ఐదు ప్రశ్నలు అడుగుతారు.
విద్యార్థులు పరిచిత గద్యాన్ని ఒకటికి రెండు సార్లు చదవాలి.
పరిశీలించాలి.
కొన్నిసార్లు సంశ్లిష్ట వాక్యాలు పేరలోఉంటాయి. అలా ఆ పేరా పై ప్రశ్న వచ్చినప్పుడు ప్రశ్న ఏ విధంగా అడుగుతారో పరిశీలించాలి.
ఆ సమాధానం మాత్రమే రాయాలి. కానీ ఆ మొత్తం సంశ్లిష్ట వాక్యం రాయకూడదు.
ఉదాహరణ: రాము ఉదయం పాఠశాలకు వెళ్లి, తెలుగు పాఠం విని, పద్యాన్ని నోటికి నేర్చుకున్నాడు.
ఇందులో ప్రశ్న
రాము ఏమి నేర్చుకున్నాడు?
జ. పద్యం నేర్చుకున్నాడు.
(లేదా)
తెలుగు పద్యం నేర్చుకున్నాడు.
ఎందుకంటే సామాన్య వాక్యాలుగా విభజించి జవాబు రాయాలి.
1. రాము ఉదయం పాఠశాలకు వెళ్లాడు.
2. రాము తెలుగు పాఠం విన్నాడు.
3. రాము పద్యం నేర్చుకున్నాడు.
ఇందులో మూడవ వాక్యమే సమాధానం.
ఐదు ప్రశ్నలు అడుగుతారు.
****************************************
దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసముంది. దాన్ని దశరథునికి అందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంచుతుంది. అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లైంది దశరథునికి, అతని మనసు ఆనంద తాండవం చేసింది.
ప్రశ్నలు
1. పుత్రకామేష్టి చేసినది ఎవరు?
జవాబు: దశరథుడు
2. యజ్ఞకుండం నుంచి ఎవరు ఆవిర్భవించారు?
జవాబు: దివ్య పురుషుడు
3. ఆ దివ్య పురుషుడిని ఎవరు పంపించారు?
జవాబు: బ్రహ్మ
4. దివ్య పురుషుడి చేతిలో ఏముంది?
జవాబు: బంగారు పాత్ర, వెండి మూతతో దివ్య పాయసం
5. ఆ పాయసం ప్రసాదించేది ఏమిటి?
జవాబు: సంతానం
6. పుత్ర కామేష్టి యాగం ఎందుకు చేస్తారు
జవాబు సంతానం కొరకు
7. మానవునికి కావలసినది ఏమిటి?
జ. సంపద, ఆరోగ్యం, సంతానం
8. తాండవం అనే పదానికి అర్థం
జ. నాట్యం
----------------------------------------------------
పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. అంతలో శూర్పణఖ అనే రాక్షసి వచ్చింది. ఈమె రావణాసురుని చెల్లెలు. శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలయింది. తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్న దాసుడనని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని అందుకే శ్రీరాముని చేరడమే సబబని సమాధానమిచ్చాడు. శ్రీరాముని వైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లనే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికిపోయింది. సీతాదేవిని అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
1. పంచవటిలో శ్రీరాముడు జీవనం ఎలా గడిపాడు?
జవాబు: పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడిచింది.
2. శ్రీరాముడు ఏ సందర్భంలో పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు?
జవాబు: ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో నిమగ్నమయ్యాడు.
3. శూర్పణఖ ఎవరు?
జవాబు: శూర్పణఖ రాక్షసి, రావణాసురుని చెల్లెలు.
4. శూర్పణఖ శ్రీరాముని ఏ కారణంతో ఆకట్టుకున్నది?
జవాబు: శ్రీరాముని సౌందర్యానికి శూర్పణఖ ముగ్ధురాలయింది.
5. శూర్పణఖ తన కోరిక నెరవేర్చడానికి ఏ కుట్రను యోచించింది?
జవాబు: తనను చేపట్టమని, సీతలక్ష్మణులను చంపి తింటానని యోచించింది.
6. శ్రీరాముడు శూర్పణఖను పరిహాసంగా ఎవరికి పంపాడు?
జవాబు: శ్రీరాముడు శూర్పణఖను లక్ష్మణుని వద్దకు వెళ్ళమని అనించాడు.
7. లక్ష్మణుడు శూర్పణఖకు ఏ సమాధానం ఇచ్చాడు?
జవాబు: తాను అన్న దాసుడని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని చెప్పాడు.
8. శూర్పణఖ సీతను చూసి ఎలాంటి నిర్ణయానికి వచ్చింది?
