సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

6, మార్చి 2023, సోమవారం

అలంకారము :

అలంకారము : కావ్యమునకు అందమును చేకూర్చే దాన్ని అలంకారము  అంటారు.
అలంకారములు మూడు రకములు. అవి:

శబ్దాలంకారములు: శబ్దం  ప్రధానముగా కవితకు బాహ్యసౌందర్యమును కలిగించేవి శబ్దాలంకారములు.
అర్థాలంకారములు: అర్థము వలన కవితకు అంతఃసౌదర్యమును కలిగించేవి అర్థాలంకారములు.
ఉభయాలంకారములు: శభ్దార్థాల రెంటి వలన కవితకు అందమును సమకూర్చేవాటిని ఉభయములు అంటారు.

శబ్దాలంకారములు:

ఇవి యారు.
నాలుగు అనుప్రాసములు, ఒక యమకము,  ఒక ముక్తపదగ్రస్తము కలసి మొత్తము ఆరు శబ్దాలంకారములు కలవు.
అనుప్రాసము: వర్ణవిన్యాసమును అనుప్రాసము అని అంటారు. ఇవి నాలుగు.
వృత్యనుప్రాసము: ఒక హల్లు (వర్ణము) మరల మరల వచ్చుటను వృత్యనుప్రాసమందురు.

ఉదా:

కాకీక కాకికి కాక కేకికా?
కం: అడిగెదనని కడువడిఁజని
యడిగినఁదన మగడు నుడువడని నెడ యుడుగన్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడి నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!


ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్లమబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్కా,
ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ,
టక్కున టక్కరి పిట్టా, నిన్ను పట్టేదెట్టా? ఎట్టా?


ఛేకానుప్రాసము: రెందు కాని అంతకంటె ఎక్కువ కాని అక్షరాలు  అర్థభేదముతో వెంటవెంటనే(ఎడ తెగక) మరల మరల వచ్చుటను ఛేకానుప్రాసము అని అంటారు.

ఉదా:

గుడిలో పూజ పూజను చేస్తున్నది.
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి

ఇదేనా ఇదేనా ఆ మురళి

కందర్పదర్పభంగ


సూచన 1: వెంట వెంటనేరావాలి.
సూచన 2: అర్థబేధం ఉండాలి.


లాటానుప్రాసము: ఒకే అర్థము ఉన్న పదములను తాత్పర్యభేదముతోమరల మరల చెప్పుటను లాటానుప్రాసము అని అంటారు.

ఉదా:    

కమలాక్షునర్చించు కరములు కరములు
శ్రీనాధు  వర్ణించు జిహ్వ జిహ్వ

సూచన: పదాలు రెండు వెంటవెంటనె రావాలి.
(అక్షరసమూహాలు కాక పదాలు అయి ఉండాలి)
    అర్థభేదము గాని శబ్దభేదము గాని ఉండారాదు.  

అంత్యానుప్రాసము: పద్యములోని పాదాలకు కాని, వాక్యములకు కాని చివరిభాగములో ప్రాస కలుగునట్లు అవే అక్షరములు మరల మరల చెప్పుటను అంత్యానుప్రాసము అని అంటారు.

ఉదా:     అగ్గిపుల్ల

కుక్కపిల్ల

సబ్బుబిళ్ళ

కాదేది కవితకనర్హం

ఔనౌను శిల్పమనర్ఘం
ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతై ధ్రువునిపై నంతై మహార్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై


యమకము: రెండు లేక, అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు అర్థభేదముతో మరల మారల చెప్పుటను యమకము అని అంటారు.

ఉదా:     మనసుభద్రకు మనసుభద్రమాయె  (మన సుభద్రకు మనసు భద్రమాయె)

ఓ హారిక! జోహారిక!!

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు!

    సూచన : పదాలు వెంట వెంటనె రానక్కరలేదు.

ముక్తపదగ్రస్తము : ఒక పాదములోచివరి పదాన్ని తరువాతి పాదములో మొదటి పదముగా ఉపయోగించదాన్ని ముక్తపదగ్రసతము అని అంటారు. ముక్తపదగ్రస్తము అని అంటారు.

ఉదా:     సుదతీ నూతన మదనా
    మదనాగతురంగపూర్ణ  మణిమయ సదనా!

అర్థాలంకారములు:

అర్థము వలన కవితకు అందాన్ని ఇచ్చేవి అర్థాలంకారములు. ఇవి వందకుపైగా ఉన్నాయి.
ముందుగా కొన్ని ముఖ్యమైన నిర్వచనములు :
ఉపమేయము     : వర్ణించదలచిన విషయము (దేని గురించి చెప్పదలుకున్నామో అది)
ఉపమానము    : పోల్చడానికి ఎంచుకున్న విషయము (దేనితో పోలుస్తున్నామో అది)
సమానధర్మము    : ఉపమేయములోను, ఉపమానములోను సమానముగా ఉన్న లక్షణము లేక ధర్మము (common feature )

ఉపమావాచకము    : ఉపమానకు ఉపమేయమునకు ఉన్న పోలికను తెలుపుతూ అన్వయము (relation) కుదిర్చే పదము


ఇప్పుడు సాధారణముగా ఉపయోగించే కొన్ని అర్థాలంకారములు కొన్ని నేర్చుకుందాము.
ఉపమాలంకారము : ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి అందంగాచెప్పుటను ఉపమాలంకారము అని అంటారు. దీనిలో సాధారణముగ ఉపమేయోపమానములు, సమానధర్మము, ఉపమావాచకము ఈ  నాలుగు  ఉంటాయి.

    ఉదా:

ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది.
ఈ ఇడ్లీలు మల్లెపువ్వుల లాగ ఉన్నాయి. (ఇక్కడ సమానధర్మము లేదు!)
సూచన: ‘లాగ', ‘వలె‘, ‘లాంటి', ‘వలెనె' పదాలు ఉపమావాచకములుగా కనిపిస్తే అది సాధారణముగ ఉపమాలంకారము అవుతుంది.


రూపకాలంకారము : ఉపమేయమునకు, ఉపమానమునకు రెంటికిని భేదము ఉన్నా కూడ లేనట్లే చెప్పుటను రూపకాలంకారము అని అంటారు. అనగా,  ఉపపేయమునందు ఉపమాన రూపమును ఆరోపించుట.

ఉదా:  ఈ  రాజు మూడవకన్ను లేని ఈశ్వరుడు.

ఉత్ప్రేక్షాలంకారము : ఉత్ప్రేక్ష అనగా ఊహ లేక భావన అని అర్థము. అర్థము. సమానధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానముగా “ఊహించి” చెప్పటాన్ని ఉత్ప్రేక్షాలంకారము అని అంటారు.

ఉదా:  ఆమె నవ్వు ముత్యాలు దొర్లినట్టు ఉంది.
సూచన: ఇందులో సమానధర్మము ఉండదు.


దృష్టాంతాలంకారము :  రెండు వాక్యాల వేరు వేరు ధర్మాలను బింబప్రతిబింబభావముతో వర్ణించి చెబితే దానిని దృష్టాంతాలంకారము అని అంటారు. (Two sentences presented as reflections of each other)

ఉదా:      “ఉప్పుకప్పురంబు” పద్యము  
అన్నానికి అరిటాకు - సున్నానికి తంబాకు - పుణ్యానికి స్వామిపాదం తాకు
యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.   

అతిశయోక్తి అలంకారం : గోరింతలు కొండంతలుగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారము అని అంటారు.

ఉదా:    కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఈ  భవనములు చంద్రమండలాన్ని తాకుతున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...