పుస్తక సమీక్ష – 2
I. ప్రాథమిక అంశాలు
- పుస్తకం పేరు: సహచరుల జ్ఞాపకాల మధ్య చంద్రశేఖర్ ఆజాద్
- రచయిత: నిర్మలానంద
- పేజీలు: 151
- ధర: రూ. 200/-
- ప్రతులకు: 7989546568
- పబ్లిషర్స్ వివరాలు:............
- సమీక్షకుల పేరు: ........................................
- తరగతి: ........................................
II. సంక్షిప్త సమాచారం
‘విప్లవ సహచరుల జ్ఞాపకాల మధ్య చంద్రశేఖర్ ఆజాద్’ పుస్తకం భారత స్వాతంత్య్రోద్యమంలో అజరామరమైన విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, దేశభక్తిని ఆయనతో కలిసి పనిచేసిన విప్లవ సహచరుల జ్ఞాపకాల ద్వారా పరిచయం చేస్తుంది. రచయిత నిర్మలానంద ఆనాటి విప్లవకారులు రాసిన వ్యాసాలను తెలుగులోకి అనువదించి నేటి తరానికి అందించడం అభినందనీయం.
చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆజాద్ ధైర్యసాహసాలు ఈ పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తాయి. కోర్టులో తన పేరు ‘ఆజాద్’, తండ్రి పేరు ‘స్వతంత్రం’, ఇల్లు ‘జైలు’ అని చెప్పడం ఆయనలోని దేశభక్తికి నిదర్శనం. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని శిక్ష అనుభవించిన ఆజాద్, చౌరీచౌరా ఘటన అనంతరం ఉద్యమాన్ని నిలిపివేయడంతో విప్లవ పంథా వైపు మళ్లాడు.
హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. కాకోరి ఘటన, భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్ తదితర విప్లవ సహచరులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఆయనలోని నాయకత్వ లక్షణాలను తెలియజేస్తాయి. సహచరుల పట్ల ఆయన చూపిన ప్రేమ, విశ్వాసం, త్యాగం పుస్తకంలో హృద్యంగా ప్రతిఫలించాయి.
సహచరుడి ద్రోహం కారణంగా అల్ఫ్రెడ్ పార్క్‌లో పోలీసుల చేతికి చిక్కినా, బ్రిటిష్ వారికి లొంగకుండా తనను తాను కాల్చుకొని అమరుడైన ఆజాద్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. స్వేచ్ఛ అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదు; అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం కూడా అనే సందేశాన్ని ఈ పుస్తకం అందిస్తుంది.
III. అభిప్రాయం
ఈ పుస్తకం చంద్రశేఖర్ ఆజాద్ దేశభక్తి, ధైర్యం, త్యాగం, సహచరుల పట్ల ఆయనకున్న నిబద్ధతను పరిచయం చేస్తుంది. విప్లవకారుల జ్ఞాపకాల ద్వారా చరిత్రను సజీవంగా చూపించడం ప్రత్యేకత. విద్యార్థులు తప్పక చదవాల్సిన స్ఫూర్తిదాయకమైన పుస్తకమని నా అభిప్రాయం.