సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

12, జులై 2026, ఆదివారం

పఠనావగాహన వ్యూహాలు


పఠనానావగాహన వ్యూహాలు




పఠనం, అవగాహన అనే రెండు అంశాలను పరిశీలించి, అందులో వెనుకబడిన విద్యార్థులకు వాటిని నేర్పేందుకు కొన్ని విధానాలను అనుసరించాల్సి వస్తుంది. వాటినే వ్యూహాలుగా పేర్కొంటున్నాం. ఒక వ్యూహం పని చేయనప్పుడు దాని స్థానంలో మరొక వ్యూహాన్ని అమలుజరుపుతాం. అందుకే వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి అనుకూలంగా ఉండాలి.జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 2023, జాతీయ విద్యా విధానం 2020 సూత్రాలను తరగతి గది స్థాయికి దిగువకు తెచ్చే వంతెన వంటిది. ఈ చట్రం పఠనావగాహనను నాలుగు సోపానాలుగా విభజించింది. మొదటి సోపానం అక్షర స్థాయి పఠనం, రెండవది భావ గ్రహణం, మూడవది విశ్లేషణాత్మక పఠనం, నాల్గవది విమర్శనాత్మక మరియు సృజనాత్మక పఠనం. ఈ నాలుగు సోపానాలను దాటినప్పుడే సమగ్ర పఠనావగాహన సిద్ధిస్తుందని చట్రం స్పష్టం చేసింది.

1. నిర్వచనం: పఠనావగాహన (Reading Comprehension) అంటే చదివిన పాఠ్యాన్ని కేవలం పదాలను చదవడం మాత్రమే కాకుండా, దాని భావాన్ని, ఉద్దేశాన్ని, అంతర్లీన సందేశాన్ని, సందర్భాన్ని అర్థం చేసుకొని, విశ్లేషించి, జీవితంలో అన్వయించగల సామర్థ్యం.

  •  HS TEL Handout july 2026 - 

        CAPACITY BUILDING PROG. HS TEL. HANDOUT MAY 2025

    జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 2023 ప్రకారం, పఠనావగాహన బోధనలో అనుభవాత్మక అభ్యసనానికి (Experiential Learning) అత్యంత ప్రాధాన్యత ఉంది. విద్యార్థి చదివిన విషయాన్ని తన చుట్టూ ఉన్న జీవిత వాస్తవాలతో అనుసంధానించగలిగినప్పుడే పఠనం అర్థవంతమవుతుంది. అందువల్ల పత్రికా కథనాలు, స్థానిక సాహిత్యం, జానపద కథలు, సమకాలీన సాహిత్యాన్ని పాఠ్యాంశాలలో భాగం చేయాలని ఈ చట్రం నిర్దేశించింది.

  • L I P మార్గదర్శకాలు G O 03.07.2026

ఆలోచించండి, చర్చించండి:

  • ధారాళంగా చదవడమంటే?
  • పిల్లల్లో ధారాళంగా చదవడాన్ని ఎలా పెంపొందించవచ్చు?
  • పిల్లల్లో పఠనావగాహన జరిగినట్లు ఎలా గుర్తించవచ్చు?
  • పఠనావగాహనను పెంచడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించవచ్చు?

పఠనం (Reading) అనేది కేవలం అక్షరాలను చదవడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవడం, ఆలోచించడం మరియు జ్ఞానాన్ని పెంపొందించుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను, మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. దీని ద్వారా కొత్త పదజాలం నేర్చుకోవచ్చు, భాషపై పట్టు పెరుగుతుంది, మరియు ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
విద్యా విధానంలో పఠనం నాలుగు రకాలుగా ఉంటుంది: 

  1. ప్రకాశ పఠనం (Oral Reading): ఇతరులకు వినిపించేలా స్పష్టంగా, బిగ్గరగా చదవడం. ఇది ఉచ్ఛారణ దోషాలను సరిచేయడానికి సహాయపడుతుంది.
  2. మౌన పఠనం (Silent Reading): శబ్దం లేకుండా, మనసులో చదవడం. దీనివల్ల అర్థం చేసుకునే శక్తి, వేగం పెరుగుతాయి.
  3. క్షుణ్ణ పఠనం (Intensive Reading): ఏదైనా విషయాన్ని లోతుగా, ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా చదవడం (ఉదాహరణకు: పాఠాలు, పరీక్షల తయారీ).
  4. విస్తార పఠనం (Extensive Reading): ఆనందం కోసం లేదా సాధారణ సమాచారం కోసం పుస్తకాలు, నవలలు త్వరగా చదవడం. 

పిల్లల్లో అభ్యసనాభివృద్ధి జరిగిందా లేదా అని మొదటగా గ్రహించేది వారి పఠన తీరు, అవగాహనను బట్టే. ప్రస్తుతం ఎక్కువ మంది పిల్లలు ఈ పఠనం, అవగాహనలో వెనుకబడుతున్న దృష్ట్యా, వారికి ప్రధానంగా పఠన నైపుణ్యం పెంపొందించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడింది.

చదవడమే రాని పిల్లలకు ఇక అవగాహన ఎక్కడిది? ఈ రెండూ రాని పిల్లలు సామర్థ్యాలు సాధించడం ఎలా?

పఠనం - వ్యూహాలు: ధారాళంగా చదివే నైపుణ్యం పెంపొందించేందుకు తరగతిలో ప్రత్యేకంగా ప్రతి పీరియడ్‌లో వ్యక్తిగత పఠనం సోపానాన్ని నిర్వహించాల్సి వస్తుంది. అలాగే గ్రంథాలయ వినియోగంతో పాటు 6, 7 పీరియడ్‌లను చదవడం-రాయడం నేర్పే పీరియడ్‌లుగా వాడుకొంటున్నాం.

ఇంతచేసినా చదవడం రావడం లేదంటే ఉపాధ్యాయులు మరింత ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. నిజానికి చదవడం నేర్పడానికి ఈ 6, 7 పీరియడ్‌లు సరిపోవడం లేదు. మరి ఇంకా ఏం చేయవచ్చు?

  • పూర్వజ్ఞానాన్ని చైతన్యపరచడం
  • శీర్షిక, చిత్రాలను పరిశీలించి ఊహించడం
  • ప్రశ్నించుకుంటూ పఠించడం
  • ముఖ్యాంశాలను గుర్తించి సంక్షిప్తీకరించడం
  • పునఃపఠనం ద్వారా అవగాహన పెంపొందించడం

అదనపు వ్యూహం: పిల్లలను తరగతిలో యాదృచ్ఛికంగా వ్యక్తిగత పఠనం చేయిస్తున్నప్పుడు, ఎప్పుడూ చదవగలిగే పిల్లలనే ఎంపిక చేసుకోకుండా, చదవడంలో వెనుకబడిన విద్యార్థితో చదివించాలి. అతను ప్రారంభంలోనే ఆగిపోవచ్చు. అప్పుడు మొదటి అక్షరం ఏంటో గుర్తించమనవచ్చు. అక్షరం గుర్తించాక దాని గుణింతాన్ని గుర్తించి చెప్పమనాలి. అలా చెప్పాక రెండో అక్షరాన్ని చెప్పించాలి. అలా పదంలోని మొత్తం అక్షరాలను పలికించాక అభినందిస్తూ, అక్షరాలను కూర్చుకుంటూ ఒక పదాన్ని చదివిన వ్యక్తి తరువాతి పదాలు కూడా ఇంటి దగ్గర అలాగే చదవాలని ప్రోత్సహించి మరో విద్యార్థిని లేపాలి. అతనికి కూడా ఇదే పద్ధతిని అవలంబింపజేసి, చదవడం వచ్చినా ప్రయత్నించడం లేదు కనుక వెనుకబడుతున్నాడనే వాస్తవాన్ని గుర్తింపజేయాలి.

వ్యక్తిగత పఠనమంటే ఒక వ్యక్తి లేచి పేరాలకు పేరాలు చదవడమే కాదు. చదవడం రాని వ్యక్తి చేత అక్షరాలు కూర్చుకుంటూ ఒక పదాన్ని చదివించడం కూడా వ్యక్తిగత పఠనం కిందే లెక్క.

పఠనావగాహన వ్యూహాలు (Reading Comprehension Strategies)

. పఠనావగాహన లక్ష్యాలు
చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడం.
ముఖ్యాంశాలను గుర్తించడం.
పదజాలాన్ని విస్తరించుకోవడం.
విమర్శనాత్మకంగా ఆలోచించడం.
సృజనాత్మక స్పందన ఇవ్వడం.
భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.
జీవిత సందర్భాలతో అనుసంధానం చేయడం.
3. వివిధ విద్యా చట్టాలు, విధానాలు, చట్రాలలో పఠనావగాహన
RTE–2009 (విద్యా హక్కు చట్టం)ప్రధాన అంశాలు ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య హక్కు.
బాలకేంద్రిత బోధన.
భయరహిత అభ్యసన వాతావరణం.
నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE).
పఠనావగాహనపై ప్రభావం
కేవలం బట్టీ పట్టించడం కాదు.
అర్థవంతమైన పఠనానికి ప్రాధాన్యం.
కార్యకలాపాల ఆధారిత అభ్యాసం.
NCF–2005 ప్రధాన భావన  Learning Without Burden
పఠనావగాహన దృక్పథం
పాఠ్యపుస్తకం ఒక్కటే జ్ఞాన మూలం కాదు.
విద్యార్థి అనుభవాలతో పాఠాన్ని అనుసంధానం చేయాలి.
ప్రశ్నించడం, చర్చించడం, విశ్లేషించడం ప్రోత్సహించాలి.
NCF–2023   ప్రధాన దృక్పథం     Competency Based Learning
Foundational Literacy
Reading for Meaning
Higher Order Thinking Skills (HOTS)
పఠనావగాహనలో ప్రాధాన్యత
చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడం.
వివిధ రకాల పాఠ్యాల పఠనం.
ఊహించడం.
విశ్లేషించడం.
అభిప్రాయం వ్యక్తీకరించడం.
జీవితంలో అన్వయించడం.
SCF–2024 (State Curriculum Framework – Telangana) ప్రధాన అంశాలు
స్థానికత (Local Context)
తెలంగాణ భాష, సంస్కృతి
విద్యార్థి అనుభవాలు
బహుభాషా దృక్పథం
కార్యకలాపాల ఆధారిత అభ్యాసం
పఠనావగాహనలో సూచనలు
స్థానిక కథలు. జానపద సాహిత్యం.వార్తలు.పోస్టర్లు.డిజిటల్ పాఠ్యాలు.
సంభాషణ ఆధారిత పఠనం.
NEP–2020ముఖ్యాంశాలు Foundational Literacy and Numeracy (FLN)
Experiential Learning
Critical Thinking
Digital Learning
Multilingualism
పఠనావగాహనకు సూచనలు
ఆనందదాయక పఠనం
గ్రంథాలయ వినియోగం
రోజువారీ పఠనం
డిజిటల్ వనరుల వినియోగం
ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం
4. పఠనావగాహన వ్యూహాలు పఠనానికి ముందు (Pre Reading)
శీర్షిక పరిశీలన
చిత్రం పరిశీలన
ముందస్తు జ్ఞానం గుర్తుచేయడం
ఊహించడం (Prediction)
ముఖ్య పదాల పరిచయం
పఠనావగాహన స్థాయిలు
1. ప్రత్యక్ష అవగాహన (Literal)
పాఠ్యంలో నేరుగా ఉన్న సమాచారాన్ని గుర్తించడం.
2. అనుమానాత్మక అవగాహన (Inferential)
పాఠ్యంలో చెప్పని భావాన్ని ఊహించడం.
3. విమర్శనాత్మక అవగాహన (Critical)
రచయిత ఉద్దేశం, ఆధారాలు, విశ్వసనీయతను పరిశీలించడం.
4. సృజనాత్మక అవగాహన (Creative)
కొత్త ఆలోచనలు, ప్రత్యామ్నాయ ముగింపులు, అన్వయాలు రూపొందించడం.
6. ఉపాధ్యాయుని పాత్ర
అనుకూల వాతావరణం కల్పించడం.
విభిన్న పఠన సామగ్రి అందించడం.
ప్రశ్నల ద్వారా ఆలోచింపజేయడం.
ICT, AI వనరులను వినియోగించడం.
సహకార అభ్యాసాన్ని ప్రోత్సహించడం.
నిరంతర ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం.
విశ్లేషణ
ప్రస్తుత విద్యా విధానాలు "చదవడం" నుండి "అర్థం చేసుకుని ఆలోచించడం" వైపు దృష్టి మళ్లించాయి. RTE–2009 బాలకేంద్రిత అభ్యాసాన్ని బలపరుస్తే, NCF–2005 అనుభవాధారిత అభ్యాసాన్ని ప్రతిపాదించింది. NEP–2020, NCF–2023 మరియు SCF–2024 సామర్థ్యాధారిత (Competency-based) అభ్యాసం, విమర్శనాత్మక ఆలోచన, డిజిటల్ వనరుల వినియోగం, బహుభాషా దృక్పథాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అందువల్ల పఠనావగాహన అనేది కేవలం పరీక్షల కోసం కాకుండా జీవితాంత విద్య (Lifelong Learning), సమస్య పరిష్కారం, సమాచార విశ్లేషణ, సమర్థ కమ్యూనికేషన్ వంటి 21వ శతాబ్ద నైపుణ్యాలకు పునాది.



సామర్థ్యాల సాధన - అభ్యసనాభివృద్ధి


సామర్థ్యాల సాధన - అభ్యసనాభివృద్ధి

భాష ఒక్కటే కాదు, కొత్తగా ఏది నేర్పినా ఏదో ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేర్పిస్తాం. ఏ లక్ష్యాన్ని ఆశించకుండా నేర్పేది కానీ, అభ్యసించేది కానీ ఏదీ ఉండదు. భాషలో చిన్న పద్యం నేర్పినా, చిన్న కథో, గేయమో, వ్యాసమో నేర్పాలన్నా దాని ద్వారా ఒక లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకొని బోధిస్తున్నాం. అట్లా భాషాబోధన ద్వారా పిల్లల్లో కొన్ని ఫలితాల్ని సాధించబూనడం, ఆ ఫలితాల ద్వారా సంబంధిత లక్ష్యాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఆ లక్ష్యాన్నే ఆధునిక పరిభాషలో సామర్థ్యంగా పరిగణిస్తున్నాం. ఆ లక్ష్యం/సామర్థ్యం ద్వారా ఏమేమి సాధించాలో తెలిపే సూచికలను స్పష్టీకరణలు లేదా అభ్యసన ఫలితాలు అంటారు.

ఆలోచించండి - చెప్పండి

  1. భాషలో ఏయే సామర్థ్యాలు సాధించాల్సి ఉంది?

  2. ఆయా సామర్థ్యాల సాధన ద్వారా పిల్లల్లో పెంపొందే అదనపు జ్ఞాననిర్మాణం ఏమిటి?

  3. ఆయా సామర్థ్యాలు సాధించడానికి తరగతిలో అనుసరిస్తున్న విధానాలేవి?

  4. అభ్యసనాభివృద్ధి కార్యక్రమం ఎందుకు? పెంపొందించే మార్గాలేవి?

చతుర్విధ భాషా నైపుణ్యాలైన వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం చేయగలిగితేనే భాష నేర్చినట్లు కాదు. చదవడమే కాకుండా చదివిన దాన్ని అర్థం చేసుకోగలగడం, మాట్లాడడంలో గానీ, రాయడంలో గానీ సొంత వ్యక్తీకరణ, దానికి తగిన ఆలోచనాశక్తి జోడించి రాయగలగడం, విభిన్న పదాలకు సరైన అర్థాలను గుర్తించడం, వ్యాకరణాంశాలు చేయగలగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, అభ్యసించే భాషలో కొన్ని సామర్థ్యాలు సాధించాలని నిర్దేశించడం జరిగింది. ఈ సామర్థ్యాల సాధన జరిగినప్పుడే పిల్లల్లో జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులు, ఆలోచనాశక్తి, వ్యక్తీకరణ నైపుణ్యం, కల్పనాశక్తి, సృజనాత్మక శక్తి వంటి అదనపు జ్ఞాన నిర్మాణం జరుగుతుంది.

పాఠ్య పుస్తకంలో ఆయా సామర్థ్యాల కింద ఇవ్వబడిన అభ్యసన ఫలితాలన్నీ సాధించాలి. తరగతిని బట్టి అభ్యసన ఫలితాలు మారినా సామర్థ్యాలు స్థిరంగా ఉంటాయి.

ఇంత విస్తృత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సామర్థ్యాల సాధన పిల్లల్లో సాధించే ప్రయత్నం చేస్తున్నాం. పాఠశాల దశ పూర్తి చేసుకొని బయటి ప్రపంచంలోకి వెళ్లిన పిల్లాడు సరైన భాషా వ్యక్తీకరణ చేయగలగాలి. పలు ప్రక్రియల్ని చదివి, విని అర్థం చేసుకొని తగిన విధంగా ప్రతిస్పందించాలి. బహుకోణాల్లో ఆలోచించి మాట్లాడడం గానీ, రాయడం గానీ చేయాలి. సృజనాత్మకంగా ఆలోచించగలగడం, పలు ప్రక్రియల్లో వ్యక్తీకరించగలగడం చేయాలి. నూతన పదాలను గ్రహించి సరైనచోట అర్థవంతంగా ప్రయోగించగలగడం, పలు వ్యాకరణాంశాలను గ్రహించడం ద్వారా భాషను వినియోగించే సమర్థతను కలిగి ఉండాలి. మొత్తంగా భాషలో ఒక పరిపూర్ణత సాధించి వివిధ రంగాల్లో భాషను ఉపయోగించుకోగలిగేలా ఈ సామర్థ్యాల సాధన జరగాల్సి ఉంది. అందుకొరకు గాను కింది సామర్థ్యాలను నిర్ధారించడం జరిగింది.

సాధించాల్సిన ప్రధాన భాషా సామర్థ్యాలు

  1. వినడం - మాట్లాడడం: అవగాహన - ప్రతిస్పందన
  2. ధారాళంగా చదివి, అర్థంచేసుకొని ప్రతిస్పందించడం
  3. స్వీయరచన: వ్యక్తీకరణ
  4. సృజనాత్మకత: వ్యక్తీకరణ - సృజనాత్మకత
  5. పదజాలం: భాషాంశాలు
  6. వ్యాకరణం: భాషాంశాలు
  7.  HS TEL Handout july 2026 - 

        CAPACITY BUILDING PROG. HS TEL. HANDOUT MAY 2025

  8. L I P మార్గదర్శకాలు G O 03.07.2026

1. వినడం - మాట్లాడడం:

ఇది తెలిసిందే అనిపించినా చాలా ప్రధానమైన సామర్థ్యం. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో పిల్లలు సొంతంగా ఆలోచించగలగడం, వ్యక్తీకరించడం ప్రధానంగా ఉంది కనుక సొంత వ్యక్తీకరణ జరగాలంటే సొంతంగా ఆలోచించగలగాలి. ఆలోచన మనసుకు సంబంధించినది. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే దానిగురించి ఆలోచించాలి. ఆలోచించడం ద్వారా వచ్చిన భావాలని నోటితో వ్యక్తీకరిస్తే మౌఖిక వ్యక్తీకరణ, రాతరూపంలో వ్యక్తీకరిస్తే లిఖిత వ్యక్తీకరణ. మొత్తంగా పిల్లాడిని ఆలోచింపజేయాలి గనుక 'మాట్లాడించడం' అనే సామర్థ్యాన్ని తీసుకోవడం జరిగింది. మాట్లాడడం కోసం ఆలోచించగలిగిన వ్యక్తి అవే ఆలోచనల్ని లిఖిత రూపంలో కూడా వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేర్చిన ఆ ప్రశ్నల్ని తరగతి గదిలో తరగతి కృత్యంగా, వ్యక్తిగత కృత్యంగా నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి మాట్లాడడంలో ప్రోత్సహిస్తూ ఈ సామర్థ్యాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.

2. ధారాళంగా చదివి, అర్థంచేసుకొని ప్రతిస్పందించడం:

పిల్లల్లో పఠనం, పఠనావగాహన పెంపొందించడం కూడా అతి ముఖ్యమే. మామూలుగా చదవడం కాకుండా ధారాళంగా, అర్థవంతంగా, సరైన ఊనికతో, స్పష్టంగా, సముచిత వేగంతో, దోషరహితంగా చదివినప్పుడే పఠన నైపుణ్యం కలిగి ఉన్నట్లు. అట్లే చదివిన అంశంలో ఏం చెబుతున్నాడో అర్థంచేసుకొని అది మౌఖిక రూపంలో గానీ, రాత రూపంలో గానీ వ్యక్తీకరించగలగడమూ ముఖ్యమే. హైస్కూల్ స్థాయిలో పిల్లలు అర్థం చేసుకోకుండా చదవగలగడం వల్ల ప్రయోజనమేమీ లేదు. అందుకే పిల్లల్ని తరగతిలో చదివించడం కొరకు, దాన్ని ఏమేరకు అర్థం చేసుకున్నారో గ్రహించడం కొరకు అపరిచిత పేరాలు, అపరిచిత పద్య, గేయభాగాలు చేర్చడం జరిగింది. అవి నిర్దేశించిన పీరియడ్లలో పిల్లల్తో చదివిస్తూ, అర్థం చేసుకునేందుకు సహకరిస్తూ సొంతంగా సమాధానాలు రాయించేలా వ్యూహాత్మకంగా నిర్వహించాల్సి ఉంటుంది.

3. స్వీయరచన:

పిల్లలు ఆలోచించి సొంతంగా రాయడాన్ని స్వీయరచన అంటారు. విషయం మీద సొంత అభిప్రాయాలు చెప్పడం, సమర్థించడం, కవి ఆంతర్యాన్ని గ్రహించి రాయడం, కారణాలు, వ్యక్తిత్వాలు ఇట్లా అన్ని కోణాల్లో సొంతరచనకు పూనుకునేలా పిల్లల్ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది. విశ్లేషించి రాయడం, సంక్షిప్తీకరించి రాయడం కూడా ఇందులో భాగమే. మొత్తంగా విద్యార్థి తన సొంత ఆలోచనలతో వ్యాసరూపంలో జవాబు రాయగలగాలి. ఇందుకు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఆయా విద్యార్థులు సొంతంగా రాసి, ప్రదర్శించేలా తగిన వ్యూహం ద్వారా ఆ పీరియడ్ ను నిర్వహించాలి. లేఖన దోషాలు ఉన్నా పిల్లల్తో రాయిస్తే రాయడమొస్తుంది. కృత్యం నిర్వహించకుండా ఇంటిపనిగా రాసుకురమ్మంటే గైడ్లను ఆశ్రయిస్తారు.

4. సృజనాత్మకత:

ఇది అతిముఖ్యమైన సామర్థ్యం. పిల్లల్లో సహజంగా ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు 20 కి పైగా సృజనాత్మక ప్రక్రియల్ని కింది తరగతుల్నుండే ప్రవేశపెట్టడం జరిగింది. ఇచ్చిన అంశాన్ని వివిధ వ్యవహార రూపాల్లోకి మార్చి రాయగలిగే నైపుణ్యమే సృజనాత్మక ప్రక్రియల సాధన. కవిత, గేయం వంటివే కాక, కరపత్రం, అభినందనపత్రం వంటి అన్ని ప్రక్రియలపై పట్టు సాధించాల్సి ఉంది. దీన్ని కూడా అవసరమైతే మాదిరి ప్రదర్శించి, సరైన వ్యూహాన్ని అనుసరించి వ్యక్తిగతంగా రాయించడం, ప్రదర్శింపజేయడం, దోషసవరణ చేయడం వంటి కృత్యాల ద్వారా పీరియడ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కూడా సొంతంగా రాయిస్తే రాయగలుగుతారు.

5. పదజాలం:

పిల్లలు భాషమీద పట్టు సాధించాలంటే తగినంత పదజాలం మీద పట్టుసాధించడం అవసరం. తరగతి స్థాయిని బట్టి పదజాలాభివృద్ధి జరగాల్సి ఉంది. అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యర్థాలు వంటివి తెలుసుకోవాల్సి ఉంది. ఈ పదజాలం మీద పట్టు సాధించినపుడే భాషా వినియోగం సరిగా జరుగుతుంది. అందుకు గాను తరగతి గదిలో ఆ సామర్థ్యానికి సంబంధించిన అభ్యసన ఫలితాలను తగిన నిర్వహణా వ్యూహాన్ని అనుసరించి పూర్తి తరగతి కృత్యంగా గాని, వ్యక్తిగత కృత్యంగా గాని నిర్వహించి ఈ పదజాల సామర్థ్యాన్ని సాధింపజేయాలి.

6. వ్యాకరణాంశాలు:

పిల్లలకు భాషను ఎట్లా వినియోగించాలో సమగ్ర అవగాహన కలగాలంటే వ్యాకరణాంశాలపైన కూడా సరైన పట్టు సాధించాల్సి ఉంది. వ్యాకరణం భాషను నిర్దిష్టంగా, దోషరహితంగా ప్రయోగించడంలో తోడ్పడుతుంది. అందుకు గాను తరగతి స్థాయిని బట్టి సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్యాలు వంటివాటి రూపభేదాలు తెలిసి ఉండాలి. అందుకు గాను తరగతి గదిలో ఆ సామర్థ్యానికి సంబంధించిన అభ్యసన ఫలితాలను తగిన నిర్వహణా వ్యూహాన్ని అనుసరించి పూర్తి తరగతి కృత్యంగా గాని, వ్యక్తిగత కృత్యంగా గాని నిర్వహించి ఈ వ్యాకరణాంశాల సామర్థ్యాన్ని సాధింపజేయాలి.

అభ్యసనాభివృద్ధి కార్యక్రమం

క్రోడీకరణ: ఈ సామర్థ్యాల సాధన అనే సముద్రాన్ని ఈదాలంటే ముందు అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో భాగమైన ‘మౌలిక సామర్థ్యాలు’ సాధించాలి.

పరిచయం: విద్యార్థులు ఆయా తరగతులకు సంబంధించిన అభ్యసన ఫలితాలు సాధించలేనపుడు, ఆయా పిల్లల్ని ఆ ఫలితాల సాధన దిశగా సన్నద్ధం చేయడానికి ముందస్తుగా చేసే అదనపు సంసిద్ధతా కార్యక్రమమే అభ్యసనాభివృద్ధి కార్యక్రమం. భాషలో మౌలిక సామర్థ్యాలైన చదవడం, రాయడంతో పాటు సామర్థ్యాల వారీగా అభ్యసన ఫలితాలను సాధించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఇది ప్రతియేడూ జరుగుతున్న నిరంతర ప్రక్రియ.

ఆలోచించండి - చెప్పండి

  • పిల్లలకు అభ్యసనాభివృద్ధి కార్యక్రమం ఎందుకు?

  • అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏ మౌలిక సామర్థ్యాల్లో పిల్లల ప్రగతిని ఆశిస్తున్నాం?

  • పిల్లల్లో మౌలిక సామర్థ్యాల సాధన కొరకు ఏమేం చేయవచ్చు?

మౌలిక సామర్థ్యాల ఆవశ్యకత

సాధారణంగా అన్ని పాఠశాలల్లో తరగతికి తగిన అభ్యసన ఫలితాలు సాధించడంలో విద్యార్థులు వెనుకబడుతున్నారు. అన్ని అభ్యసన ఫలితాల్ని సాధించడమంటే ఆయా సామర్థ్యాల్ని విజయవంతంగా పూర్తిచేసినట్లే. అట్లాంటి పిల్లలు ఏ కొందరో ఉంటున్నారు. మిగతావారు తరగతికి తగిన ఫలితాలు సాధించకపోవడానికి ప్రధాన కారణం కనీస సామర్థ్యాలైన చదవడం, రాయడం చేయలేకపోవడం. అలాంటి పిల్లల కోసం, వాళ్లని కూడా తరగతి సామర్థ్యాలు సాధించేలా చేయాలంటే ముందుగా కనీస సామర్థ్యాలు చేయగలగాలి. అందుకు గాను గతంలో నుండి 3 R's (చదవడం, రాయడం, గణితం) పేరుతో, ఇతర పేర్లతో ప్రతియేడూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూనే వస్తున్నాం. అయినా పిల్లల్లో రాయడం, చదవడం సరిగా రావడం లేదని అధికారులు గుర్తిస్తూనే ఉన్నారు.

అందులో భాగంగానే ప్రతియేడూ పిల్లల అభ్యసన స్థాయిని అంచనా వేయడానికి మూడు మౌలిక సామర్థ్యాలపై మూల్యాంకనం చేస్తున్నాం. ఏ సామర్థ్యంలో వెనుకబడ్డాడో గుర్తించి ఆయా సామర్థ్యాలపై ప్రత్యేక పీరియళ్లలో (6, 7 పీరియళ్లు) ప్రత్యేక శిక్షణ అందించడం ఈ అభ్యసనాభివృద్ధి కార్యక్రమం లక్ష్యం. గత సంవత్సరం లాగే ఈయేడూ ఈ కార్యక్రమం కొనసాగించబడుతుంది.

L I P మార్గదర్శకాలు G O 03.07.2026

ప్రారంభ పరీక్ష, మధ్యంతర పరీక్ష, అంత్య పరీక్షల పేరుతో విద్యార్థుల్ని:

  1. ధారాళంగా చదవడం
  2. చదివింది అర్థం చేసుకోవడం
  3. లిఖితరూప వ్యక్తీకరణ

అనే మూడు అంశాలమీద పరీక్షించడం జరుగుతుంది. పరీక్ష నిర్వహించాక ‘చేయగలడు, చేయలేడు’ అని ఆన్‌లైన్‌లో తగిన గుర్తుల ద్వారా నమోదు కూడా చేయాల్సి ఉంది.

ఇదంతా ఒకెత్తైతే.. ఏ మౌలిక సామర్థ్యం సాధించలేకపోతున్నాడో ఆ సామర్థ్యంలో పిల్లలకు నిర్దేశించిన 6, 7 పీరియళ్లలో తగిన శిక్షణ అందించాల్సి ఉంది. ఇవి సరిపోనప్పుడు అదనపు పీరియళ్లు సృష్టించుకొనైనా చదవడం, అవగాహన, వ్యక్తీకరణ నైపుణ్యం పెంపొందించాల్సి ఉంది. అందుకు ధ్వని గుర్తింపు, అక్షర గుర్తింపు కార్యక్రమ వ్యూహాలు శక్తివంతంగా పనిచేస్తాయి. ఇందుకొరకు గతంలో ఉన్నతి మాడ్యూల్‌ను చక్కగా వినియోగించుకోవచ్చును.

ఆయా తరగతుల్లో 80 శాతం వరకు పిల్లలు ఈ మౌలిక సామర్థ్యాల్లో విజయవంతమైతే వాళ్లను తరగతి సామర్థ్యాలు సాధించే దిశగా ప్రోత్సహించవచ్చు. అంటే సామర్థ్యాల సాధన జరగాలంటే ముందుగా ‘మౌలిక సామర్థ్యాలు’ సాధించాలి. అప్పుడు మాత్రమే మన లక్ష్యసాధన పూర్తవుతుంది. అంతదాకా ఇది నిరంతర ప్రక్రియగానే భావించాలి.