మానవాళి నూలు పొత్తిళ్లు
అవి నూలు పోగులు కావు
దేహాన్ని కప్పిన సోయగాలు
దిసమొల దిగంబరుడికి
నాగరికత నేర్పిన పొత్తిగుడ్డలు
ఉమ్మనీరు పది నెలలు కవచమైతే
ఆ నూలుపోగులే ఊపిరి ఉన్నంత మేర
మనల కాపాడే దేహకవచం
పోగులు తల్లుల ఛాతికి రక్షణైంది.
సద్దులకిరీటం తలదాల్చిన నా తల్లికి చుట్టబట్టైన సోపతి
ఆకలికేకల లొల్లిని కట్టడి చేసిన కొనకొంగు
శోకంలోనూ కూడా అవ్వకు ఓదార్పే
ఆత్మగౌరవం లేని అయ్య పెయినిండా బట్టలు తొడిగి ధిక్కారం ప్రకటించాడు
మస్కట్ పోయెచ్చిన మామ బట్టలతో గడిపిన బాల్యం
పచ్చిక మీద లేగదూడ గంతుల పరవశం మరుపురాదు
యూనివర్సిటి విద్యలో
కొత్తబట్టలు కొనలేని కొట్టొచ్చిన పేదరికం పై
ఉద్యోగినియ్యాక బట్టలు కొనడం కూడా ప్రతీకారమే
****
ఆసుపోయడమంటే యశస్సు పోయడమే
మగ్గం నేయడమంటే దేహరక్షణ పెంచడమే
కండెలూ దారాలూ మానవాళి బట్టల గుండెలే
ఈ నేతన్నల స్వేద పరిమళం
జనావాళి అంగ వస్త్రం
వేదికకు శోభాయమానం వేడుకకు అలంకరణ
నూతన వస్త్రాల సౌందర్యమే
పుట్టుక -పుల్లల మధ్యలో బట్టలు
కట్టు కట్టిన జీవిత నిర్వచనం
అందమూ ఆహార్యమూ పోగులే పోగులు
సాంస్కృతిక చిహ్నాలు
సంప్రదాయానికి పట్టుకొమ్మలు
పోగులు కావవి మానవాళి పొత్తిళ్లు
దేశదేశాల ఆత్మగౌరవ ఝండాలు
-డా. సిద్దెంకి
తేది: 07-08-25
చేనేత దినోత్సవం పురస్కరించుకొని రాసిన కవిత