సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

12, జులై 2026, ఆదివారం

అభ్యాస పుస్తకం - వినియోగం


 అభ్యాస పుస్తకం - వినియోగం


విద్యార్థులలో అభ్యాస నష్టాన్ని తగ్గించి భాషా సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు అభ్యాస పుస్తకాలను 2026-2027 సంవత్సరం నుండి అమలుపరచాలని నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం (ఎన్.ఈ.పి) 2020లో భాగంగా ఎన్.సి.ఇ.ఆర్.టి సూచనల మేరకు ఎస్.సి.ఇ.ఆర్.టి పాఠ్యపుస్తకాలతో పాటు, విద్యార్థులు స్వయంగా సాధన చేసేందుకు వారి స్థాయికి తగిన కార్యకలాపాలు ఉండే విధంగా అభ్యాస పుస్తకాలను రూపొందించారు.

అత్యంత కీలకమైన ప్రాథమిక దశలో 1 నుండి 2 తరగతులకు ఎస్సీఈఆర్టీ తెలంగాణ 2018-2019 విద్యా సంవత్సరం నుండి వర్క్ బుక్స్‌ను అమలు చేస్తోంది. ఆ తర్వాత 2021-2022 నుండి ఒకటి నుండి ఐదు తరగతులకు అన్ని సబ్జెక్టులలో వర్క్ బుక్స్‌ని పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. దీని వల్ల ప్రాథమిక స్థాయిలో మంచి ఫలితాలు వచ్చాయి. ఆ పిల్లలే నేడు ఆరు నుండి తొమ్మిదవ తరగతిలో ఉన్నారు. వారి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు ఆరు నుండి పది తరగతులకు 2026-2027 సంవత్సరం నుండి అమలు చేయాలని భావించారు. అందుకే విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అభ్యాస పుస్తకాల పేరుతో అన్ని సబ్జెక్టులలో వీటిని ప్రవేశపెట్టారు. తరగతిగది బోధనకు, విద్యార్థుల అభ్యసనను మరింత బలోపేతం చేసి సామర్థ్యాల సాధనలో తోడ్పడతాయని భావించి అభ్యాస పుస్తకాలను అమలు చేస్తున్నారు.

ఆలోచించండి, చెప్పండి:

  • అభ్యాస పుస్తకాల రూపకల్పనకు నేపథ్యం, ఉద్దేశం ఏమిటి?
  • అభ్యాస పుస్తకాలు విద్యార్థులకు ఏ విధంగా దోహదపడతాయి?
  • గత సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు అభ్యాస పుస్తకాలు ఏ విధంగా ఉపయోగించారు?
  • ప్రస్తుతం 6 నుండి 10 తరగతులకు అభ్యాస పుస్తకాలు ఏ విధంగా ఉపయోగించాలి?

అభ్యాస పుస్తకాలు - వివరణ:

విద్యార్థులలో అభ్యసన ఫలితాలను మెరుగుపరిచి భాషా నైపుణ్యాలను పెంపొందించడం కోసం అభ్యాస పుస్తకాలు ఉపయోగపడతాయి. నిరంతర సాధనకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో పాఠ్యపుస్తకాలకు అనుబంధంగా, సరళంగా అభ్యాస పుస్తకాలు రూపొందించబడ్డాయి. తరగతి గదిలో విద్యార్థి నేర్చుకున్న విషయాన్ని మరింత బలోపేతం చేస్తూ, స్వయంగా అభ్యాసం చేయడానికి వీలుగా ఇవి ఉంటాయి. భాషా సామర్థ్యాలైన ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడం, స్వీయ రచన, సృజనాత్మకత/ప్రశంస, పదజాల వినియోగం, వ్యాకరణ అంశాలను సాధించేలా విద్యార్థికి ఇవి దోహదపడతాయి.

అభ్యాస పుస్తకాలలో ప్రతి పాఠానికి అనుబంధంగా అభ్యాస కృత్యాలు ఇవ్వబడ్డాయి. బట్టీ పద్ధతిలో కాకుండా అవగాహనతో జవాబులను రాసేలా అంశాలు ఉంటాయి. ఎఫ్.ఏ-1 మొదలుకొని ఎస్.ఏ-2 వరకు మూల్యాంకన విధానాలకు తగినట్లుగా అభ్యాసాలు ఉన్నాయి. విద్యార్థులలో ఆలోచనను, విశ్లేషణ శక్తిని, సృజనాత్మకతను పెంచేవిగా అభ్యాసాలు ఉన్నాయి. అలాగే స్వయం అభ్యసనకు, నిరంతర సాధనకు, విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి.

అభ్యాస పుస్తకం - నిర్మాణ క్రమం:

6 నుండి 9 తరగతుల అభ్యాస పుస్తకాలలో ప్రారంభంలో సంసిద్ధత అభ్యాస పత్రాలు 10 ఇవ్వబడ్డాయి. ఇవి సరళంగా, పదాలు, బొమ్మల రూపంలో ఉంటాయి. విద్యార్థులే స్వయంగా పూరించేలా ఇవి ఉంటాయి.

ప్రతి పాఠానికి ఐదు అభ్యాస పత్రాలతో పాటు ఒక పునఃశ్చరణ అభ్యాస పత్రం ఉంటుంది.

ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని ప్రతిస్పందించడంలో పట్టిక పూరణ, తప్పొప్పులు గుర్తించటం మొదలైనవి ఉంటాయి. ఇవి పాఠాన్ని బట్టి మారుతూ ఉండవచ్చు. పద్యం ఇచ్చి, ప్రశ్నలకు జవాబులు అవగాహన చేసుకుని రాసేలా ఉంటాయి.

స్వీయ రచన సామర్థ్యంలో ప్రశ్నలకు లఘు సమాధానాలు రాయడానికి వీలుగా ఉంటాయి. వ్యాసరూప ప్రశ్నలు కూడా ఇదే విధంగా ఉంటాయి.

సృజనాత్మకత జవాబును ఇచ్చిన సూచనలతో విద్యార్థులు సొంతంగా రాయవలసి ఉంటుంది.

భాషాంశాలలో పదజాలం, వ్యాకరణ అంశాలు విద్యార్థులే పూరించేలా సరళంగా ఉంటాయి.

పునఃశ్చరణ అభ్యాస పత్రం అన్ని సామర్థ్యాల సమాహారంగా ఇవ్వబడింది. ఇది పాఠం పూర్తయిన తర్వాత పూరించవలసి ఉంటుంది.

9, 10 తరగతులకు అవగాహన-ప్రతిస్పందన, స్వీయ రచన, సృజనాత్మకత/ప్రశంస, భాషాంశాలు అనే ఐదు అభ్యాస పత్రాలలో ఉంటాయి. చివరగా ఒక పునఃశ్చరణ అభ్యాస పత్రం ఇవ్వబడింది.

అభ్యాస పుస్తకాలు ఎలా వినియోగించాలి?

మొదటి 5 అభ్యాస పత్రాలు పాఠం బోధిస్తున్నప్పుడే పూర్తి చేయవలసి ఉంటుంది. చివరి అభ్యాస పత్రం పాఠం పూర్తయిన తర్వాత పునఃశ్చరణ కోసం ఉద్దేశించబడింది.

ప్రతి పాఠానికి సంబంధించి ప్రతిరోజు అభ్యాస పత్రం ఇవ్వాలని నియమం లేదు. ఉపాధ్యాయులు తమ విద్యార్థుల సంఖ్యను, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏ పత్రం ఏ రోజు ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకోవాలి.

ప్రతి పాఠానికి సంబంధించిన అభ్యాస పత్రాలను ముందుగానే పరిశీలించి, పాఠ్య బోధనలో సరైన సమయంలో ఇచ్చే విధంగా ఉపాధ్యాయుడు విభజన చేసుకోవాలి.

పాఠం బోధిస్తున్నప్పుడు అంశానికి సంబంధించిన ప్రశ్నను తరగతి గదిలో చర్చించి, తగిన సూచనలు చేసి, విద్యార్థులు సరైన విధంగా రాసేలా ప్రోత్సహించాలి. లేదంటే ఇంటి పనిగా కూడా ఇవ్వవచ్చు.

విద్యార్థులతో రోజుకు ఒక అభ్యాస పత్రం చేయించాలి. ఆలోచించి సమాధానం రాసేలా సూచనలు ఇవ్వాలి.

విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తిస్తూ, సహకారం అందిస్తూ ఉండాలి. విద్యార్థులపై వ్యక్తిగత దృష్టి సారించాలి. విద్యార్థుల ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధ్యాయుడు మార్గనిర్దేశం చేయాలి.

అభ్యాస పుస్తకాలను ఎలా వినియోగించాలనే విషయంపై, అభ్యాస పుస్తకాలలో "ఉపాధ్యాయులకు సూచనలు" అనే అంశం కింద స్పష్టంగా ఇవ్వబడినవి చూడగలరు.

విద్యార్థుల అభ్యసన లోటును తగ్గించడం కోసం, మౌలిక అభ్యసన నైపుణ్యాలను బలోపేతం చేయడం కోసం అభ్యాస పుస్తకాలు ఉపయోగపడతాయి. అలాగే విద్యార్థులే స్వయంగా, నిరంతరం సాధన చేయవచ్చు. సామర్థ్య ఆధారిత బోధనను మరింత బలోపేతం చేసేలా ఇవి ఉన్నాయి. అలాగే విద్యార్థుల ఆలోచనను, విశ్లేషణను, సృజనాత్మకతను పెంపొందించేవిగా ఉపయోగపడతాయి. దీని ద్వారా విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొంది, భాషపై మంచి పట్టు సాధించడం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయి పెరుగుతుంది. భాషా నైపుణ్యాలలో, సామర్థ్యాల సాధనలో వెనుకబడిన విద్యార్థులకు లోప నివారణకు ఇది సహాయపడుతుంది. ఉపాధ్యాయులు పాఠశాల పరిస్థితులను, తరగతిలో విద్యార్థుల సంఖ్యను అనుసరించి అభ్యాస పుస్తకాలను వాడుకోవచ్చు. వీటి సాధనకు ఉపాధ్యాయుడు తగిన వ్యూహాలను అనుసరించాలి. తరగతి గదిలో అభ్యాస పత్రాలలోని ప్రశ్నల పట్ల అవగాహన కల్పించి, విషయంపై చర్చ చేసి తగిన జవాబు రాసేలా ప్రోత్సహించాలి. జవాబు రాయలేని పిల్లలను గుర్తించి, రాయగలిగే పిల్లలతో జట్లుగా చేసి ప్రోత్సహించాలి. దీని ద్వారా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి