నాటి నుంచి నేటి వరకు మానవుని జీవితంలో అంతర్భాగమైన కథకు ఎంతో ఆదరణ ఉంది. ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక మార్పులు వచ్చి పుస్తక పఠనం తగ్గినప్పటికీ కథకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. జీవితంలో వచ్చే అనేక సంఘర్షణలకు పరిష్కారాలను చూపడం, బుద్ధి కుశలతను పెంపొందించడం కథల ప్రధాన లక్ష్యం. వాస్తవిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రించడం కథల యొక్క లక్షణం. స్వరాష్ట్ర ఏర్పాటులో కూడా కథ ప్రధానమైన పాత్ర పోషించింది.అలాంటి కథలను అందించిన కథ పుస్తకం సిద్దెంకి యాదగిరి "తప్ష". "ఒక కథకుడికి రచన సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చు కానీ జీవితము తెలియకపోతే సరి చేయడం ఎవరివల్లా కాదు" అన్నాడు కొడవటిగంటి కుటుంబరావు. మనవుని జీవితాన్ని ముడిసరుకు చేసి జీవిత వాస్తవికతను కళాత్మకంగా వ్యక్తీకరించి పాఠకుడిని ఆలోచింపచేయగలిగిన కథకులు సిద్దెంకి యాదగిరి. కథ మనిషి జీవితంలో అంతర్భాగం... మనిషి జీవిత ప్రతిబింబం కథ.
సిద్ధంకి యాదగిరి కథలు నిత్యనూతనంగా ఉంటాయి. కథ వస్తువు నవ్యత తో పాటు సామాజిక వాస్తవిక జీవితానికి దృశ్య రూపకంగా తోస్తుంది. కథను వినూత్న రీతిలో వ్యక్తీకరించడం, కథలోని మాలుపులు పాఠకులలో ఆలోచన రేకెత్తించి, ఉత్సుకథ కలిగిస్తాయి. కథను ఆకట్టుకునేలా రాయడంలో సిద్దెంకి కథలా ప్రధాన లక్షణం. తప్ష లో మొత్తం 15 కథలు ఉన్నాయి."ఆత్మ గౌరవ సాధన నినాదంతో ప్రయాణించిన మహనీయులకు మరియు సిద్దెంకి యాదగిరి నాయినమ్మ సిద్దెంకి మలవ్వ" అంకితం ఇవ్వడం జరిగింది.
సిద్దెంకి యాదగిరి తప్ష కథలలో మొదటిది ' విరిగిన కల' ఈ కథ ఎంతో వైవిధ్యంతో కనబడుతుంది. ఈ కథ పేరులోనే రచయిత యొక్క శిల్పనైపుణ్యం తెలుస్తుంది. కలలు కనడం మానవ సహజం.... కానీ ఆ కలలను సహకారం చేసుకునే కృషే ఈ కథ. ఈ కథలోని పాత్రలు ఊశయ్య , ముత్యాలు, ఈరమని. ఊశయ్య , ముత్యాలు భార్యాభర్తలు. వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. భార్య ముత్యాలు ఒత్తిడి వల్ల ఊశయ్య రెండవ పెళ్లి చేసుకుంటాడు.ఇది ఈ కథ యొక్క ఇతివృత్తం. వారు సంతానం కోసం " మొక్కని దేవుడు లేడు తిరగని తీర్థం లేదు". భర్తకు భోజనం పెట్టి ముత్యాలు ఇలా అన్నది " ఇగో మిట్టపల్లి కాడ తల్లి చచ్చిపోయిన బిడ్డ ఉన్నాడట. తెచ్చుకుందాం సాదుకుందాం. నంగునూర్ల తండ్రి సచినపోరగండ్లు నల్గురున్నారట. ఒక్కరిని ఇస్తారట ఏమంటవు". అనడంలో తల్లితనంకై ఆరాటాన్ని ఆవిష్కరించినాడు. స్త్రీ త్యాగానికి మారుపేరని, అరమరికలు లేని ప్రేమ కు నిదర్శనం అని నిరూపించాడు. సంతానం కోసం ఊశయ్యకు గర్భవతి అయినా ఈరమనితో ముత్యాలు వివాహం చేయడం కథ మరింత పరిపుష్టం అయింది. సంతానం కలవడంతో ఒకరోజు ఊశయ్య , ఈరమని మందలించడం. ఈరమని భర్తను కూడా లెక్కచేయకుండా
ప్రవర్తించడం తో కథ ముగుస్తుంది.
"ఒగోల్ని అనడు.. ఓగోల్తోటి అనిపించుకోడు, పిల్లగాడంటే గట్లుండలె" అనే అన్మంతు అనే పాత్రతో పల్లెటూరులో ఉండే వావి వరుసలు, అనుభవ పాఠాలను అశువుగా అందించిన గురువులుగా అందించాడు.
"పైసలు చేయని పని మనుషులు జేత్తరు" అనడంలో పల్లెలో ఉండే సహకార భావన ఉంది. ఎవరు ఎలాపోయే నాకేంటి నేను బాగుంటే చాలు అనే ప్రస్తుత సమాజానికి బుద్ధిచెప్పే మాటే ఈ" బుద్ధి మాట "కథ.
మనుషుల మనసులు కదిలించిన కథ" బోధ". చదువు ద్వారా సమసమాజ స్థాపన జరుగుతుంది. "పాఠశాల చిన్న సమాజం" అందులో పుస్తక పాఠాలు కాదు... జీవిత పాఠాలు నేర్చుకుంటారు. భారతదేశంలో కులాలు, ఉపకులాలు అనేకం ఉన్నాయి. పూర్వం నుండి కులాల మధ్య అస్పృశ్యతలు సహజంగా కనిపిస్తాయి. కానీ ఉప కులాల మధ్య కూడా అనేక అస్పృశ్యతలను గుర్తించి బోధ కథను నిర్మించడం రచయిత యొక్క పరిశీలన దృక్పథానికి తార్కానంగా చెప్పవచ్చు."బల్లె కులానికి ఒకడు చదువుతాడు అన్లా అందరికంటే తక్కువ కులపోలు మనమే కదా? అవునా కాదా ? నా తోటోళ్లు నేను కలిసాడుకుంటునం. కలిసి చదువుకుంటున్న". అని మానవులంతా ఒక్కటేనని బాలయ్య పాత్ర ద్వారా తెలియజేశాడు. జంతువుల మధ్య లేనటువంటి ఈ భేద భావం మానవుల్లో ఎవరు కలిగించారు అని వ్యతిరేకిస్తూ "ఎవరైనా మట్టి పని చేసిన సరే అందరూ మీ పొరగాండ్లను బడికి సదవడానికి పంపుండ్రి " అని చదువు యొక్క ఆవశ్యకతను రఘుపతి రెడ్డి అనే మరొక పాత్ర ద్వారా చెప్పించాడు రచయిత. సమాజంలో అందరూ జ్ఞానవంతులైనప్పుడే సమసమాజ స్థాపన జరుగుతుంది. కొడుకు పుట్టాడన్న సంతోషం తీరకముందే, కళ్ళారా చూడకముందే దేశం కోసం దేశ రక్షణలో ప్రాణాల సైతం తృణప్రాయంగా వదిలినట్టి సైనికుడి కదే రేపటి సూర్యుడు.ఇది గుండెను పిండేసిన కథ."చనువాళ్ళతోపాటు కన్నీళ్లు కూడా సేవిస్తున్నాడు నాన్న దృష్టిలో రేపటి కమాండర్" అన్న ఈ మాటలుకు కనులు చెమ్మగిల్లక తప్పదు. ఇది సైనిక పరాక్రమాలతో పాటు, గ్రామీణ జీవనానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. రాయి తగిలి చచ్చిపోయే వాళ్లు, ప్రమాదంలో ఆయువు మోడిన వాళ్లు, పగలతో కొట్టుకొని చనిపోయే వాళ్లు, ప్రతి ఒక్కరు ఏదో ఒక తీరుగా, ఎప్పుడూ ఒకప్పుడు చనిపోతారు. చావడం తప్పనప్పుడు ప్రజల కోసం, దేశం కోసం, చావడంలో అమరత్వం ఉంటుందని రచయిత తెలియజేశారు.
మార్పు కథ మరో భిన్నమైన జీవితాన్ని పట్టుకున్నది. ఏదైనా ఒక విషయాన్ని కంటితో చూడడం సహజం కానీ ఒక విషయాన్ని హృదయాంతరాల నుంచి వెలికి తీయడం రచయితకు సాధ్యం. రోడ్డు పక్కనో, సిగ్నల్ దగ్గరనో, బస్ స్టాపుల్లో, రైల్వే ప్లాట్ఫారంపై చాలామంది బాలల దుస్థితిని మనం చూస్తూనే ఉంటాం. కానీ వాటిని కొంత సమయంలో మర్చిపోవడం జరుగుతుంది. రచయిత మాత్రం దానిని దేశ ముఖచిత్రంపై దారిద్యం యొక్క జాడలకు నిదర్శనంగా నిలబెట్టారు. రచన సామాజిక చైతన్యానికి, బాధ్యతకు నిదర్శనమని నిరూపించారు.
సునీల్ అనే ఉపాధ్యాయుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి స్పీడ్ గా వెళ్తుంటే 8 సంవత్సరాల పిల్లవాడు చింపిరి జుట్టు మోసిన బట్టలతో ఎదురొచ్చి కాళ్ళ మీద వాడతాడు. అలాగే సునీల్ కాళ్లపై కూడా ఆ పిల్లవాడు పడడం. పది రూపాయల కోసం అతని ఆరాటం ఆకలి పోరాటాన్ని గమనించి అరడజన్ అరటి పండ్లు కొని అతని ఆకలి తీర్చాడు."ఏవూర్రా మీది?"
"ఏమో తెలియదు"
" సదువుకో పోయినావురా?"
"సదువనియ్యారు" " అదే?"
"మేం అడుక్కొచ్చి మాయ్యవ్వలకు రోజు పైసలు ఇవ్వకపోతే తిండి పెట్టరు". ఈ సంభాషణ ఆకలి యొక్క తీవ్రతను బాల కార్మికుల యొక్క దుర్భర పరిస్థితిని మన కళ్ళకు కడుతుంది. కన్న తల్లిదండ్రులు కూడా ఇలా ప్రవర్తించడం ఎంత అమానవియం. పసివాడని చూడకుండా పక్క బొక్కలు ఇరిగేదాకా కొడతారా సోయి తప్పి పడిపోయిన పట్టించుకోని తల్లిదండ్రులు ఉంటారని? మనం ఊహించగలమా! పిల్లవాడికి సోయి వచ్చిన తర్వాత తను పక్కనే తాగుతూ మాట్లాడుకుంటున్న తల్లిదండ్రులు గాని తల్లిదండ్రుల మాటలు విని చెత్తకుండీలో తెచ్చుకున్నారని గుర్తించాడు. పిల్లవాడు కంట్లో యాసిడ్ పోసి గుడ్డివాడిని చేయాలన్న వారి ఆలోచన విని కన్నీటి సంద్రం అయ్యాడు పిల్లవాడు. ఆ పిల్లవాడినే కాకుండా వాళ్ళ తమ్ముడిని, చెల్లెల్ని పరిస్థితులను వివరించాడు. హాస్టల్లో చేరితే సమయానికి ఆహారం దుప్పట్లు ఇస్తారని చెప్పిన పిల్లవాడు మాటలు, బాల కార్మికుల భావోద్వేగాలు పాఠకుల హృదయాలు స్పందింప చేస్తుంది.
తప్ష కథలో చదువుకున్న వారిలో పైకి కనిపించని కులవివక్ష ఎలా ఉందో వివరించాడు. గుడిసెలాంటి మిద్దె ఇంట్లో తన కంట్లో దీపం వెలిగించుకుని చదివి ఉద్యోగం సంపాదించిన నర్సయ్యను కులం నొసటిమీద పత్స బొట్టై వెక్కిరించింది. ఉద్యోగరీత్యా సిద్దిపేటలో కిరాయి రూంల కోసం వెతుకుతున్నపుడు రూం కిరాయికి ఇవ్వం అని మొఖం మీదనే చెప్పడం.కుల రక్కసి రకరకాలుగా వేధించినప్పుడు ఎలాగైనా ఇంటి స్థలం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.కొంత జాగా తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఇందులో కులం నిన్ను ఏ స్థాయిలో ఉన్నా విడిచిపెట్టదు అని నిరూపించాడు. వెల్కమ్ నగర్లో నడకతో రోజును ప్రారంభించే అందరూ ఉద్యోగస్తులే అయినా కులం వారిలో విభజన రేఖలను గీసింది.
కన్నయ్య దంపతులు ఇంటికి వచ్చి బొట్టు పెట్టి ఆహ్వానించడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది రాకేశ్ సార్ని. తను ఆహ్వానించగానే అంబేద్కర్ వాంచించిన ప్రపంచం ఆవిష్కృతమైందని సంతోషంతో పొంగిపోతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పాలని ఉవ్విళ్లూరుతున్న రాకేష్ సార్ కు. లోకల్ కు వెళుతున్న నర్సయ్య సార్ కనిపించాడు.కన్నయ్య సార్ వాళ్ళు కార్డు ఇచ్చిండ్రా? అని అడిగాడు...లేదు ఇవ్వలేదే? అని ప్రశ్నార్థకంగా మొఖం పెట్టిండు నర్సయ్య సార్. వాళందరిది బిల్డింగ్లు ధనికవర్గం. నాది రేకుల షెడ్డు బీద వర్గం. ఎప్పుడైనా ధనికులందరూ ఒక్కటే అని అనుకున్నాడు. ఇది ఒక్క వ్యక్తికి జరిగిన అవమానం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఇది ఆత్మగౌరవ జరిగిన అవమానం."నిన్నొక తీరు. నన్నొక తీరు పెండ్లికి పిలిచారు. నర్సన్నను ఇప్పటివరకు పిలువనేలేదు" దేశం నరాలలో పారుతుంది రక్తమా?లేక కులమా? అన్నట్లు ఉంది. రాకేష్ సార్, వెంకటయ్య సార్, నర్సయ్య సార్లు పోతే అందరం పోదాం.లేకుంటే లేదు. అని తప్ష చేసుకున్న తీరు ఈ కథకు పతాకస్థాయికి తీసుకొచ్చాడు రచయిత.
ఈ కథలు మట్టిలో పుట్టిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ గ్రంథ పురస్కారముగా కథా ప్రక్రియలు 2019వ సంవత్సరానికి ఎంపికైనది.
మామూలు జీవితాలే అయినప్పటికీ మహోన్నతంగా తీర్చిదిద్దిన సిద్ధంకి యాదగిరి కథ రచన నైపుణ్యం పాటకున్ని ఎంతగానో హత్తుకునేటట్లు చేస్తుంది. ఈ కథలలో చదివించే గుణం కలదు.
సిద్దెంకి యాదగిరి కథలు క్లుప్తంగా, నిర్దిష్టంగా ఉంటాయి. భావుకతతో కూడిన కథలు అందించడంలో రచయితది అందెవేసిన చేయ్యి. పాత్రల మధ్య సంఘర్షణ, సమస్యల సంక్లిష్టతను చూపడం జరిగింది. కథాంశాలు ఎక్కడ సడలిపోకుండా ఎత్తుగడలు ప్రదర్శించడం.
ఈ కథశిల్పం పాఠకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తుంది. సిద్దెంకి రచనల్లో పల్లె మట్టిసౌరభాలు, సామెతలు, పలుకుబడులు తెలంగాణ భాషాయాస మూలాలను నిలుపుతాయి. అచ్చమైన పల్లెజీవనము, సహకార, ఆదర్శతత్వాలు పాఠకుల హృదయాలను తట్టిలేపుతాయి. సిద్దెంకి కథలు తెలంగాణ భాషాయాసలను చిరునామాలుగా నిలుస్తాయి.