సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

19, నవంబర్ 2025, బుధవారం

దస్కత్" కథ పునాస


"దస్కత్ " కథ పునాస అక్టోబర్ - డిసెంబర్ 2025pdf


దస్కత్ 

-డా. సిద్దెంకి యాదగిరి

వీనుల విందుగా, మనోవినోదముగా సభ నిర్వహించాలని నిర్వాహకులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. పేరులోనే వీణ కలిగిన మహతి ఆడిటోరియం నింపడమంటే కత్తులమీద కవాతు చేసినట్లే. అప్పటి ముఖ్యమంత్రి మదిలో మెదిలిన ఆధునిక భువనవిజయమే మహతీ. అధికార దర్పానికి ధీటుగా, విశిష్ట సాంకేతిక పరిజ్ఞానాన్ని, అధునాతన సౌకర్యాలు మేళవించి శోభాయమానంగా నిర్మించిన కళాసౌధం.

వస్తున్న అతిథులు ఎందరు వచ్చినా “ఆసీనులు కండి” అంటూ ఆహ్వానించే మహతి ఆడిటోరియం ప్రస్తుతం పడుచు పరువాల ఒంపు సొంపులతో పరవళ్ళు తొక్కుతూ కళకళలాడుతుంది. సిద్దిపేట జిల్లా నలుమూలల నుంచి వచ్చిన డిగ్రీ విద్యార్థులు ముడుచుకున్న కుర్చీలలో ఓపెన్ చేసుకొని మహారాజులా కూర్చుంటున్నారు.

వేదికపైన అందమైన టేబుల్స్ మీద ఫ్లవర్ వాజ్‌లు, అందమైన కుర్చీలతో అలంకరించిన సభావేదికకు వెనుక భాగంలో యాభైఫీట్ల పొడవు ఇరవైఫీట్ల ఎత్తుతో ఉన్న ఫ్లెక్సీ గోడపై కడు రమణీయంగా తేలుతున్నట్లుంది.

“యువతా! కలలు విత్తు - ఎత్తుకు ఎదుగు” అనే వాక్యం ఎరుపురంగు ఎంబోజింగ్‌తో స్పష్టంగా కనబడుతుంది. ఆ వాక్యం కింద “ఆలోచించు!! పరిధి దాటి” డిసెంబర్ 1, 2024. “ఎయిడ్స్ డే” అటుపక్క, ఇటుపక్క ఎయిడ్స్ సింబల్స్. అవగాహన కల్పించే పోస్టర్లు రంగురంగుల చిత్రాలతో వేలాడదీశారు.

“అరే మామ! ఎయిడ్స్ డే రోజున మేల్కొమ్మంటే ఏమన్నాట్రా? పాజిటివా? నెగెటివా? ఎలాంటి అర్థంరా చెర్రీ!!” అని శ్రీమాన్‌ని అడుగుతున్నాడు ప్రవీణ్. “పవీ! నీకు అన్ని అనుమానాలే. ఆగరాదురా! అన్నీ తెలుస్తయి.” అని సిద్దిపేట డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు చర్చలు చేస్తున్నారు. విహారయాత్రకి పోయిన ఆనందం అందరిలో అలుముకుంది.

టీన్స్ అంటే పిల్ల కోతులు కదా! కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఒక్కొక్కరు ఆభరణాలు లేని ఆధునిక చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారు. బయల్దేరే ముందు ప్రాజెక్ట్ ఆఫీసర్ సూచనలు ఎప్పుడో గాలి రాతలయ్యాయి. ఒక్కొక్కరిలో అపరిచితులు ప్రత్యక్షమవుతున్నారు. గాన గాంధర్వులే కాదు, పురి విప్పిన మయూరాలు, వస పిట్టలవుతున్నారు. మొత్తంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు.

అక్కడి వాతావరణం చూపులమేళా జరుగుతుందా అన్నట్లుంది. కొందరు చలాకి చూపులతో వడిసెల విసురుతున్నారు. చూపులను అంకుశాలు చేసి గుచ్చి గుచ్చి చంపుతున్నారు కొందరు. చూపులను క్షిపణులు చేసి అంతరంగాలను కొల్లగొడుతున్నారు ఇంకొందరు. సంధించిన చూపులు కొన్ని చిరునవ్వులు చిందిస్తూ మాటలతో ఆకట్టుకుంటూ అల్లుకుంటున్నాయి. కొన్ని చూపులు సరిహద్దు శత్రువుల్లా ఎరబడ్డ ముఖంతో నిప్పులు చెరుగుతున్నాయి.

ఏకలవ్యుడు శబ్దభేది ప్రయోగించినట్లు అందాల హరివిల్లులు తారసపడగానే కొన్ని బిత్తర చూపులు బంధీ అవుతున్నాయి. చూపులు కొన్ని సౌందర్యాన్ని ఆరాధిస్తున్నాయి. వాతావరణం అంతా చూపులతో నిండిపోయిన సింగిడి పొడిచింది.

వీనుల విందుగా సభ ప్రారంభించడానికి నిలువెత్తు కోటు ఒకటి పచ్చ పెన్ను ధరించి పోడియం ముందుకు వచ్చింది. సిద్ధం చేసిన మైకును టకటక రెండు సార్లు తట్టి మైక్ పరిస్థితి తెలుసుకొని మాట్లాడడం ప్రారంభించింది.

ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్ట్ ఆఫీసర్లకు, వివిధ కళాశాలల గైడ్ టీచర్లకు, మరియు విద్యార్థులకు పేరుపేరునా గజ్వేల్ స్వాగత వచనాలు పలుకుతుంది.

మోటివేటరు. కల్టివేటరు. మాటల మాంత్రికుడు ప్రిన్సిపల్ పాపయ్య. సభాధ్యక్షుల ప్రసంగం పాసంగము(త్రాసు)లా మారి, నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు ప్రబోధిస్తున్నారు.

“విద్యార్థులారా! యువతి యువకులారా! మీరు మీ కుటుంబానికి పెట్టని కిరీటం. మీ కీర్తి పరిమళంలా వ్యాపించాలి. కీర్తికిరీటం ఎప్పుడూ కింద పడకూడదు. మీ నుంచి తొలగిపోకూడదు. సమస్యల సుడిలో అన్యాయమైపోవద్దు. అజరామరంగా వెలగాలి. సమస్యల్ని దాటుతూ వెళ్లాలి. జీవితం ఆదర్శమవ్వాలి. ప్రతిభతో, కృషితో పైపైకి ఎదగాలి. వర్తమానం మీది. భవిష్యత్తు మీది. రేపటి సమాజానికి ముందు నడిచేది మీరే. పప్పులో కాలేయడం కాదు, తప్పులో కాలేయడమే పొరపాటని ఈనాటి ఎయిడ్స్‌డే సందేశం” అంటూ రసవత్తరంగా ముగించాడు. సందేశం విన్న కృతజ్ఞత కరతాళ ధ్వనులయ్యాయి.

విశిష్ట అతిథి జిల్లా మెడికల్ ఆఫీసర్ మైకును సవరించాడు. “ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్” అని ప్రసంగం ఎత్తుకున్నాడు. “పదవ తరగతిలో మానవ శరీరం గురించి జీవశాస్త్రంలో చదివారు. టీనేజ్‌లో వచ్చే మార్పులు మీకు తెలుసు. వాటిని నియంత్రించుకోవాలి. బ్రేకులు లేని సైకిల్ మోరీలో పడ్డట్టు నియంత్రణలేని జీవితం భవిష్యత్తుకు నీళ్లొదిలినట్లు. జాగరూకత అవసరం. టీన్స్‌లో ఆపోజిట్ జెండర్ మీద ఆకర్షణ ఆరాధనగా మారుతుంది. ఊహలకు రెక్కలొస్తాయి. ఊసులకు దిక్కులొస్తాయి. కలలు వేటాడుతాయి” అనగానే నిశ్శబ్దం చీలిపోయింది. చప్పట్ల నడుమ కేరింతలు మొదలయ్యాయి.

“కంట్రోల్, కంట్రోల్” అని జడ్జిలా హెచ్చరించాడు. “ఇప్పటిదాకా సైలెన్స్‌గా ఉన్న మీరు వాయిలెన్స్‌గా మారుతున్నారు చూశారా? సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమంటే ఇదే. టీనేజ్‌కు బహురూపాలు. మనసు చదువు మీదికి మళ్లాలి. నిర్దేశించుకున్న లక్ష్యాలు కక్ష్యలు కావాలి. రేపటి తరానికి సాక్షులవ్వాలి. అందుకు స్వీయ నియంత్రణే మార్గం. దేనికోసం ఆలోచిస్తావో అదే మిమ్మల్ని వేధిస్తుంది.

టీనేజీది దొంగబుద్ధి. పైటలొదిలే సినిమాల చుట్టు తిరగొద్దు. బూతు సాహిత్యం, బూతు సినిమాల వెంటపడొద్దు. మైండ్‌లో ఇన్‌పుట్ ఏదిస్తే అదే అవుట్‌పుట్‌గా వస్తుంది. పెళ్లివరకు నిరీక్షించాలి. జీవిత భాగస్వామి ఒకరే ఉండాలి.” సభలోంచి వెటకారమైన శబ్దాలు చిన్నగా వస్తున్నాయి. “అవగాహన, ఆచరణ ఉండాలి. మితిమీరిన వేగం శృతితప్పిన రాగం ఎట్లా అనర్థాలు కలిగిస్తాయో జీవితం కూడా అనర్థమే అవుతుంది. ట్రాఫిక్ వార్నింగ్‌లు చెప్పినట్లు హెల్మెట్ లేని ప్రయాణం ఎంత ప్రమాదకరమో అసురక్షిత శృంగారము అంతే. మీరు సురక్షితంగా ఉండాలి. మంచి సమాజాన్ని సృష్టించాలి. అది యువత ద్వారానే సాధ్యం” అంటూ ప్రసంగం ముగిస్తున్నప్పుడు చప్పట్లు పేలవంగా మోగాయి.

మూతికి చేయి అడ్డంపెట్టి “అవునురా శ్రీమాన్, సార్ వద్దన్నదే మనకు కావాలనిపిస్తది ఎందుకురా...?” “ఆపురా నీ గొడవ. ముందు వినురా!” అని ప్రవీణ్ హెచ్చరిస్తున్నాడు.

పొగడ్తలు కాదు వాస్తవాలు. యువ తేజం, బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక కార్యకర్త. గజ్వేల్‌కు గజమాల లాంటి కుమారి కళ్యాణి ప్రసంగించవలసిందిగా పాపయ్య సార్ ఆహ్వానించాడు.

కళ్యాణి సీటు జరుపుకొని లేచి నిలబడింది. పోడియం వద్దకు వస్తుంటే చప్పట్లు లయబద్ధంగా కురుస్తున్నాయి.

మాస్క్ పెట్టుకుని ఉన్న కళ్యాణి పోడియం వద్దకు రాగానే మాస్క్ తీసేసింది. మైకు వద్దకు వెళ్లింది. మైకు పట్టుకుని నిలబడగానే కెమెరాలు ఆమెను, ఆమె స్టిల్స్‌ని ఫోటోలో భద్రపరుస్తున్నాయి.

“నేనెందుకు మాస్క్ తీశానో తెలుసా? నిశ్శబ్దంగా ఉండలేక. ‘నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం! నిజాన్ని చర్చిద్దాం’ అనేది ఎయిడ్స్ స్లోగన్. నిశ్శబ్దాన్ని ఛేదించాలి. అందుకే మాస్క్ తీసేశాను. మనందరం మనసుకున్న మాస్కులు తొలగించుకోవాలి.

మీరంతా బాగున్నారా?” అని మాటల జల్లుతో మొదలైంది. “బాగున్నాము” అని కొంతవరకే రెస్పాండ్ వచ్చింది. “రిప్లై ఇవ్వని వాళ్లు బాగాలేరా? ఏమైంది? మిమ్మల్నే బాగున్నారా లేదా?” అని ప్రశ్నలతో చర్చ ప్రారంభించింది. “బా...గున్నా...ము. బా...గున్నా...ము” అని అందరూ స్పందించారు. “వాట్ అబౌట్ యు మేడం?” అని ఒక సన్నటి గొంతు ముందు వరస నుంచి ప్రశ్నలా లోగొంతుతో వినబడింది. “ఐయామ్ ఫైన్. బాగున్నాను. అంటూ నీవు, నేను, మనం. మనందరం బాగుండాలి. మనం బాగుంటే సమాజం బాగుంటుంది. బాగా ఉండాలి కూడా. సరే! సరే!!

వేదికను అలంకరించిన పెద్దలకు, ఎన్.ఎస్.ఎస్. పీఓలకు, లెక్చరర్లకు మరియు స్టూడెంట్స్‌కి నా నమస్సులు. ఎయిడ్స్ డే దినాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ సభాధ్యక్షత వహిస్తున్న గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాపయ్యగారు, జిల్లా మెడికల్ ఆఫీసర్ శాంతకుమార్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సులు.

ఈ రోజు డిసెంబర్ ఒకటి. ఎయిడ్స్ డే. ప్రత్యేకత ఏమిటి? తెలుసుకొని మంచి ఆచరించటమే సందేశం. 1982లో ఎయిడ్స్ మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించింది. నిప్పును తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాల్చేస్తుంది. అనుకోకుండా కాలుజారిన వాళ్లు అందని తీరాలకు వెళ్లారు. ఈ వ్యాధి పచ్చని కుటుంబాలను, సమాజాన్ని సర్వనాశనం చేసింది. అనేక మందిని అనాథలుగా మిగిల్చింది.

మీకు కథలంటే ఇష్టమేనా?” రావలసినంత స్పందన రాలేదు. “మీకు కథలంటే ఇష్టమేనా?” అని మళ్లీ ప్రశ్నించింది. “ఇష్టమే..” అని కొన్ని గొంతులు సమాధానమిచ్చాయి. “చిన్నప్పుడు నానమ్మలు, తాతయ్యలు చెప్పినవే కథలు”. “మీరు ఎప్పుడూ కథలు చెప్పలేదా?” అని మళ్లీ ప్రశ్న. “చెప్పలేదు... చెప్పలేదు” అని విద్యార్థుల కేకలు. “చెప్పలేదని మీరంటే నేను అబద్ధం అంటాను. మీరేమంటారు?” “కాదు, కాదు” అన్నారు కొంతమంది. అన్ని ముఖాలు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి.

ఆమె గొంతు సవరించుకొని “కథ ద్వారా చర్చిద్దాం. ప్రతి అబద్ధమే కథే. చాక్లెట్ కోసమో, బిస్కెట్ కోసమో, స్కూలుకి ఎగబెట్టడం కోసం కడుపునొప్పి వచ్చిందని చెప్పి ఇంటికాడ ఉన్నది గుర్తులేదా? అది అబద్ధం కాదా? అవసరాల కోసం దాచిపెట్టిన మాట ప్రతిదీ అబద్ధమే. అబద్ధమే కథ.

కథలు వింటూ పుట్టినవాళ్ళం. ఉగ్గు అన్నం తింటూ కథలు విన్నవాళ్ళం. పెరిగినవాళ్ళం. మనందరికీ జన్మతా కథలు వచ్చు.” “అవును” అన్నాయి కంఠాలు.

“అయితే మనం ఒక కథ చెప్పుకుందాం. కథ కానిది నిజం. నిజమే నిప్పు. మనసు పెడితే మనం నిప్పు స్నానం చేసినవాళ్లమవుతాము. కథ కావలసినవాళ్లు చేతులెత్తండి” అని ప్రశ్నించింది. “చెప్పండి, చెప్పండి” అన్నట్లు విద్యార్థులు మౌనంగా చేతులెత్తారు.

‘లక్ష్యాన్ని గురిచూసి అస్త్రాన్ని సంధించినవారే విజయం సాధించగలరు’, ‘అసాధ్యం అన్నది మూర్ఖుల నిఘంటువుల్లో కనబడే పదం మాత్రమే’ — ఈ మాటల తాలూకు గట్టి సంకల్పాలు. ఖచ్చితాలు. నిశ్చితాలు. ఇక కథలోకి వెళదాం.

ఈ గజ్వేల్ పట్టణానికి ఆనుకొని రెండు కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు. ఆ ఊరిపేరు అప్రస్తుతం. నిరక్షరాస్యుడైన రాములు సమాజాన్ని చదివిన దళితుడు. నీతికి కట్టుబడి బీదరికంతో కొట్టుమిట్టాడాడు. బుడ్డెడు వడ్లకు జీతంతో జీవితం ప్రారంభమైంది. ఆకలిని జయించుటకు సిగ్గును, అభిమానాన్ని వదిలేశాడు. గంజి, మాడుచెక్కలతో దోసిలితో నీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు. జీతగాడిగా జీవితం మొదలైంది. వయోజన విద్యలో చదవడం, రాయడం నేర్చుకున్నాడు. సమాజాన్ని అవగాహన చేసుకున్నాడు. ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలిసింది. తలవంచని వెదురులా చిగురించాడు. చీకట్లో చిరుదీపంలా మేల్కొల్పు కాంతులు వెదజల్లాడు. ఆ ఊరిలో ఠీవిగా ఆత్మగౌరవ పతాకం అయ్యాడు. మందుకు పథ్యం, మాటకు సత్యంలా అతని పేరు ఖచ్చితత్వం అయ్యింది. చెప్పింది చేయడం, చేసేది చెప్పడం అతని అలవాటుగా మారిపోయింది. వాడకట్టుకు రాములంటే ఒక నిలువెత్తు నమ్మకమయ్యాడు.

కుటుంబాన్ని గాడిలో పెట్టాడు. తమ్ముళ్లందరూ ఆయన మాట విన్నారు. అవగాహనతో తీర్పులు చెప్పడం వల్ల పంచాయతీ పెద్దగా అవతారం ఎత్తాడు. చెప్పదలచినది సూటిగా చెప్పడం, విభేదించేవారిని విభేదించినట్లే విభేదించి వాస్తవంలోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. తప్పును తప్పుగా పంచాయతీలో గుట్టువిప్పేవాడు. శత్రువు మెచ్చే తీర్పు ఇచ్చేవాడు. ఊళ్లో అనవసర దండగలు లేకుండా చేశాడు. అందరి నోట్లో పండులాగా అభిమానాన్ని, పగను పొందుకున్నాడు. కొన్నిసార్లు కరుకుగా వ్యవహరించేవాడు. కొన్నిసార్లు కోపంతో ఊగిపోయినా మనసు మంచుకొండ అనేవారు. వెనకాల తిట్టుకున్నా “తీర్పు రాములే చెప్పాలి” అన్నట్లు పేరుపోయింది.

స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఎవరైనా ఆపత్కాల పెన్నిధిని ఎన్నుకుంటారు గదా! ఆ పెన్నిధి రాములే అని భావించారు కొంతమంది.

“అన్నా మీరే నిలబడాలి. మీరు నిలబడకుంటే అవినీతిపరులు, మోసకారులు సర్పంచ్ అవుతారు. అందరిని ఒప్పించి మెప్పించే మీరు లేకుంటే అంతా వ్యర్థం” అన్నారు. ఊగిసలాట మధ్యనే ఊరోళ్ళ బలిమితో పోటీచేశాడు. నీళ్లలా పారించిన ఖర్చును సునాయాసంగా అభిమానంతో గెలిచాడు. రాములుకు మంచి సంబంధం వచ్చింది. అంగరంగ వైభవంగా గంగతో పెళ్లి జరిగింది.

వినూత్నమైన పాలన. విశిష్ట గ్రామంగా తీర్చిదిద్దాడు. చెప్పిందే తీర్పు, చేసిందే న్యాయం అన్నట్లు జాండకాడనే తీర్పు(పంచాయితీ)లు చేశాడు. స్థానిక ఎమ్మెల్యే వద్ద రాములుకు పరపతి పెరిగింది. ఎమ్మెల్యే ప్రోద్బలంతో కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. గ్రామాన్ని అభివృద్ధి పథాన నడిపించాడు. స్వామి కార్యము స్వకార్యం అన్న చందంగా ఊరితోపాటు అతను అభివృద్ధిలోకి వచ్చాడు.

ఐదేళ్లు గడిచాయి. మరలా జడ్‌పీ రిజర్వేషన్ ఖరారైంది. దుర్భిణితో వెదికినా ఎవరూ దొరకలేదు. రాములే దొరికాడు. అప్పటికే అతని వ్యక్తిత్వం, పాలన, మంచితనం వ్యాపించింది. పోటీకి టిక్కెట్ కన్ఫర్మ్ అయింది. అతని ఎదుగుదలను ఓర్వలేని ప్రత్యర్థులు కుట్రలు, కుతంత్రాలు పన్నారు. అనేకసార్లు రాముల్ని దొంగదెబ్బ తీయడానికి గజకర్ణ గోకర్ణ విద్యలెన్నో ప్రయోగించారు. దావత్ పేరు మీద అర్ధరాత్రి వరకు ఫారిన్ విస్కీలో వయాగ్రా మాత్రలు కలిపి తాగించారు. మదనదాహంలో పిచ్చివాడైపోయి ఎయిడ్స్ వేశ్య వలపువలలో బంధించాలని పథకాలు అల్లారు. బురదలోని కమలం బురద అంటకుండా బయటపడ్డట్టు రాములు తప్పించుకున్నాడు. రాములు ఎక్కడా చిక్కలేదు.

పరిస్థితులను అనుకూలపరచుకున్నారు. రాములు ప్రాణస్నేహితుని లోబరుచుకున్నారు. రాములు మిత్రుని మాట కాదనలేకపోయాడు. సీసాలోకి దించారు. మత్తులో ముంచారు. ప్లాన్ నెరవేరింది. బండిమీద వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. కాలు విరిగింది. రక్తం ఎక్కించాల్సిన పరిస్థితిని కల్పించి హెచ్‌ఐవీ రక్తం ఎక్కిస్తే కానీ వారి ప్రతీకారం తీరలేదు. చేయని తప్పుకు చెదిరిపోని పెద్ద శిక్ష విధించారు. ఆ శిక్ష అతనికే గాక అతని కుటుంబానికి ముప్పుగా మారింది.

ఆ సమయంలో రాములు భార్య గంగ రెండవసారి గర్భం ధరించింది. ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఏకగ్రీవంగా జడ్‌పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన రోజే రాములుకు మహాలక్ష్మి లాంటి కూతురు జన్మించింది.

ఆడబిడ్డ అనగానే రాములుకు నిరుత్సాహం ఆవరించింది. తేరుకున్నాడు. ‘మహాలక్ష్మి’ అని నామకరణం చేసి బారసాల ఘనంగా నిర్వహించి సంతోషపడ్డాడు.

మహాలక్ష్మికి రెండున్నర సంవత్సరాల వయసప్పుడు అతనికి ఆ హెచ్‌ఐవీ బయటపడ్డది. అదే ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే భయం. ఎయిడ్స్ అంటే దగ్గరకు వచ్చేవారు కాదు. అది అంటు వ్యాధి అని, బతకరని మూఢనమ్మకం సమాజంలో నాటుకుపోయింది. కుటుంబంలో అందరు చస్తారనీ భయం పట్టుకుంది.

‘ఏం పాపం చేశాను. ఎంత పాపమాయే. బతుకు బలి అయిపాయె. నేను, నా భార్య ఏమైనా ఫర్వాలేదుగాని ఒక్కగానొక్క బిడ్డకు కూడా ఆ వ్యాధి సోకేనా? అయ్యో!’ తలుచుకుంటే గండగొడ్డలితో నరికిన బాధను అనుభవించాడు. మనసు లావాలా విస్ఫోటనమైంది. మరణశిక్షను తలుచుకుంటున్న ఖైదీలా కలత చెందాడు. కుమిలిపోయాడు. కుళ్లిపోయాడు. మనసంతా, మనిషంతా విరక్తి.

ఒడిలో బిడ్డను ఎత్తుకుని రోదిస్తున్నాడు. క్షమించు తల్లీ అని మాటిమాటికి పసిపాప కాళ్లు మొక్కుతున్నాడు. పతికి సతి, సతికి పతిగా ఓదార్చుకుంటూ భార్యాభర్తలు దుఃఖ సాగరంలో కొట్టుకుపోతున్నారు. ఏడ్చి ఏడ్చి కళ్లు పొగచూరాయి. ఏం చేసినా బతుకనని తెలుసుకున్నాడు. వైరాగ్యం ఆవరించింది. సంపాదించిన పది ఎకరాలలో ఐదెకరాల జాగా అమ్ముకొని చికిత్స చేసుకున్నాడు. అయినా ఫలితం కనపించలేదు.

భార్యాబిడ్డను చూసినవాళ్లకే జాగా అని వీలునామా రాద్దామనుకున్నాడు. “మేం చూస్తామని” చెప్పిన మాటలకు తలొగ్గి తమ్ములకు రిజిస్ట్రేషన్ చేశాడు. బంగారము చెల్లెళ్లకు పంచగా మిగిలిన ఐదుతులాల బంగారం భార్యమీద వేశాడు. సుందరంగా కట్టుకున్న ఇల్లు మాత్రమే మిగిలింది. కాలం చేశాడు.

భర్త పోయిన బాధ కంటే సూటిపోటి మాటలే సూదుల్లా గుచ్చాయి. రాములు భార్య గంగను దురదృష్టవంతురాలని, జ్యేష్ఠురాలినని హింసించసాగారు. ఆదరణ లేదు. ఓదార్పు లేదు. లోలోన కుమిలిపోయింది. కృంగిపోయింది. పాప బతకాలని మనసు కుతకుత ఉడికిపోయేది. “నేను చస్తే చస్తి. నా బిడ్డ బతికితే బాగుండు” అని దేవుళ్లకు రోజూ మొక్కుతుండేది గంగ. మరో రెండున్నర సంవత్సరాలకు ఎముకల గూడుగా మారి గంగ మరణించింది.

వచ్చే రెండుమూడు సంవత్సరాల్లో ఈ పోరి (మహాలక్ష్మి) చనిపోతుందని రక్త సంబంధీకులు భావించారు. మిగిలిన ఇల్లును రాములు తమ్ములు ఆక్రమించారు.

హారర్ ఫిల్మ్ చూస్తున్నట్లు సభికుల చూపుల గురి ప్రసంగిస్తున్న కళ్యాణి పైనే నిలిచాయి.

మహాలక్ష్మి హెచ్‌ఐవీ పేషెంట్. అంటే ఎయిడ్స్ రోగి అన్నమాట. నయం కాదని తెలిశాక రోగిని ఎవరు ఆదరిస్తారు? ఆదరించలేదు. పెంచాలనుకోలేదు. అన్నకిచ్చిన మాట మరిచిన తమ్ములు “బతికినన్ని రోజులు బతుకుతుంది, చచ్చేనాడు చస్తుంది” అనుకున్నారు. ఆమెపట్ల కనికరం ఎవరికీ లేదు. భరోసా కేంద్రం గజ్వేల్‌లో జాయిన్ చేశారు.

భరోసా కేంద్రం నిర్వాహకుడు కన్నయ్యను ‘డాడీ’ అని పిలుస్తారు. నిజంగా తండ్రిలానే వ్యవహరిస్తాడనే పేరుంది.

భరోసా కేంద్రం ఇచ్చిన చికిత్సతో మహాలక్ష్మి ఆరోగ్యంలో మార్పు వచ్చింది. ఆరేళ్ల వయసులో అందులోనే చదవడం మొదలైంది. చదువులో ఉషారని కితాబిచ్చారు పంతుళ్లు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సవ్యసాచిలా ఎదిగింది. పాడడంలో కోకిలలా, నృత్యంలో నెమలిలా, మాటలలో కుంతల జలపాతంలా వీక్షకులలో ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఎట్లాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించే ఆలోచనను పునికిపుచ్చుకుంది. శత్రువుల మనసులను గెలుచుకునే ప్రవర్తనతో ప్రకాశిస్తుంది.

ఆ భరోసా కేంద్రంలో కొంతమందిని చూడడానికో, పరామర్శించడానికో, పండుగకో, పబ్బానికో బంధువులు వస్తారు. మహాలక్ష్మిని చూడడానికి, తీసుకుపోవడానికి ఎవరూ వచ్చేవారు కాదు. వాళ్లలా మా చిన్నాన్నలు వస్తే బాగుండునని మహాలక్ష్మి ఎదురుచూసేది. పసిమనసు పగిలిన పచ్చికుండయింది. “నేనెందుకు పుట్టాను” అని బాధపడేది. “ఎందుకోసం బతకాలి? ఎవరికోసం బతకాలి” అని ప్రశ్నించుకునేది.

చీకట్లో పయనించినట్లు, దరి దొరకని నూతిలో పడ్డట్టు, ఎవరో తరుముకొచ్చినట్లు కలలు కంటూ ఈడ్చి కేకవేసేది. కలవరించేది. నిద్రలోనే కరకరమని పళ్లు కొరుకునేది. పరిగెడుతూ పొర్లి బెడ్ మీదినుంచి కిందపడేది. ఒక్కొక్కసారి దిగ్గున మేల్కొనేది. మహాలక్ష్మిని అనేకసార్లు కేర్‌టేకర్ కూడా గమనించింది.

సైకియాట్రిస్ట్ ద్వారా చికిత్స చేశారు. భరోసా కన్నయ్య డాడీ ఇచ్చిన ధైర్యం ఔషధంలా పనిచేసింది.

ఆరో తరగతిలో ఉన్నప్పుడు అనారోగ్యం కలిగింది. రెండు నెలలు జ్వరం తగ్గలేదు. నిద్రలో “చిన్నాన్న, చిన్నమ్మ” అని కలవరిస్తే ఫోన్ చేసి చెప్పారు భరోసావారు. తన తండ్రి సంపాదించిన ఆస్తిని, ఇల్లును అనుభవిస్తున్నవాళ్ళు కనీసం కన్నెత్తి చూడ్డానికి రాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక్కతే బెడ్‌పై పడుకునేది. జ్వరం భరించక మూల్గేది. సిస్టర్‌లు తల్లిలా ఓదార్చారు.

ఒకరోజు నిద్రలో ఆలాపన ఎక్కువయింది. కలవరింతగా మారింది. “నే...ను.. బ...తు...క... డాడీ” అని కలవరిస్తూ గాల్లో చేతులు తిప్పుతూ ఏడుస్తున్నప్పుడు కన్నయ్య ఓదార్చాడు.

కళ్యాణి కథ రసవత్తరంగా సాగుతున్నప్పుడు సభ కళ్లు రెప్ప మూయని సైనికుల్ని తలపిస్తున్నాయి.

“ఏమయ్యిందిరా నాన్నా. తగ్గిపోతదిరా తల్లీ. బాధపడకురా బంగారు తల్లీ” అని ఓదార్చి భరోసా నింపాడు. బాధల్ని తెంపాడు.

“డాడీ, ఇగ నేను బతకను. బతకాలని లేదు. ఎందుకోసం బతకాలి నాన్నా” అని గుండెలోని బాధ లావాలా పొంగుతున్నట్లు కళ్లలోంచి కన్నీరు దూకుతున్నప్పుడు కన్నయ్యతో ఏడ్చింది. కళ్లు ఆరుద్ర పురుగులా ఎరబారాయి.

ఆ అనాథ మాటలు విన్న హాస్పిటల్లోని పక్క మంచం అటెండెంట్లు కొంగులు కళ్లకు అడ్డంపెట్టుకొని ఏడ్చారు. తోటి విద్యార్థుల కళ్ళు తడిసిపోయాయి. గుండె ఆర్ద్రంగా బరువెక్కింది.

“బేటా! నిన్ను బతికించుటకే నేను బతుకుతున్నానురా బంగారు తల్లీ! నిన్ను బతికించడమే నా పని. నీలాంటి వాళ్లను బతికించడమే నా జీవిత లక్ష్యం బిడ్డా! నీ ప్రాణానికి నా ప్రాణం పెడతా. నువ్వు భయపడకు. నిన్నూ, మిమ్ముల్నీ కాపాడుకుంటా. నేను చనిపోతే తప్ప మీరు చావరు. మీరు నా ప్రాణం. నా ఆయువు పోసైనా నిన్ను బతికిస్తా బిడ్డా! నా మాట వినక ఇట్లే ఏడిస్తే నేనే చచ్చిపోతా” అని ఓదార్చుతూ ఏడుస్తున్నాడు.

“నువ్వట్లా అనొద్దు డాడీ. నీవు బాగుంటేనే మేమంతా బాగుంటాం” అని మహాలక్ష్మి ఏడ్చింది. “నేను ఓదార్చుతుంటే నీవు ఏడువవచ్చునా? చెప్పు” అని బాధతో అన్నాడు. “సరే, ఏడవను డాడీ” అని చెప్పింది మహాలక్ష్మి. కొద్దిసేపు అయ్యాక స్థిమితపడ్డారు.

కథకు కనెక్టయిన కొన్ని మెత్తటి గుండెలు కరిగి కన్నీరవుతున్నాయి. హాలంతా దుఃఖపు తెర కప్పుకున్నట్లుంది. శిలలాంటి ఎదల్లో చెమ్మ పుట్టింది. మరికొన్ని కళ్లు తడినిండాయి.

కళ్యాణి కథ చెబుతూనే ఉంది.

“బిడ్డా! ఎయిడ్స్ లేని సమాజాన్ని తయారు చేద్దాం బిడ్డా! ఎయిడ్స్‌ని ద్వేషిద్దాం. ఎయిడ్స్ రోగులను ఆదరిద్దాం. మన ప్రతీకారం ఎయిడ్స్ మీద కానీ ఈసడించుకునే మనుషుల మీద కాదు. నీవు నాకు నమ్మకం. నీకేమీ కాదు. పోయే ప్రాణాలకు జీవం పోస్తావు. నా మాట నమ్ము” అని మళ్ళీ భరోసా కన్నయ్య భరోసా నింపాడు.

ఆరోగ్యం మెరుగుపడ్డది. యథావిధిగా మహాలక్ష్మి ఆడుతుంది, పాడుతుంది, చదువుతుంది. జిల్లాస్థాయి ఆటల పోటీల్లోనూ, పాటల పోటీల్లోనూ విజేతగా నిలిచింది. రాష్ట్రస్థాయిలో పతకం గెలిచినపుడు కొన్ని ఛానల్ మైక్‌లు మాట్లాడమన్నాయి.

“నాలో భరోసా నింపాడు. బాధ్యతను పెంచాడు. కోరికను రగిలించాడు కన్నయ్య డాడీ. ఈ గెలుపు ఆయన చేస్తున్న సేవలకు అంకితం. నా ఆదర్శం, నా ఆచరణ కన్నయ్య డాడీ. వారిలా ఎయిడ్స్ రోగులకు సేవ చేస్తా” అని భరోసా కన్నయ్య గురించి మహాలక్ష్మి ప్రకటించింది.

భరోసా కన్నయ్య డాడీ ప్రోత్సాహంతో ఇంజనీరింగ్ చదివింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆమెకు వచ్చిన జీతంలో డెబ్బైఐదు శాతం భరోసా కేంద్రానికి విరాళంగా ఇస్తుంది.

మహాలక్ష్మి జీవితాన్ని ఎలా గెలిచిందో, సమస్యని ఎలా అధిగమించిందో పేపర్లు పతాక శీర్షికన ఆర్టికల్స్ రాశాయి. ఇంటికి ఆహ్వానించని చిన్నాన్నలు, చిన్నమ్మలు చదివారు. ఆహ్వానించారు. జీవితం చిన్నది. అందరినీ సంతోషపెట్టాలనుకుంది. పంతాలు, పట్టింపులు ఉండకూడదని నమ్మింది. వారి పిలుపు కాదనలేక వెళ్లింది. భరోసా కేంద్రాన్ని వదిలిపోలేదు. నెలకు ఐదంకెల జీతం వస్తున్నప్పుడు చిన్నాన్నలు, చిన్నమ్మలు బాగోగులు తెలుసుకుంటున్నారు. ఇంటికి రమ్మంటున్నారు. కపట ప్రేమను పక్కనపెట్టి మహాలక్ష్మి కరిగిపోయే కొవ్వొత్తిలా కరుణించేది. తరుగని ఆత్మీయతనే పంచేది. ఆమె మాటలకు, ఆమె పంచే ప్రేమకు రక్త సంబంధీకులు సిగ్గుతో చచ్చిపోయేవాళ్లు. వారి అవసరాలకు, చదువులకు డబ్బు సహాయం అందించేది.

మహాలక్ష్మి రాష్ట్రస్థాయి ఎయిడ్స్ కౌన్సిలర్‌గా సేవలందిస్తుంది. అంతర్జాతీయ సదస్సులలో పేపర్ ప్రజెంట్ చేస్తుంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంది. ఎయిడ్స్ బాధితులతో ఆత్మీయంగా చిరునవ్వులతో పలుకరిస్తుంది. తెలియకుండానే వారిలో కాన్ఫిడెన్స్‌ని బిల్డప్ చేస్తుంది. తన తండ్రి వల్ల తాను శిక్షను అనుభవిస్తున్నానని వెల్లడించేది. “మీ ప్రభావం మీ పిల్లల జీవితంపై పడుతుంది. మీరు తప్పు చేయొద్దు” అని ప్రాధేయపడుతుండేది.

భరోసా కన్నయ్య, “బిడ్డా! పాతిక వయసులోకి అడుగుపెట్టావు. పెళ్లి చేసుకోవాలి బంగారం. నీ పెళ్లి చేస్తే నేను సాకిన రుణం తీరుతుంది బేటా!! నీవు పెళ్లి చేసుకోవాలి నాన్నా!!!” అని అడుగుతూనే ఉన్నాడు. “నాన్నా! నాకు ఇప్పుడే పెళ్లి ఎందుకు? నీ ఆశలు కొన్నైనా నెరవేర్చనివ్వు” అని మహాలక్ష్మి కోరింది. “పెళ్లయ్యాక కూడా చేద్దువురా! నా తృప్తికోసం ఒప్పుకోరా కన్నా” అని బతిమాలుతూనే ఉన్నాడు. “సరే నాన్నా, మీ ఇష్టం. పాపం పుణ్యం తెలియని నాకు పసివయసు నుంచే అవమానం వెంటాడింది. వేధించింది. నన్ను అర్థం చేసుకొని, నీవు చూపిన మార్గంలో నీలాగా ఎయిడ్స్ బాధితులకు సహకరించే వ్యక్తి ఎవరైనా ఎదురైతే తప్పక పెళ్లి చేసుకుంటాను” అని భరోసా కన్నయ్యకు భరోసా నిచ్చింది.

భరోసా కన్నయ్య మహాలక్ష్మి పెళ్లికోసం సంబంధాలు ఆరా తీస్తున్నాడు. ఇది కథ.

విద్యార్థులు శ్రద్ధగా విన్నారుకదా! కథ ముగిసింది. ఇప్పుడు కథ గురించి మాట్లాడదామా?” అని ప్రశ్నించింది. గొంతు పెకలడం లేదు. మళ్లీ ప్రశ్నించింది. “మాట్లాడదాం మేడం” అని పలికారు. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం తెలియజేశారు. “కథ మీకు ఎలా అర్థమైంది? ఏం తెలుసుకున్నారు?” అని ప్రశ్నించింది.

కొంతమంది చెప్పాలని మైకందుకున్నారు, నోట మాట రాలేదు. కొంతమంది ఆడపిల్లలు మైకందుకొని బొటబొట కన్నీళ్లు కార్చారు.

జీవితమే అడవిలా మారిన అనాథ అరణ్యకు తన జీవితమే గుర్తొచ్చింది. తల్లిదండ్రుల మరణం కళ్లముందు కదలాడినట్లయింది. హృదయానికి హత్తుకుపోయింది. వింటున్నంతసేపు ఆగని పాయిపు లాగా కళ్ళు ఊటలా ఉబుకుతూనే ఉన్నాయి.

“మేడం! కథ వింటుంటే ఏడుపొచ్చింది మేడం” అని నీళ్లు నిండిన కళ్ళతో బొంగురుపోయిన గొంతుతో హుస్నాబాద్ అమ్మాయి శారద జవాబిచ్చింది.

స్టేజి దిగి కిందికి వస్తున్నప్పుడు సభ ఊపిరి బిగపట్టి చూసింది. కళ్యాణి అరణ్య వీపు నిమురుతూ ఓదార్చింది.

“మనం తప్పు చేయలేదు. మనం బాధపడొద్దు. బాధపడేవారికి ఓదార్పు నివ్వాలి. తాత్కాలిక సుఖాలను కట్టడి చేసుకుందాం. మన జీవితం పదిమందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవడమే ఈ కథలోని నీతి” అని ప్రకటించింది.

ఏకీభవిస్తున్నట్లుగా చప్పట్ల జడివాన కురిసింది.

“మరొక విషయం. కథ పూర్తైంది. నిజం ఇంకా పూర్తికాలేదు. మహాలక్ష్మి ఇంకా బతికే ఉంది. అన్నట్టు మహాలక్ష్మి అనే దురదృష్టవంతురాలు ఎవరో తెలుసా? చెప్పమంటారా? పరిచయం చేయనా?”

ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. “మహాలక్ష్మి, మహాలక్ష్మి” అని కేకలు వేస్తున్నారు. ఆగండి అని చేయెత్తింది.

“చెప్పండి మేడం, చెప్పండి మేడం” అని కేకలు ఉత్సాహాన్ని ప్రతిధ్వనించాయి. “ఆమె.. ఆమె.. మన మధ్యనే ఉంది.” మళ్లీ కేకల జోరు.... “చెబుతున్నా..., చెబుతున్నా.... ఆ దురదృష్టవంతురాలే... ఆ దురదృష్టవంతురాలే.... మీతో మాట్లాడుతున్న ఈ కళ్యాణి.”

మహతీ ఆడిటోరియం అంతా దుఃఖపు తెర కప్పింది. గౌరవంగా హాలంతా లేచి నిలబడింది. కొందరు హత్తుకున్నారు. కరచాలనం చేశారు. కొందరికి కన్నీళ్ల చిరునవ్వులు కలగలిపి, భరోసా సిరాతో కళ్యాణి ఆశయాల ఆటోగ్రాఫ్ తరగని స్ఫూర్తిలా ఇస్తూనే ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి