స్వీయ రచన
స్వీయ రచన అంటే... పిల్లలు తమ అనుభవాలను, ఆలోచనలను, తెలుసుకున్న అంశాలను, తమ భావాలను సొంతంగా తగిన విధంగా రాయడమే స్వీయ రచన. ఈ స్వీయ రచన రాసేటప్పుడు భావానికి అనుగుణంగా, సరైన వాక్య నిర్మాణంతో, తగిన పదజాలాన్ని ఉపయోగిస్తూ దోషరహితంగా రాయాలి. స్వీయ రచనలో ఎవరి శైలి వారిదే. ఎవరి ఆలోచనలు వారివే.
మన వాచకాల ప్రధాన లక్ష్యం అభ్యసన ఫలితాల సాధన. సామర్థ్యాల వారీగా ఉన్న అభ్యాసాలలో స్వీయ రచన ప్రధానమైన సామర్థ్యం. పరీక్ష అంశాల దృష్ట్యా స్వీయ రచనను బాగా సాధన చేసిన విద్యార్థులు మంచి మార్కులు సాధించడం మనం గమనిస్తూనే ఉన్నాం.
ఆలోచించండి, చెప్పండి:
- స్వీయ రచన అంటే ఏమిటి?
- స్వీయ రచనను పెంపొందించే వ్యూహాలు ఏవి?
- స్వీయ రచనను తరగతి గదిలో ఎలా నిర్వహించాలి?
రాయడం అంటే ఆలోచనలను క్రమబద్ధీకరించి వ్యక్తీకరించడం. ఎవరినైనా ఒక విషయం గురించి మాటల్లో చెప్పమన్నప్పుడు కొందరు తడబడతారు. కొందరు ధారాళంగా మాట్లాడతారు. అలా మాట్లాడేటప్పుడు విషయంలోని అంశాలు ముందు వెనుక కావడం, సన్నివేశాలు ముందు వెనుక కావడం, స్వేచ్ఛగా పదాలను ఉపయోగించడం మొదలైనవి జరుగుతాయి. అదే అంశాన్ని రాసేటప్పుడు స్పష్టంగా, ఖచ్చితత్వంతో, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా లేఖన నియమావళిని అనుసరించి రాసే ప్రయత్నం చేస్తారు. అంటే మౌఖిక వ్యక్తీకరణ కన్నా లిఖిత రూప వ్యక్తీకరణలో స్పష్టత సుస్పష్టంగా ఉండాలని అర్థమవుతుంది.
HS TEL Handout july 2026 -
ప్రస్తుతం మన బడి పిల్లలు స్వీయ రచన ఎలా రాస్తున్నారు అనే విషయం ఆలోచిస్తే, అతి తక్కువ మంది మాత్రమే సొంతంగా రాయగలుగుతున్నారు. మిగతావారు ఇతర సమాచారాలను ఉపయోగిస్తూ పూర్తి చేస్తున్నారు. ఇంకొందరు పిల్లలు ఇతర పిల్లల రాత పుస్తకాలను ఆధారంగా చేసుకొని రాస్తున్నారు.
స్వీయ రచనలో ఎదురవుతున్న సమస్యలు:
- అక్షర దోషాలతో రాయడం.
- సరైన వాక్య నిర్మాణం లేకపోవడం.
- తగిన పదజాలం వాడకపోవడం.
- అనేక పునరుక్తులతో రాయడం.
- విషయాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా వివరించకపోవడం.
- ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకొని రాయలేకపోవడం.
- పేరాలుగా కాకుండా పాయింట్ల వారీగా జవాబులు రాయడం.
- సూచించిన నిడివిలో జవాబు రాయలేకపోవడం, మొదలైనవి.
స్వీయ రచనకు ప్రాతిపదిక — రాయడం రావడమే!
రాయడం/స్వీయ రచన పెంపొందించే వ్యూహాలు:
సొంతంగా రాయడం అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ.
-
పాఠం ఆధారంగా పదాలలోని అక్షరాలను గుర్తింపజేయడం, వాటి ధ్వనులను గుర్తింపజేయడం జరగాలి.
-
వర్ణమాల ఆధారంగా సరళ పదాలు చెప్పించడం, రాయించడం చేయించాలి. గుణింతాలు నేర్పేటప్పుడు ఒకేసారి అన్ని గుణింతాలు కాకుండా, దీర్ఘం సాధన చేయిస్తే అన్ని అక్షరాలకు దీర్ఘం సాధన చేయించాలి. ఆ తర్వాత మిగతా గుణింతపు గుర్తులు సాధన చేయించాలి. హ్రస్వ-దీర్ఘ అక్షరాలకు మధ్యనున్న ఉచ్చారణ భేదం మరియు ఆ గుణింతపు గుర్తు అవగాహన కలిగించాలి.
-
ద్విత్వ, సంయుక్తాక్షర పదాల దోష నివారణకు వ్యూహాత్మక సాధన జరగాలి. వర్ణమాలలో అవే ఒత్తులుగా నిలబడే అక్షరాలు, తలకట్టు తొలగిస్తే ఒత్తులుగా మారే అక్షరాలు, అక్షర రూపానికి సంబంధం లేని ఇతర ఒత్తులు అనే వాటిపై ప్రాథమిక అవగాహన కలిగించాలి. నేర్పాల్సిన ఒత్తును అక్షరానికి చేర్చి, పలికించి, దానితో మొత్తం గుణింతం చెప్పించడం, రాయించడం జరగాలి.
ఇక్కడ అక్షరాలను గుర్తింపజేయడం, అక్షరాలను కలుపుతూ పదాలు చెప్పించడం, సరిగ్గా ఉచ్చరించడం బాగా సాధన చేయించాలి. పదంలోని అక్షరాలను వేరువేరుగా గుర్తింపజేసి మాట్లాడించడం, చర్చించడం (సెగ్మెంటింగ్) కృత్యాలు చేయించాలి. అక్షరాలను కలుపుతూ పదాలు తయారు చేయించే (బ్లెండింగ్) కృత్యాలు చేయించాలి.
అక్షరాలను రాయడం అంటే ఆ అక్షరాన్ని పలికే ధ్వని, రాసే లిపి పిల్లల మనసుల్లో ముద్రించబడినప్పుడే అక్షరాలను గుర్తించడం, రాయడం జరుగుతుంది.
-
పదాల ఆధారంగా, సన్నివేశాల ఆధారంగా చిన్న చిన్న వాక్యాలు చెప్పించడం ద్వారా వాక్య నిర్మాణ శైలి అలవడుతుంది.
-
తమ స్వీయ అనుభూతులు, దైనందిన కార్యక్రమాలు చెప్పించడం ద్వారా ఆలోచనా శక్తి పెరుగుతుంది. చెప్పిన అంశాలను క్రమబద్ధంగా రాయించడం సాధన చేయించాలి.
-
నామవాచకాలు కొన్ని పట్టికగా, క్రియలు కొన్ని పట్టికగా, కర్మలను కొన్ని పట్టికగా పేర్చి, మూడింటిని ఉపయోగించి సమర్థవంతమైన వాక్యాలు చెప్పించడం, రాయించడం ద్వారా వాక్య రచనా సామర్థ్యం పెంపొందించవచ్చు.
కర్త |
కర్మ |
క్రియ |
|---|---|---|
రాజు |
పాట |
పాడు |
సిరి |
వంట |
చేయు |
కిరణ్ |
ఆట |
ఆడు |
ఇలా పట్టికలను ఇచ్చి పిల్లల చేత విస్తృతమైన వాక్యాలు చెప్పించాలి. ఈ వాక్యాలు చెప్పేటప్పుడు కాలాలను కూడా జోడించవచ్చు. వచనాలను కూడా మార్చి చెప్పించవచ్చు.
ఇక్కడ మనం గమనించవలసింది — మాట్లాడే చర్య ఎంత క్రియాశీలకంగా జరిగితే, రాయడానికి అంత సమర్థత పెరుగుతుంది.
-
కొన్ని పదాలను ఆధారాలుగా ఇచ్చి, వాటిని ఉపయోగిస్తూ నాలుగైదు వాక్యాలు రాయించవచ్చు.
-
చిన్న కథలు, వివిధ సన్నివేశాలు చెప్పించడం, రాయించడం ద్వారా విషయ వారీ క్రమ పద్ధతి అలవరచవచ్చు.
-
పాఠం పూర్తయిన తర్వాత పాఠంలోని కీలక పదాలు, పాత్రలు, సంఘటనలు, సన్నివేశాలు ఆధారాలుగా ఇచ్చి మాట్లాడించడం ద్వారా విషయ అవగాహన పెంపొందించవచ్చు. అలా చెప్పిన విషయాన్ని రాయించడం ద్వారా పేరాలుగా రాయించడం పెంపొందించవచ్చు.
-
విషయానికి తగిన మైండ్ మ్యాపింగ్ ఆధారంగా ప్రాథమిక భావనల గురించి మాట్లాడించి, రాయించాలి. ఈ మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు నల్లబల్ల మీద ఆయా పదాలు రాసి పిల్లలను ఆలోచింపజేస్తూ రాయించాలి.
-
భాషాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, పాఠం పూర్తయిన తర్వాత ధ్వని గుర్తింపు, అక్షర గుర్తింపు అనే రెండు పీరియడ్లను బాగా ఉపయోగించుకోవాలి. ఈ పీరియడ్లలో జరిగే వ్యూహాలు స్వీయ రచనకు పునాదిగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
స్వీయ రచన తరగతి గది నిర్వహణ:
- ప్రశ్న నల్లబల్ల మీద ప్రకటించడం
- చర్చ నిర్వహించడం
- మైండ్ మ్యాపింగ్ ఆధారంగా ఒక్కో వాక్యం చెప్పించడం, రాయించడం
- ఎడిటింగ్ చేయడం (భావం, వాక్య నిర్మాణం, పదజాలం, అక్షర దోషాల ఆధారంగా)
- ఇంటి పనిగా తిరిగి కేటాయించడం
రాసే ప్రక్రియను మెరుగుపరిస్తే స్వీయ రచన అభ్యాసాలు పిల్లలు తేలిగ్గా చేయగలుగుతారు. విషయంపై అవగాహన, ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకోవడం, ఎలా మొదలుపెట్టి జవాబు ఎలా పూర్తి చేయాలని వ్యూహం చేసుకోవడం — ఇవే స్వీయ రచనలో ప్రధాన అంశాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి