సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

dr. veldandi sreedhar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
dr. veldandi sreedhar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జనవరి 2026, సోమవారం

బతుకు చిత్రాల తలపాగ - ''పగిడి'' కథలు

బతుకు చిత్రాల తలపాగ - ''పగిడి'' కథలు                                  -డా. సిద్దెంకి యాదగిరి.         నవ తెలంగాణ  19-01-2026



                 కథా సాహిత్యం ఒక ప్రాంతపు సామాజిక చరిత్రను మాత్రమే కాదు, రాజకీయ, సాంస్కృతిక, వర్తమాన పరిస్థితులను లోతుగా ప్రతిబింబిస్తుంది. ఆ దిశగా వర్తమానాన్ని తెలంగాణ కథలు ప్రతిబింబిస్తూ మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2024 సంవత్సరంలో రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చలకు వేదికైన సంవత్సరాన్ని అక్షరీకరించిన కథలు ''పగిడి''. ఈ గ్రంథానికి సమకాలీన విలువను మరింత పెంచింది. ''పగిడి  (తలపాగా)''గా మలచడం అంటే, తెలంగాణ కథా సాహిత్యానికి ఒక గౌరవచిహ్నాన్ని ధరింపజేసినట్లేనని భావం.

                2013లో ''రంది'' కథా సంకలనంతో ప్రారంభమైన ఈ కథా ప్రయాణం ఒక పుష్కరకాలం పూర్తి చేసుకుంది. ప్రతి సంవత్సరం కథ సాహిత్యాన్ని కాలంతో సంభాషింపజేస్తూ, కన్నీళ్లను, కష్టాలను చిత్రిస్తూ వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేసే కథాసాహిత్యాన్ని సంగిశెట్టి శ్రీనివాస్‌, వెల్దండి శ్రీధర్‌ ల సంపాదకత్వం ప్రచురిస్తుంది. వీరి కృషి తెలంగాణ కథా సాహిత్యానికి గొప్ప చేర్పు.  

                ఈ సంకలనంలోని మొత్తంగా పద్నాలుగు కథలున్నాయి.  ఇద్దరు రచయిత్రులున్నారు. కథలలో మత సంబంధిత ప్రభావాలు, మెజార్టీ ఆధిపత్య భావనలు, భయాలు, పరస్పర అనుమానాలున్నాయి. ఇవి కథలలో అంతర్లీనంగా నిగూఢంగా వ్యక్తమవుతున్నాయి.  మనుషుల మధ్య ఏర్పడుతున్న దూరాలు, లుప్తమౌతున్న విలువలను చిత్రించాయి. రాజకీయ లాభాల ధోరణి, సామాన్య ప్రజల జీవితాలపై పడుతున్న ప్రభావం ఈ కథలలో  వాస్తవాలుగా రూపుదిద్దుకున్నాయి.

                ఆర్థిక అసమానతలు, ఆత్మగౌరవం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి.  అంతరం, అసంతృప్తి, గ్రామీణ జీవితాన్ని పట్టిస్తున్నాయి. పల్లెలోని ఆప్యాయతలు తెలంగాణ కథలలో స్థానిక అనుభవాలుగా మారాయి. ఆధునిక మానవుని ఆక్రోశాలు, ఒంటరితనపు వేదనలు వ్యక్తమవుతున్నాయి. విలువల సంక్షోభం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ వ్యవస్థ, మానవసంబంధాలలోని స్వార్థం, మానవీయ క్షీణత వంటి అంశాలు కథల ద్వారా పాఠకుడి ఆత్మపరిశీలనకు గురితీస్తాయి. జీవితాన్ని యథాతథంగా చూపించే ప్రయత్నాల వల్ల కథలు ప్రభావవంతంగా మారాయి. బహుముఖీన కోణాలు ఈ కథలలో సహజంగా ఆవిష్కృతమయ్యాయి.

                అన్నదమ్ముల అనుబంధాలకైనా షరతులు వర్తిస్తాయనీ, చెట్టు నేపథ్యంగా దిగజారుతున్న మానవ విలువలను తెలిపిన అక్షర కుమార్‌ ''మంకులొల్లి'' కథ.  పంచుకోవడంలో ఉన్న సంతృప్తి కోల్పోతున్న పరిస్థితులకు దర్పణం పట్టింది. ఈ కథలో  రైల్వే మూడో లైన్‌ మొదలుపెట్టి పది సంవత్సరాలైనా పూర్తికాని విషయాన్ని, కరోనా పెట్టిన కాలపరీక్షకు ప్రపంచమే తల్లడిల్లిందని చర్చించింది. తోబుట్టువులు, పాలు పంచుకోదగినవాళ్ళు పంచుకోలేక పగ పెంచుకుంటారు.  నెత్తులు పగలకొట్టుకొని నెత్తురు కళ్ళజూస్తారు. పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి పెద్దమనుషుల తీర్పుకు కొట్టేయబడుతున్న చింత, లచ్చవ్వకు తననే నరుకుతున్నట్టు బాధపడ్డది. చెట్టు నరుకుతుంటే చెట్టుతోటి పెనవేసుకున్న జ్ఞాపకాలు నిప్పుపెటినప్పుడు ఎగిరిపోయిన తేనెటీగల్లా ఉన్నాయని అనుభవాలని చిత్రించారు.

                మంచి బట్టకట్టినా, మంచిగ దువ్వుకున్నా ఓర్వని వివక్షల సమాజాన్ని చూపించిన మారబత్తుల పెద్దన్న కథ ''పరివర్తన.'' కమల తన భర్తను వ్యసనాల నుండి మార్చుకున్నది. తన భర్తను పరివర్తనతో కమల ఆత్మగౌరవం అద్ది బతుకు దిద్దుకుంది. ఎన్నో మాటలు తిట్టినా భరించే ఆటో డ్రైవర్‌ వెంకన్న, అగ్రవర్ణ భూస్వామితో మాటకు మాట అనగలను అని అన్నాడు. మర్యాద ఇచ్చి పుచ్చుకోండి అని మందు బస్తాలు రోడ్డు మీద పడేసి గల్ల ఎగురేసుకుంటూ పోవడం ఆత్మాభిమానమే.         

                చేతగాని బతుకు - కంట్లో కారం ఒకటేనని బతుకును పసరులా పిండి పోస్తున్న యాదమ్మ జీవితం నేర్చుకోదగ్గది. ఆమె పెనిమిటి కుందయ్యల  బతుకుబాధల్ని కథగా మలచిన తగుళ్ళ గోపాల్‌ ఆర్థ్రమైన కథ ''కర్ణం కుందయ్య.'' పల్లెల్లో కులాల ఐక్యత. అనుబంధాల అల్లికను ఈ కథ తెలియజేస్తుంది. ఈ కథలో సరుకులు కొనలేని దీనస్థితిని యాదమ్మ చెప్పడం కనీస ధరల పెరుగుదలను సూచిస్తుంది. ఇరుకు పట్టణాల్లోని ఇబ్బందిని, మంచిని ఎంతగా హత్తుకుంటదో చెడుని మర్యాద లేని కుటుంబ సభ్యులను కడిగిపారేస్తది. కుందయ్యకు సేవ చేయలేక విసిగిపోయింది. బయటికి కోపమున్నా లోపల కొలతకందని ప్రేమను పంచే యాదమ్మ తన భర్తను ఉద్దేశించి ''మంచి మంచి వాళ్లకు సావొస్తుంది. వీనికి వస్తలేదు చావు'' అని నిష్టురమాడుతది. కిందపడ్డాడు అనగానే నెత్తీ నోరు కొట్టుకుంటా ఉరుకడం ఆమె వ్యక్తిత్వానికి పరాకాష్టగా నిలిపింది.

                పైసమదం కన్నూ, మిన్ను కానకుండా చేస్తది. ఆపదలో ఆదుకునేది రక్త సంబంధం. ''రక్తబంధాన్ని ప్రేమగా కలుపుకో, లేకుంటే గడ్డకుపడ్డ చాపవైతవు.'' అని హెచ్చరించిన తల్లి అనుభవమే పెద్దింటి అశోక్‌ కుమార్‌ కథ ''రక్త బంధం.''              నాగరాజు బిడ్డ పెళ్లికి తోబుట్టువులు రాకపోవడానికి కారణం అతని పైసపిచ్చి. చాతినొప్పి వచ్చిందని తెలియగానే కట్టగట్టుకుని వచ్చారు. బిడ్డపెళ్లి కలిసి చేశారు. రెండు వారాల తర్వాత పండుగకు రాలేదు. అవ్వనడిగితే ''ఆపద ఉన్నప్పుడు చెప్పినా, చెప్పకపోయిన బాధ్యతగా నిలబడుతరు. తోబుట్టువులు హక్కు అలుగుతారు.  ప్రేమగా కలుపుమని'' బంధాల సందేశాన్ని వివరిస్తది.

                సాటిమిత్రుని సహానుభూతి అలజడిలోంచి పుట్టిన అఫ్సర్‌ కథ ''డియర్‌ మేరీ''. సెయింట్‌ మేరీ చర్చి దారుల్లోని అనుభూతులు, అనుభవాలు రచయితకు అతని మిత్రుడు శ్రీకర్‌కి జ్ఞాపకాలు. అవి గుర్తుకొచ్చినప్పుడు మిన్ను విరిగి మీద పడ్డట్లు గుండెల్లో ఉత్పాతం పుడుతుంది. పరిచయమైన మేరి శ్రీకర్‌ కంటే పెద్దదని తల్లి  పెద్దగా అరిచింది. వేరే వాళ్ళని రానవ్వని మనం మేరి రావడం వల్ల ఇల్లు   శుభ్రం చేయలేక చస్తున్నాని అక్కసు వెళగక్కింది. ప్రాణం ప్రాణంగా ప్రేమించే మేరి కోసం చర్చికి వెల్తాడు. జంధ్యం తెంచేసుకున్నాడు. అభిషేకం మర్చిపోయాడు. గుడి పూజలకు మాని బైబిల్‌ చదవడం ప్రారంభించాడు. మేరీతో పరిచిత, అపరిచిత లోకాల్ని ఎన్నో చూశాడు శ్రీకర్‌. దూరాల దారులు నడిచాడు. చర్చి, గొడుగు పట్టి నిల్చున్న వేపచెట్టు కింద పడుకోవడం అతని ఆత్మీయచోటు. ఇంటిముందు చెట్టు గురించి మేరీ కూడా చెప్పలేకపోయింది. చర్చిరోడ్డులో కిరాయికి ఎందుకు తీసుకున్నారని నరేంద్ర మామయ్య ప్రశ్నించాడు. అతని కొడుకు కిరణ్‌కు మేరితో మాట్లాడడం వల్ల శత్రుత్వము ఒక గోడలా పెరిగింది.  ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. మన వీధులు చర్చీలు, మసీదులు కాకముందే మేల్కొనాలని కనపడని యుద్ధాన్ని ప్రకటించాడు. రెండువందల మంది జమయ్యేసరికి రాజకీయ రంగు పులుముకుంది. బుల్డోజర్‌ రంగంలోకి దిగింది. చర్చి కూల్చబడింది. ఆ దాడిలో  మేరీ తండ్రి బెంజిమెన్‌ చనిపోయాడు. మేరీ వాళ్లు అడ్రస్‌ లేకుండా గల్లంతయ్యారు. రచయిత శ్రీకర్‌ దగ్గరికి వెళ్ళగానే కౌగిలించుకున్నాడు. చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నా ఎదురుచూపులా మిగిలిందనీ, మేరీ వస్తుంది. మాట్లాడుతుంది. వెళ్ళిపోతుంది. ఆ ముందటి చెట్టు పేరు ఇప్పటివరకు మేరీ కూడా చెప్పలేదంటూ తన హృదయాన్ని వ్యక్తీకరించాడు శ్రీకర్‌. నిజానికి చెట్లులేని చోట, మేరీ లేకపోవడం వల్ల అన్నీ ఉన్నాయనే భ్రమలో శ్రీకర్‌ బతుకుతున్నాడు. గట్టిగా హత్తుకుని వీడ్కోలు పలకకముందే పొగమంచులో బయలుదేరాడు రచయిత. పొగమంచుల శ్రీకర్ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.

                అనుకోని పరిస్థితులలో అనుకున్న లక్ష్యాలు సాధించడంలో బతుకులు అగాథమైతాయని సంఘర్షణలు చిత్రించిన హనీఫ్‌  కథ ''వేప పళ్ళు.'' జీవితం కూడా వేపపాళ్లలా చేదుగా ఉంటుంది. బ్థుకులో ఉన్న చీకటి విషవలయం ఆవరించిన పరిస్థితులను తెలిపిన బతుకును చిత్రిక పట్టింది. మాదిగ గూడెంలో పెళ్లికాకుండా కొడుకును కనిన తల్లితో శేషు నివసిస్తున్నాడు. ఎప్పటిలా తన తల్లివద్దకు అతడు రాగానే శేషు చీకట్లో కలిసిపోతాడు. ఒక అర్ధరాత్రి వెళ్ళిపోతున్న అతన్ని ఆపి, ''నాకు నీవే నాన్నవు'' అని ప్రకటించమని ప్రాధేయపడుతాడు. బతిమాలుతాడు. ఆ పెద్దమనిషి బూతులు తిడతాడు. ససేమిరా ఒప్పుకోడు. నువ్వు నా కొడుకువని గ్యారెంటీ ఏమిటి? నీ అమ్మ ఎక్కడెక్కడ తిరిగిందో ఎవరెవరితో... నీకు తెలుసా? అన్నాడు. ఉగ్రరూపం దాల్చిన శేషు జబ్బులు కుదిపి నెట్టివేయగానే మోరీ పై పడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగిలింది. గిలగిల కొట్టుకొని చనిపోయాడు. ఒకనాడు అతని భార్యవచ్చి ఇదిగో ఐదు ఎకరాల మిర్చి తోట నీ పేరున రాయించినని కాగితాలు ఇచ్చింది. తల్లులు వేరైనా ముగ్గురికి తండ్రి ఒక్కడే కదా అని అనుకుకొని చెల్లెల్లతో క్షమాపణ కోరుదాం అనుకున్నాడు. వారు అతనిని అన్నగా భావించే స్థితిలో లేరని తెలిసి  పట్టుకున్న కాగితాన్ని నలిపాడు. తనను తాను తమాయించుకొని ఇవి కూడా అవసరమే. ఇది తనకు దక్కిన హక్కుగా శేషు భావించుకున్నాడు.

                నివురు కప్పిన నిప్పులాంటి తప్పుడు మనుషులను మైక్రోస్కోప్లో చూపడమంటే పరిశీలనాత్మక సాహసం చేయడమే. మండే అగ్నిగోళం మతిలో పెట్టుకుని, నోరుగాయితనానికి చిరునామాగా ఎందుకు మారిందో వివరించే జీవితం. ఫ్రస్ట్రేషన్తో బతుకుతున్న ఒక సగటు స్త్రీ వ్యథను స్వర్ణ కిలారి ''నోరుగల్లది'' కథ విరిగిపడిన శకలాలుగా చూపిస్తుంటది. హైమకు ఇద్దరు పిల్లలు. మొగుడు బక్కపీసు. మోసకారి వ్యక్తిత్వం. బయటకి మహానుభావుడు. ఎన్నడూ నోరు తెరవడని పేరు తెచ్చుకున్నాడు.  హైమ పెద్ద కూతురి దావత్‌ చేయలేదని వీరమ్మ, శాంతమ్మలు రచయిత్రి వింటున్నప్పుడు నల్లకాడ నానా రకాలుగా మాట్లాడుతున్నారు. రచయిత్రి తల్లి గుమగుమలాడే పాయసం చేసింది.  హైమాకు, ఆమె పిల్లలు రమ, ఉమకు ఇచ్చి రమ్మని తోలుతది. మోకాళ్ళ మీద కూర్చున్న హైమను ఆమె మొగుడు విపరీతంగా కొడుతుంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన రచయిత్రి  నిశ్చేస్టురాలయితది. తల్లికి చెప్పుతది. రచయిత్రి తల్ల్లి ఆరాతీస్తది. అతని అక్రమ సంబంధమని తెలిసింది. నిలదీసినందుకు నన్ను కొడ్తండు. నేను పాలమ్ముతున్న. సిట్టీలు కడుతున్న. సిట్టి పైసలు రాంగనే ఐదు రూపాయల చొప్పున తెచ్చిన లక్ష అప్పుకోసం కటికాయన వస్తే ఇచ్చిన. ఇంట్లోకి ఏది సరిగ్గా తీసుకురాడు. పిల్లలకు ఉడకేసినది పెడుతున్న. ఒక్కదాన్ని ఎన్నని స్సక్క పెట్టాలనీ ఊటబాయి లెక్క ఏడుస్తూ చెబుతుంది. మొగుడి మహానటనను, మోసాలనీ ఏకరువు పెడుతది. ఆ కష్టాలు వింటుంటే పాఠకుడిలో ఒక దు:ఖపు తెర పేరుకుంటుంది. మహిళలు మారడానికి పరిస్తుతులు ఎలా దోహదం చేస్తాయో ఈ కథ చక్కగా  తెలిపింది.

                లొల్లిలు, నటనలు అన్నీ సావుకాడనే సురువైతయి. పోటీపడుతయి. రక్తికడుతయి. ఉప్పలయ్య సావులో పోటీపడిన నటనలను నగ్నంగా దృశ్యీకరించిన పసునూరి రవీందర్‌ కథ ''సావులొల్లి.'' బొచ్చెగొట్టుకుని ఏడస్తే సచ్చినోడు లేసి వస్తాడా? అని అతనితో జీవితం పంచుకున్న కనకమ్మ అన్నది. మంది బాధకి ఏడ్చింది. పెద్దకోడలు చిన్నకోడలు పోటీపడి అతని మూడు గుంటల జాగకోసం ఏడుపులోనూ నటిస్తున్నారు. డప్పులు మోగుతున్నాయి. తీన్మార్‌ దరువులలో తీర్తం కనపడుతుంది. గాయకుడు లేనిపోని పొగడ్తలతో పాటందుకున్నాడు. చిన్న కోడలను మెచ్చుకున్నాడు. అది విన్న పెద్దకోడలు ఆక్రోషంతో పాటకాన్నిఉరిమి చూసింది. జడుసుకున్నడు కళాకారుడు. ఉప్పలయ్య వీరుడు, శూరుడు అన్నందుకు పెద్దమనుషులంతా నారాజు అయ్యిండ్రు. వాళ్ళు కొరకొర చూపులతో చూసిండు. సావులో మాత్రం ఎవరి లొల్లి వారికున్నది. ఒక్క పాట మనుషులలో లొల్లి పుట్టించింది.  గాయకుడు పరారైండు. అందరి వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో తెలియజేస్తుందీ కథ.

                ఆన్‌లైన్‌ ఆటలు, గేమింగ్‌ ఆప్స్‌తో ఛిద్రమవుతున్న బతుకుల్ని చిత్రించిన బి. నరసన్‌ కథ ''ఆట కాదు... వేట.'' ఈ కథలో మురళి అక్క పెళ్లికోసం జాగ అమ్మగా వచ్చిన ఐదులక్షల రూపాయలను తండ్రి చెప్పగా బ్యాంకులో డిపాజిట్‌ చేశాడు మురళి. మురళి మిత్రులు జగన్‌, ప్రశాంత్‌ ఆన్లైన్‌ గేమ్‌డౌన్లోడ్‌ చేసి ఆట ఆడించారు. ముందుగా మురిపించారు. ఆటలో రెండు లక్షల పోగొట్టుకున్నాక అతనికి వాస్తవం తెలిసింది. తండ్రి బ్యాంకుకు పోయి అడిగితే రెండు లక్షలు డ్రా అయ్యాయి. అని చెప్పాడు క్యాషియర్‌. అప్పటికే జీవితం మీద విరక్తి చెంది రైలుకు ఎదురు వెళ్లి చావాలని నిశ్చయించుకుని మురళి లోలోన కుమిలిపోతూ కూలబడిపోయారు. ట్రాన్సాక్షన్స్‌ చూసిన బ్యాంకు సిబ్బంది మురళిని వెతికారు. ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగితే ఆత్మహత్యను ఆశ్రయిస్తారని పసిగట్టిన బ్యాక్ సిబ్బంది వెతికి తీసుకొచ్చి, నీ కొడుకు సేఫ్‌ అని మురళి తండ్రి కి అప్పగించారు. ''తప్పయింది నాన్న!''  అని కాళ్ళ మీద పడ్డాడు. ''సచ్చి సాధించేది ఏముందిరా?'' అని ప్రశ్నిస్తాడు. నలుగురికి మేలుచేసే పని చేయాలి కానీ అని ఊరడించారు. బ్యాంకు సిబ్బందికి దండం పెట్టాడు తండ్రి. సకాలంలో స్పందించాల్సిన సామాజిక బాధ్యత అందరిపై ఉందని తెలియజేసే ఈ కథ స్ఫూర్తిదాయకంగా ఉంది.

                ఆధునిక కాలంలో మంత్రాల నెపంతో సమాజం మూఢత్వంతో  దాడులు చేసి ప్రాణాలు హరిస్తున్న వైనాన్ని చక్కగా చిత్రించిన బద్ది గణేష్‌ కథ ''నింద.'' కిట్టమ్మ మైసయ్యల ఏకైక కుమారుడు వెంకటేశు కు వైరల్‌ జ్వరంతో బాధపడుతుంటడు. జ్వరం తక్కువ కావాలని సకినం బట్టిస్తరు.  చికిత్స చేయకపోవడం వల్ల వెంకటేశ్‌ చనిపోయాడు. అందరి దృష్టి వెంకటేష్‌ క్లాస్మేట్‌ నాయిన ఎంకయ్య మీద పడ్డది. బర్లు, గోర్లు, పంటలు బాగా లేకపోయినా అతడు మంత్రాలు చేస్తాడని నమ్మకం ఊరోళ్లందరిలో పెరిగిపోయింది. వెంకటేష్‌ చావు కూడా అతనే కారణమని ఊరు ఊరంతా మీద పడ్డది.  ఇల్లుకు ఇంట్లోని మనుషులకు నిప్పు పెట్టిండ్రు. మానవత్వం మచ్చుకులేని ఊర్లో ఒక కుటుంబం కాలి బూడిదైపోయింది. ఈ కథలో పాత్రల పేర్లు పెట్టడంలో శ్రద్ధ వహించాల్సి ఉంది.

                గుమగుమలాడే మస్కట్‌ సెంటు. దుబాయి గర్మికోటు. గల్లలుంగి. టైటాన్‌ వాచ్‌. మెడల బంగారు గొలుసుతో కనపడే ఆహార్యం మస్కట్‌ దుబాయిలకు వెళ్లాలని ఉసిగొలుపుతుంటాయి. ఆ సంపాదన ప్రభావంతో గాలానికి చిక్కిన చేపలాగా జీవితాన్ని కోల్పోతున్న బతుకుల్ని తెలిపే కళాగోపాల్‌ కథ ''ఖల్లివెళ్లి.'' ప్రత్యేకమైనది. దుబాయి, మస్కట్‌ నేపథ్యంగా అల్లంరాజయ్య నుంచి  సంపాదకులు డా వెల్దండి శ్రీధర్‌ వరకు దుబాయి  నేపథ్యంగా చాలా కథలు వచ్చాయి. మోసకారి బషీర్‌ మాటలకు నమ్మిన మల్లేష్‌, గంగవ్వ కోరికపై పరాయి దేశం ఆకాశం కింద బికారి పక్షిలాంటి జీవితం గడిపాడు. వీసా గడువు ముగిశాక కట్కరిలో బంధించబడ్డ పశువుల తీరు జైల్లో బంధించబడ్డాడు. మటన్‌ కొట్టే మాటలు నమ్మిన గంగవ్వ కొడుకును మస్కెట్‌ అప్పుచేసి తోలుతది. సంపాదనకై దూరపు తీరాల్లో పరిగెత్తిండు మల్లేషు. కట్టుకొయ్యకు బానిసగా మగ్గిపోతున్న వారిలో ఖల్లివెల్లి మల్లేషు ఒకడయ్యాడు. పారిపోయి వచ్చిన పశువుల్ని కట్టేసే 'కట్కర్‌'లో బషీర్‌ను బంధిస్తే బాగుండునని ముగించడం ఎంతో వాస్తవంగా ఉంది.                       

తిండిపెట్టలేదని ఎవరిని బదనాం చేయలే. ఆత్మగౌరవం గల మనిషి. ఆత్మగౌరవంతోటే ఆత్మహత్య చేసుకున్న సంఘటన కథగా చదువుతుంటే వ్యవస్థలోని లుకలుకలు అర్థమవుతాయి. ఏ రుణం మిగిల్చకుండా సావాలనుకున్న ధిక్కారమే శిరంశెట్టి కాంతారావు ''దర్భశయ్య'' కథ. గౌరమ్మ చనిపోయాక సూరయ్య ఒంటరివాడయ్యాడు. ఉపావాసంతో కాళ్లు కడుపులో పెట్టుకొని పడుకున్నడు. తన అంత్యక్రియలకు అవసరమైన వాటన్నిటిని సమకూర్చుకున్నాడు. ఎవరికి ఏ భారం మిగిల్చకుండా చనిపోయిన సూరయ్య జీవితమే దర్భశయ్య. కాష్టంకుండ, తలాపున దీపంతలు కుమ్మరి ముత్తమ్మ నుంచి తెచ్చుకున్నాడు.  మూడువేలయితే ఇత్తన్న. నా సావు చేయండ్రని మాదిగ ఇంగిలయ్యకి ఇచ్చాడు. దూదేకుల లాల్‌సాబ్‌ ఇంటి ముందటి చింత చెట్టు కట్టే కొన్నాడు. రేషన్‌ డీలర్‌ బిల్ల మల్లారెడ్డి నుంచి బియ్యం, రామ్‌ నర్సయ్య సేటు వద్ద నుంచి మామిడి పల్లెలో నా సడ్డకుడు చచ్చిపోయిండు  దానం చేయనీకి కావలసిన సరుకులు, దినాలకు కావలసిన యాటను గొల్ల కోటయ్య దగ్గర, అన్ని కట్టుమనీ, తన సావుకు ఎన్ని కావాలో అన్ని తానే కొనుక్కున్నాడు. పంచనామకు వచ్చిన  సర్పంచ్‌ పోలీసుతో దర్భశయ్య మీద పడుకొని ఊపిరి బిగబట్టి చచ్చిపోయినట్టున్నాడని చెప్పిండు.

                కుళ్ళు రాజకీయాలలో ప్రభుత్వ సంస్థలు ఎలా నిర్వీర్యం అవుతున్నాయో తెలియజేసే మనుప్రీతం కథ ''ధర్నా బ్రాంచ్‌.'' పాత ప్రిన్సిపల్‌ చంద్రం ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ప్రిన్సిపల్‌ కు తెలిసాక భవిష్యత్తు వేధిస్తున్న ప్రశ్నగా మిగిలింది. స్టేటస్‌ లేని మైనింగ్‌ బ్రాంచ్‌ కి గౌరవప్రదమైన హౌదా ఇవ్వాలని విద్యార్థులు ధర్నా చేస్తుంటారు. అధికార, విపక్ష నాయకులు పట్టించుకోరు. అందుకే ఆ ప్రిన్సిపల్‌ చచ్చిపోయాడని తెలుస్తుంది. కొత్త ప్రిన్సిపల్‌ కు వ్యతిరేకంగా గిరి తన గర్ల్‌ ఫ్రెండ్‌ తో బ్రేకప్‌ అయిన అతని గర్ల్‌ ఫ్రెండ్‌తో సహా విద్యార్థులు తిరగబడ్డారు. మిషనరీ వాడడం తెలియని కూలీలు సింగరేణిలో అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. అక్కరకు రాణి కోర్సులు వద్దనీ వివరించే కథ భవిష్యత్తుకు మార్గదర్శనం చేసేవిధంగా కథకుడు చిత్రించాడు.

                నీళ్లులేక కన్నీళ్లు. నీల్లుండి కన్నీళ్లుగా మలచిన చందుతులసి కథ ''నీళ్లునీళ్లు. '' నీళ్ల కోసం బోర్‌ ఏసి అప్పులపాలై పట్నం పోయింది సోమయ్య కుటుంబం. కాల్వల నీళ్లు వచ్చాయని తిరిగి వచ్చాక వ్యవసాయం చేస్తే ఏమీ మిగలలేదు. మనకు ఎవుసాయం వద్దని పట్నం పోదామని పోరుపెట్టిన పూలమ్మను బతిమాలి మరో పంట సూద్దామని సోమయ్య బుజ్జగిస్తాడు. కాలక్షేపం కోసం చదివే కథలు కావివి. కథలలో పాత్రలు మనముందు కదలాడుతాయి. పాత్రోచిత సంభాషణలు జీవం ఉట్టిపడుతుంది. ప్రతీ కథాశైలీ ఆకట్టుకుంటూ పాఠకున్ని చదివిస్తుంది. కథ కథలా కాక జీవితంలా కనిపిస్తుంటది.       తెలంగాణ సమాజాన్ని చిత్రించిన కథలు ఇవి. మేలైన కథా సంకలనాన్ని తెస్తున్న సంపాదకులకు జంబూ సాహితి తరపున శెనార్థులు. అభినందనీయులు.                

            తేది: 19-01-2026న  నవతెలంగాణ దర్వాజలో ప్రచురితం.

బతుకు చిత్రాల తలపాగ - ''పగిడి'' కథలు                                  -డా. సిద్దెంకి యాదగిరి.         నవ తెలంగాణ  19-01-2026.