది. చెరువు కట్టకు మట్టితీసిన గుంతల్లో నీళ్ళు ఊరినయి. పిల్లలకు ఈత నేర్పుదామని పదేళ్ళ, ఏడేళ్ళ పిల్లలనీ తీసుకెళ్లి ఈత నేర్పిస్తుండు. గతంలో మల్రెడ్డికి నీళ్ళల్లా మునిగి పంపులకు, మోటర్లకు తాడుకట్టి మీదికి తెచ్చిన అనుభవమూ ఉంది.
నీళ్ళల్ల కరెంట్ స్తంభాలకు అల్యూమినియం వైర్లు వేలాడుతున్నాయి. కొంత వైరు మునిగి అడుగు చేరింది. ఎట్లాపుట్టిందో ఆ పాడు బుద్ది. త్వరగా పిల్లలనీ ఇంటివద్ద వొదిలి, మళ్ళీ అదేచోటుకి పోయిండు. నాలుగుసార్లు మునిగి, అల్యూమినియం వైరు ఒక్కదగ్గర వేసిండు. తాడు కట్టి ఉంటడు. ఇంకో రెండు గజాలైతే తేలుతదనుకున్నప్పుడు తాడు జారిపోయుంటది. జారిపోయిన తాడుకోసం మళ్ళీ మునిగిన వైరు బరువుకు జల్ది అడుగు పట్టింది. మునిగిండు.
వైరు అడుగుపట్టడంతో ఊబి కదిలి నీళ్ళు మురుకులు అయితయి గదా సారూ. లోపల తిరిగి తిరిగి పాతాలగరిగేలా గాలిచ్చి ఉంటడు. ఉన్న దమ్మంతా వెతుకడానికే సరిపోవచ్చు.
నీట్లో ఒకవైపు చీకటి కమ్ముకుంటుంది. పొద్దుపోతుంది. తాడు వదిలితే ఊబిలో వైరు, తాడు దొరుకది. ఇంతవరకు చేసిన పని వొట్టిదైతదనీ, దొరికిన తాడును పట్టుకుంటే జారిపోతదనుకోవచ్చు. నడుముకు కట్టుకున్నాడు.
ఈదుకుంటూ ఈదుకుంటూ పైకి తేలుతున్నాడు. తన కాళ్ళకిందుగా చూస్తుంటే వైరుసుట్ట పర్వతంలా వొస్తుంది. దమ్ముపట్టి సంతోషపడుతున్నాడు. ఈదుతుంటే ఇంకో గజమ్మీదికి వచ్చేసమయంలో దరికి ఆనుకొని పెరిగిన తుమ్మపొదకు వైరుతాడు చిక్కింది.
మల్లారెడ్డిని మీదికి కదలనిస్తలేదు. ఆలోచించుకునే లోపల ఏమీ తోచలేదు. లాభం లేదనుకొని నడుముకు కట్టుకున్న తాడు ముడి విప్పపోతే అప్పటికె బిర్రుగైంది. మీదికి రాలేక కొట్టుకాడుతున్న మల్లారెడ్డి తెగిన గాలిపటంలా అడుగుపట్టి ఉం..ట..డు సార్ అని కళ్లలో నీళ్లు నింపుకున్నడు. గొంతుకూడా దు:ఖ స్వరంగా మారింది.
ఈ బాధ చూడలేక గగన సూర్యుడు గూట్లోకి జారుకున్నాడు. మల్ రెడ్డి నీళ్లలో మునిగిండని ఊరు ఊరంతా పుకార్లు పుట్టినయి సార్. బొడ్డూడని పిల్లకాన్నుంచి సూడడానికి తీర్తమోలే అందరూ వచ్చిండ్రు. అక్కడున్న టీవియస్ బండి, బట్టలు చూసి అయ్యో మల్రెడ్డి, అయ్యో మల్రెడ్డి అని గుండెలు బాదుకుంట ఏడుస్తున్నారు. నీళ్లలోకి కొందరు టార్చిలైట్లు పట్టి దిగిన చోటు, వైరు గురించి చూస్తూ మాట్లాడుతున్నారు. తీయలేకపోతున్నారు. పోలీసులకు తెలిసింది.
ఆ మరుసటిరోజు వరకు మల్లారెడ్డి పోలీసులకు దొరకలేదు. తానే నీటిమీదికి నడుముకు కట్టుకున్న వైరుతో తేలుతున్నాడు సార్.’’ పూసగుచ్చినట్లు పెద్దసార్కు చెప్పుతుండు అనుభవశాలి.
పెద్దసార్ ఊ కొడుతున్నాడు మధ్య మద్యలో. శవాన్ని సూసుకుంటు ఏడుస్తండ్రు.
సార్ ఈ ఊల్లే ఇజ్జతిగా బతికేతోళ్లను పనిలేక దొంగల్ని చేసిందేవరు? కడుపుకు చంపిందేవలు?’’ అని గుచ్చి గుచ్చి ఎల్లారెడ్డి అడుగుతుండు.
సమాధానం చెప్పలేని మాధవరెడ్డి సార్‌కి, అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినయి. మనసు పొడి బట్టను పికిలిపోయే విధంగా పిండుతున్నట్టు కకావికలమైన హృదయాలతో మౌనంగా సార్లున్నారు నేల సూపులు చూస్తుండ్రు.
ఊళ్ళోకి పోతున్నారు. కూల్చిన ఇండ్లతో ఎటు చూసిన స్మశాన వైరాగ్యం కొట్టుకాడుతుంది. తీర్తమొలే సాగే జాండ బండబారిపోయింది. శివసత్తులతో భవిషత్తు చెప్పే మైసమ్మ నోరుమూసుకుంది. దీక్షా శిబిరమిపుడు కాలిన కాష్టంలా మండి చల్లారినట్లు కనపడుతుంది. వెలుగులు చిమ్మిన బంగ్లాల్లో చీకట్లు కమ్ముకున్నయి.
వాసిరెడ్డి సార్ ‘‘సార్! తూటుకూరి మల్లారెడ్డి ఇంటి దిక్కు పోదామని’’ విన్నవించాడు.
అడుగులు తడబడుతున్నాయి. సార్లు ఒచ్చిండ్రని ఒక్కొక్కరు ఇంకా వస్తూనే వున్నారు. అడుగుతూనే ఉన్నారు.
‘‘మేం ఊరును చూడడానికి వొచ్చిన’’మని చెప్పుడు మాకు పరిపాటి అయిపోయింది.
రాష్ట్ర, జాతీయ వార్తల్లో చోటు సంపాదించిన ఇల్లు. నిలువెత్తు దుఖం. ఎంతో మంది దర్శించిన దర్శనీయ స్థలమో అది. నేతలు మౌనం పాటించిన ఇల్లు. బాధితుల పక్షంగా నిలబడి నినదిస్తున్న ఇల్లు. ఒక్కసారిగా జాతీయ వార్తల్లో కెక్కిన ఇల్లు. బాహ్య ప్రపంచానికి బాకాలూది బాధలు తెలిపిన ఇల్లు తూటుకూరి మల్లారెడ్డిది.
ఒకామె ప్యాకేజీ బాధ చెప్తుంది.
‘‘సారు! తూటుకూరి మల్లారెడ్డికి డెబ్బై ఏళ్ళు. ఐదేళ్ల క్రీతమ్ అతడి భార్య క్యాన్సర్‌తో పొరాడి ఓడిపోయింది. భార్యను బతికించుకోవాలనీ ఉన్న ఎకురం భూమి అమ్ముకున్నాడు. అంతకుముందు ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళకు జాగా అమ్మాడు. ఎదిగి వచ్చిన ఆడపిల్లలు తండ్రిని ఒంటరిగా వదిలి అత్తగారు ఇళ్లకు వెళ్లిపోయారు. కొన్నాళ్లపాటు ఇదే ఊళ్ళో ఉండి చిన్న చిత్క పనులు చేసుకున్నాడు.
కాలం పగబట్టి కాళ్లు రెక్కలు తెగ్గోసినట్లు మల్లారెడ్డి పెద్దల్లుడు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. చిన్నల్లుడు అప్పుల పాలయ్యాడు. ఆయనకు సహాయం చేసే పరిస్థితుల్లో ఎవరూ లేరు.
సట్టు ఉంటే సుట్టు తిరిగే లోకం కాదు సారూ. ఆయనకు ఎవలు జేస్తరు సాయం.
పెద్ద బిడ్డ దగ్గరనే చిన్న చితక పనులుచేస్తూ గజ్వేల్లో ఉంటుండేవాడు. ఊరు పోతుందని తెలిసి అప్పుడప్పుడు వచ్చి పోతున్నాడు. వాని ప్యాకేజీల మన్నువడ. పరిహారంల రాయివడ. బతుకే ప్యాకేజీ అయ్యింది. ఎమ్మార్వో దగ్గరికి మండలాఫీసుకు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్‌కు ఎన్ని జాగలకు తిరిగిండో లెక్కలేదు. ముంపు పరిహారం కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది.
అతని పేరుమీద జాగ లేదు. పరిహారం రాలేదు. ప్యాకేజ్ ఇవ్వరు. ఇల్లు ఇవ్వాలంటే కుటుంబం ఉండాలన్నారు. నీవు ఒంటరి పురుషుడవు. నీకు అర్హత లేదని తేల్చేశారు అధికారులు.
ఎవరికీ అక్కరకురాని బతుకు బతికే కంటే అగ్గిలపడి సచ్చుడు మేలు అని అంటుండే. ఉన్నా ఒక్కన్నే పోయినా ఒక్కన్నే. బాధతో కోపంతో అంటుండు అని అనుకున్నం. కానీ ఇంత పని ఐతదునుకోలే సారూ.
ఆరిపోయే దీపానికి కాంతి ఎక్కువన్నట్లు ఆ రోజు అందరిని నవ్వించాడు. వరుసైన వాళ్లను కవ్వించి గిలిగింతలు పెట్టాడు. అంతకు ముందు రోజు నుంచే తన ఇల్లు కట్టెలు ఊడదీసి పోగు చేసిండు. దశమినాడు రాత్రి పదకొండు గంటల వరకూ మా ఇంటి వద్దనే ముచ్చట పెట్టిండు. మేము నిద్రలో జారుకున్నాము. ఏం చెప్పుదు సారూ! ఎట్ల చేతులొచ్చినయో సారూ.... ఆమె మనసు పక్కన పగిలింది. ఆమె హృదయం వేయి ముక్కలుగా శకశకలాలయింది. ఒక్కసారిగా లావాలా దు:ఖం ఎద తన్నుకొచ్చింది.
మాకు కూడా పేగులు తెంపేసిన బాధ కలిగింది.
దమ్ము తన పని తను చేసుకున్నాడు. తెల్లారి లేచి చూసే వరకు కాలిండు. కూలిండు. మనిషి బూడిద అయ్యిండు. రాత్రి మాట్లాడి ముచ్చట పెట్టిన మనిషి తెల్లారే వరకు పంచభూతాల్లో కలిసిపోయిండు. ఏం దరిద్రం సారూ.
పానముండంగా తన కాడు పేర్సుకొని సచ్చిపోయినోళ్ళు ఎవలన్న ఉంటారా ఈ భూమ్మీద? సాగర్ కోసం మొన్నటికి మొన్న శేరిపల్లి మల్లారెడ్డిని పని చూపక సచ్చెటట్టు చేసిందెవలు? తూటుకూరి మల్లారెడ్డికి చావుమని పురికొల్పిందెవలు? సర్కార్ నుంచి సహాయం ఏది వచ్చినా బతుకు. మాది కుక్క బతుకయ్యింది సారు’’ అని ఆమె కొంగు అడ్డం పెట్టుకొని కోపం కలగలిపి ఏడుస్తుంది.
‘‘ఇంకా వెలివాడల పరిస్తితి ఎట్లుండాలే.’’ ఒక సార్.
‘‘మా ఎక్కువోళ్లనే కానుతలేదు. గా మాలమాదిగోళ్లను ఎవడు పట్టించుకున్నడు? సారూ.’’ బాధతో ఒక అవ్వ అన్నది.
‘‘నీళ్లు నింపుతరట కదా సార్? మాకు ఏమన్నా వచ్చేటివి వస్తయా? రావా? అవునా సారు మమ్ముల ఈ చెరువు కట్టకు బలిచ్చి నీళ్లు నింపుండ్రి సార్.’’ చూపు ఆనని గాజు కళ్ళ ముసలామె బాధ.
విచారణ అధికారిగా ఉన్న మాధవరెడ్డి సార్ విధి వెక్కిరింతల్ని ఏం చెప్తాడు.
పీరీల పండుక్కు ఏబీసిగాని తలగొట్టినట్లు, సావుకు పోయి వెనుదిరిగినట్లు సార్లు ఎనుకకు నడిచొచ్చిన తొవ్వకు దారి తీస్తుంటే... ‘‘మనుషులను మనుషులు పట్టించుకోకపోతే మానులు పట్టించుకుంటయా? పట్టించుకోండ్రి సారు అని ఏడుస్తూ ఒకామె కాళ్ళ మీద పడ్డది. వదులతలేదు. మట్టిలో చిన్నపిల్లల పండి పొర్లుతుంది. చర్ణకోలతో కొట్టినట్లనిపించింది. మాధవరెడ్డి సార్ ఏడుస్తూ తన హోదా మరిచి మట్టి మీద కూర్చొని ఆమెను ఓదార్చుతుంటే మనసు మహా సముద్రం అయ్యింది.
దరి చేరే అలలా బరువైన ఎతలతో శాపనార్థాలు వింటూ ఎవరి దారిన వాళ్ళు ......
- డా. సిద్దెంకి యాదగిరి 9441244773
Sygiri773@gmail.com