జవాబు: సీత ఉండడం వల్ల నిరాకరిస్తున్నాడని అట్టుడికొచ్చి సీతను అడ్డు తొలగించుకోవాలని దాడికి దిగింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు. నూరు యోజనాలు ప్రయాణించినా అణుమాత్రమైనా అలసిపోలేదు. శత్రుదుర్భేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు. ఇంతలో లంకాధిదేవత (లంఖిణి) అతణ్ణి చూసింది. 'నీవెవరు? ఎందుకొచ్చావని' నిలదీసింది. హనుమంతుడు "లంకా నగరం అందంగా ఉంటుందని విన్నాను. ఒక్కసారి చూసిపోవాలని వచ్చాను. చూశాక వచ్చిన దారినే వెళ్తాను" అని చెప్పాడు.
ప్రశ్నలు:
1. నూరు యోజనాలు ప్రయాణించిన అలసిపోని వారు ఎవరు
జ. హనుమంతుడు
2. లంకలోనికి ప్రవేశించడానికి హనుమంతుడు సరైన సమయమని ఎంచుకున్నది ఏది?
జ. రాత్రి సమయం.
3. లంకా పట్టణం ఎలాంటి పర్వతంపై నిర్మించబడింది?
జ. త్రికూట పర్వతం
4. లంక ద్వారం వద్ద హనుమంతుణ్ణి ఆపినది ఎవరు?
జ. లంకాధి దేవత (లంఖిణి)
5. హనుమంతుణ్ణి ఎదుర్కొని లంఖిణి వేసిన ప్రశ్న ఏమిటి?
జ. నీవెవరు? ఎందుకొచ్చావని ప్రశ్నించింది.
---------------------------------------------------------------------------------------------------------------------------
అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల, యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేక పోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు.
1. కష్టాలను బ్రహ్మకు తెలియజేసినవారు ఎవరు?
జ. దేవతలంతా తమ కష్టాలను బ్రహ్మకు చెప్పుకున్నారు.
2. బ్రహ్మ ఇచ్చిన వరశక్తి వల్ల అహంకారంగా ప్రవర్తించినవాడు ఎవరు?
జ. బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతున్నది రావణాసురుడు.
3. రావణుడి భయంతో సహజ స్వరూపాన్ని వ్యక్తపరచలేకపోయినది ఎవరు?
జ. రావణుడి భయం వల్ల సూర్యుడు, సముద్రుడు, వాయువు తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారు.
4. ఇంద్రుణ్ణి సింహాసనం నుండి దింపాలని సంకల్పించినది ఎవరు?
జ. ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి రావణుడు పూనుకొన్నాడు.
5. గోడు వెళ్ళబోసుకోవడం అనే పదానికి అర్థం ఏమిటి?
జ. బాధలు, కష్టాలు చెప్పుకోవడాన్ని గోడు వెళ్ళబోసుకోవడం అంటారు.
---------------------------------------------------------------------------------------------------------------------------
కిష్కింద కాండ
----------------
శ్రీరాముని శోకాన్ని పోగొట్టే ప్రయత్నాన్ని చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని కొనిరావడంలో తనవంతు సహాయం చేస్తానన్నాడు. రావణుణ్ణి సపరివారంగా హతమార్చేందుకు తన శక్తియుక్తులనన్నింటిని వినియోగిస్తానన్నాడు. "దుఃఖం అనర్థదాయకం" కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడు దుఃఖించే వారికి సుఖముండదు. తేజము క్షీణించును. ప్రాణాలు నిలువడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుండి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు.
1. శ్రీరాముని శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేసినవాడు ఎవరు?
జవాబు: శ్రీరాముని శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేసినది సుగ్రీవుడు.
2. సీతాదేవిని కొనిరావడంలో సుగ్రీవుడు ఏమన్నాడు?
జవాబు: సీతాదేవిని కొనిరావడంలో తనవంతు సహాయం చేస్తానని సుగ్రీవుడు అన్నాడు.
3. రావణుణ్ణి సపరివారంగా హతమార్చేందుకు సుగ్రీవుడు ఏం చేయనున్నానన్నాడు?
జవాబు: తన శక్తి, యుక్తులన్నింటినీ వినియోగిస్తానని అన్నాడు.
4. సుగ్రీవుడు దుఃఖం గురించి ఏమన్నాడు?
జవాబు: "దుఃఖం అనర్ధదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దు" అన్నాడు.
5. ఎల్లప్పుడూ దుఃఖించే వారికి ఏమి జరగుతుందని చెప్పాడు?
జవాబు: ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖం ఉండదని, తేజం క్షీణిస్తుందని, ప్రాణాలు నిలవడమే కష్టమని చెప్పాడు.
6. దుఃఖం వల్ల ఏం కలుగుతుంది
జ. అనర్ధాలు కలుగుతాయి
7. శ్రీరాముని శోకానికి కారణమేమిటి?
జ. రావణుడు సీతను అపహరించి తీసుకపోవడం.
++++++++++++++++++++++++++++++
అపరిచిత పద్యానికి
ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం ఐదు ప్రశ్నలకు పది మార్కులు ఉంటాయి.
తప్పు ఒప్పులు అడగవచ్చు
ఖాళీలు అడగవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి